Thursday, 23 February 2023

త్వ‌ర‌లోనే బాస‌ర ఆలయ పునర్నిర్మాణంశృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనంశృంగేరి వెళ్ళివ‌చ్చిన ఆల‌య బృందంతో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష‌


నిర్మ‌ల్, ఫిబ్ర‌వ‌రి 23: ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయాలకు పున‌ర్వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన‌ సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు  బాస‌ర ప్ర‌ధాన‌ ఆల‌య‌ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ దిశానిర్ధేశం మేర‌కు  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశానుసారం బాస‌ర ఆల‌య బృందం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వద్దకు వెళ్ళారు. ప్ర‌ధాన ఆల‌య అభివృద్ధి, విస్త‌ర‌ణ ప్లాన్ తో  పాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్ర‌తిపాద‌న‌ల‌ను స్వామి ముందుంచారు.  ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించ‌డం, సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్ర‌త్యేక నిర్మాణం, మహంకాళి అమ్మ‌వారి ప్ర‌తిమ వెనుక ప్రాకారం మండంపం, ప్రాకారం లోప‌ల శివాల‌య పునః ప్ర‌తిష్ట, ద‌త్తేత్రేయ స్వామివారి స్థ‌ల మార్పిడి, న‌లుదిక్కులా రాజ‌గోపురాలు నిర్మాణం, అనివేటి మండ‌ప విస్త‌ర‌ణ‌, ద్వ‌జ స్తంభం ఏర్పాటు, ఆల‌య ప్రాంగ‌ణంలోనే యాగ‌శాల ఏర్పాటు వంటి వాటిపై శృంగేరి పీఠాధిపతి పలు మార్పులు, చేర్పులు, సూచ‌న‌లు చేశారు. 
శృంగేరి పీఠం నుంచి తిరిగివ‌చ్చిన ఆల‌య బృందంతో గురువారం ఇవాళ శాస్త్రిన‌గ‌ర్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్  రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా శృంగేరి పీఠాధిప‌తి చేసిన మార్పులు, సూచ‌న‌లను  వారు మంత్రికి వివ‌రించారు. శృంగేరి పీఠాధిప‌తి సూచ‌న‌లు పాటించాల‌ని, దానికి అనుగుణంగా ఆల‌య పున‌ర్నిర్మాణం ప్లాన్ ను సిద్దం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా క్యూ కాంపెక్స్, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి కార్యాల‌యం, 100 గ‌దుల చౌల్ట్రీ, దాతల స‌హాయంతో  నిర్మించే 50 వ‌స‌తి గ‌దులు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్ ను రూపొందించాల‌ని సూచించారు.  ఆల‌య పున‌ర్నిర్మాణం ప్లాన్ తో పాటు మాస్ట‌ర్ ప్లాన్ ను సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళిన త‌ర్వాత‌, ఆయ‌న ఆదేశాల మేర‌కు ప‌నులు చేప‌డ‌తామ‌ని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 
మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో ఈవో విజ‌య రామారావు, స్థ‌ప‌తి వ‌ల్లి నాయ‌గం, ఎస్ ఈ మ‌ల్లికార్జున్ రెడ్డి, ఆల‌య‌ చైర్మ‌న్ శ‌ర‌త్ పాఠ‌క్, స్థానాచార్యులు, పూజారులు, త‌దిత‌రులు ఉన్నారు.

చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష!. కేసు దర్యాప్తులో టీఎస్‌ఆర్టీసీ జేడీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ది కీలకపాత్ర. ఆయనను అభినందించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌*

 
16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఐపీఎస్‌  స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్‌ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్‌ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. 
చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అభినందించారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను ప్రశంసించారు. కెరిర్‌ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు. 
"పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్‌గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్‌ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ చొరవ ప్రశంసనీయం." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌  గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు.

చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఐపీఎస్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్‌, రాజేంద్ర కుమార్‌, హరిగోపాల్‌, కానిస్టేబుల్‌ హనుమంతరావు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీడీ లక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, ఐటీ చీఫ్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. 

Monday, 20 February 2023

*టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. !**▪️మంత్రి పువ్వాడ సూచనలతో మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్ బస్సులు. **▪️కొత్త బస్సును పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా సంస్ధ ఎండి ఆరా.


ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. 
ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. 
ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. 
నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.
ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, పరిశీలించారు. 
బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

*▪️బస్సు ప్రత్యేకతలివే..*!
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. 
బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే  సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుయి
ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. 
వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది.  ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. 
ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. 
అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. 
ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో  ఉంటుంది.

తిరుమల జాపా(బా)లి హనుమకు గదను సమర్పించిన భక్తులు...

తిరుమలలో ప్రముఖమైనది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. ఎత్తయిన వృక్షాలు.. ఇలా పచ్చటి లోయలో వెలసిన ప్రాకృతిక పర్ణశాల జాబాలి తీర్థం. దీనినే జాపాలి తీర్థంగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇట్టి మహిమాన్విత క్షేత్రం ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టి రామభక్త లంకా భీకర అసుర సంహారక హనుమకు ఫిబ్రవరి 19వతేది ఆదివారం అనంతాళ్వాన్ తోట ఆధ్యుడు అయిన శ్రీ అనంతాళ్వాన్ 969వ అవతార విశేష ఉత్సవం  సందర్భంగా.. అనంతాళ్వాన్ 26వ తరం వారసులు శ్రీమాన్ టి.ఏ.పి.రంగాచారి ఆశీస్సులు అందుకున్న అనంతరం  విజయవాడకు చెందిన పివి రామిరెడ్డి (అనంతళ్వాన్ దివ్య చరిత్ర పుస్తక రచయిత) జగదీష్,  కత్తి సాయి కృష్ణ, నంబూరు నరసింహారావు, రావుల రాజా, భక్త బృందం "గద"ను సమర్పించారు.

అనంతరం ఊరేగింపు గా జపాలి తీర్థం  తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు.. అర్చకులు అ "గద"ను స్వామి కి కుడి వైపున వుంచి ప్రత్యేక పూజలు చేశారు.. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన కార్యక్రమంలో సమర్పకులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు...

దశాబ్దాలుగా ఈ ఆలయం హాథీరామ్‌జీ మఠం ఆధ్వర్యంలో నిర్వహణ పూజాధికాలు సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శించ వచ్చిన భక్తుల్లో చాలామంది జాపాలి ఆంజనేయుణ్ణి దర్శించుకుంటారు. దుష్ట గ్రహ నివారణకు, ఆరోగ్య సిద్ధికి స్వామిని సేవిస్తారు.
తిరుమల శిఖరాలపై ధర్మపథ, జ్ఞానపథ, ముక్తిపథ, భక్తిపథ తీర్థాల పేరిట 108 పుణ్య తీర్థాలు ఉన్నాయి. వాటిలో జాబాలి తీర్థం
జాపాలి తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో మధ్యలో దిగాలి. అక్కడి నుంచి పావు కిలోమీటరు దూరం మెట్ల మార్గంలో వెళ్లాలి. తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం పక్కన ఉన్న దారి గుండా... కాలినడకన జాపాలి ఆంజనేయుడి సన్నిధికి చేరుకోవచ్చు. కాకపోతే, దట్టమైన అరణ్యం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గాన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అపర రేణుక అంశగా భావించే బాట గంగమ్మను పూజించి, దారిలో ఏ ఇబ్బందీ లేకుండా చూడాలని వేడుకుంటూ ఉంటారు.
జాబాలి తీర్థం పరిసరాల్లో ఆధ్యాత్మికత తొణికిసలాడుతుంటుంది. చుట్టూ చిక్కని పచ్చదనం.. మధ్యలో కోనేరు... చూడముచ్చటగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదట. భగవంతుని కోసం ఆయన కఠోర తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశం ఇది. అందుకే ఈ తీర్థం.. జాబాలి తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా ఇక్కడి జాబాలి ఆశ్రమానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడి తీర్థంలో రాముడు స్నానమాచరించాడని అంటారు. ఆ తీర్థాన్నే ‘రామకుండం’గా పిలుస్తున్నారు. ఈ తీర్థ ప్రాశస్త్యం స్కాంద, వరాహ పురాణాల్లోనూ కనిపిస్తుంది.
జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. అంజనాదేవికి.. స్వామి హనుమ ఇక్కడే జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఉత్తరాభిముఖంగా ఉన్న కపీశ్వరుడిని పూజించడం ద్వారా గ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జాపాలి తీర్థాన్ని ‘ఆనందాశ్రమం’గా కూడా అభివర్ణిస్తారు. ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత.. మానసిక ఆనందం సిద్ధిస్తుందని నమ్మకం.తప్పకుండా దర్శించవలసిన అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి జన్మస్థల క్షేత్రం శివుడు రుద్రాంశలో ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ముందే ఒక మహా భక్తునికి ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చిన స్థలం.

ఆంజనేయ స్వామి వారి తల్లి అంజనాదేవి కఠిన తపస్సు చేసిన పుణ్యస్థలం.
పరమ పవిత్ర తిరుమల క్షేత్రంలో శ్రీరాముడు స్నానమాచరించిన  రామగుండం తో పాటు అనేక విశేషాలకు నెలవైన ఆ  క్షేత్రమే  *జపాలి క్షేత్రం.*
స్థల పురాణం
త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి
అయితే *జాబాలి* అనే మహర్షి హనుమంతుడి అవతారనికంటే ముందే ఆ రూపాన్ని దర్శించి, ప్రసన్నం చేసుకోవాలని తలచి అనేక చోట్ల ఘోర తపస్సు చేస్తూ తిరుమల కొండపై అనేక జప / హోమాలు చేసిన పిమ్మట స్వామి సంతోషించి భవిష్యత్తులో అవతరించబోయే హనుమంతుని రూపాన్ని ఇక్కడ స్వయంభుగా వెలసి జాబాలి మహర్షికి చూపించినాడని స్థల పురాణం.
జాబాలి మహర్షి జపాలకు మెచ్చి స్వామి స్వయంభుగా వెలసినందువల్ల ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పిలవబడుతోంది.
ఈ క్షేత్రంలోనే పరమ పవిత్రమైన తీర్థాలైన రామగుండం, సీతాగుండం, ధృవతీర్థం వంటి తీర్థాలు ఉండటం వల్ల జపాలి తీర్థం అయ్యింది.
శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి, సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట. అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా ఉన్న తీర్థం ) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం (ఆలయం వెనుక వైపు) అనీ పిలుస్తారు వినీల ఆకాశంలో ధృవతార గా వెలుగొందుతున్న భక్త ధృవుడు తపమాచరించినాడట. ఇప్పటికీ ఇక్కడ ధృవ తీర్థం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే ఆంజనేయస్వామి వారి కైంకర్యాలకు  వినియోగిస్తున్నారు. ఈ తీర్థములోని నీరు అనేకఔషధ గుణాలు కలిగి ఉన్నవని ప్రతీతి.ఆలయానికి పశ్చిమాన ఉన్న తీర్థాన్ని హనుమాన్ తీర్థం అని పిలుస్తున్నారు.

ఆలయ విశిష్టత .
ఎటువంటి కష్టానష్టాలున్నా స్నానం చేసి తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం. జన్మ శని కలిగినవారు తమ పుట్టినరోజు నాడు ఇక్కడ స్వామి వారికి పూజ, అభిషేకము చేస్తే శని ప్రభావం వల్ల కలిగే అనేక బాధలు కలగవు అని మరో విశ్వాసం. అలాగే పంచమహా పాతకాలు, భూత, ప్రేత, పిశాచాది బాధలు ఉన్నవారు ధృవ తీర్థంలో స్నానామాచారిస్తే ఆ కష్టాలు తీరుతాయని స్కాందపురాణంలోని వేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడింది
జాబాలి మహర్షి ఇక్కడి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడైనాడట
శ్రీవారి ప్రియ భక్తులైన
శ్రీ హాథీరాంబావాజీ కూడా ఇక్కడే సంచరిస్తూ తపస్సు చేసుకునేవారట.
ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ హాథీరాంజీ మఠం వారి ఆధీనంలో ఉన్నది
ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు భాగం వినాయకుడి ఆకారంలో ఉండటం మరో విశేషం.
తిరుమల వెళ్లినపుడు తప్పకుండా జపాలి క్షేత్రాన్ని దర్శించుకోండి.

Saturday, 18 February 2023

కమనీయం కళ్యాణ శ్రీనివాసుని రధోత్సవం...అడుగడుగునా భక్తుల మంగళ హరతులు

తిరుపతి కళ్యాణ శ్రీనివాసులు భక్తుల మనోరధాన్ని అధిరోహించాడు రధారవుడై శ్రీనివాస మంగాపురంలో వారిని కరుణించాడు  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 7.10 నుండి 8.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.  రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.

Monday, 13 February 2023

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

 శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ముత్య‌పు పందిరి - స‌క‌ల సౌభాగ్య సిద్ధి
    ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీనివాసుడు మూడో రోజు రాత్రి  ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు.  మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు
      ఆలయం వద్ద గల వేదికపై ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 
      సాయంత్రం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి రవిప్రభ నాదస్వరం, శ్రీ చంద్రశేఖర్ డోలు బృందం మంగళధ్వని వినిపించారు. ఆ తర్వాత శ్రీ కె.సుధాకర్ బృందం గాత్ర సంగీతం, శ్రీమతి బి.చిన్నమదేవి బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి


తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సింహ వాహనం - ధైర్య‌సిద్ధి
 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.

Saturday, 11 February 2023

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

 శ్రీనివాసమంగాపురంలోని 
శ్రీ  కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శనివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో  కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.  అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.

Thursday, 9 February 2023

19న తిరుమల శ్రీవారి పుష్పకైంకర్యాలకు ఏడుకొండలఫై పుష్పవనం ఏర్పాటు చేసిన అనంతాళ్వాన్

అనంతాళ్వాన్.జన్మించినది కర్నాటక రాష్ట్రములోని మైసూరునకు దగ్గిరలోని శ్రీరంగ పట్టణ కు 3 కి.మీ.దూరములో ఉన్న కిరంగూర్ లో జన్మించారు.

Tuesday, 7 February 2023

2వేలిస్తే తిరిగి ఇవ్వారు... ఇహపై బ్యాంకులోనే గులాబీ నోటు...


*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు మంగళవారం ఉదయం నుండి దేశంలోని అన్ని బ్యాంకుల మీద కొత్త నియమాలను అమలులోకి తీసుకు వస్తోంది. బ్యాంకులు ఈ రోజు మంగళవారం నుండి కస్టమర్ల నుండి 2000 రూపాయల నోట్లు స్వీకరించగలుగుతాయి గానీ, మళ్లీ కస్టమర్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2,000 రూపాయల నోట్లని ఇవ్వకూడదు.

డిసెంబర్ 2019 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను ముద్రించడం నిలిపివేసింది. మనీలాండరింగ్ లాంటి కార్యకలాపాలు పెద్ద నోట్లను వాడుతున్నట్లు మోదీ ప్రభుత్వం భావించడం వలన దశలవారీగా 2,000 నోట్లని ఉప సమర్ధించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే 2000 రూపాయల నోట్లని రద్దు చెయ్యడానికి సన్నాహాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

*ATM లలో కూడా ఉండవు*

ఈ రోజు నుండి ATM మెషిన్లలో కూడా రూ. 2,000 రూపాయల నోట్లు లోడ్ చెయ్యొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది..

Sunday, 5 February 2023

భావి భారత నిర్మాణానికి నాంది 'యువ ధార్మికోత్సవం టిటిడి పిఆర్వో డాక్టర్ టి. రవి


  
తిరుమలలో ఘనంగా ప్రారంభమైన యువ ధార్మిక సమ్మేళనంయువతకు విద్యతో పాటు వినయం, సంస్కారం అలవడినప్పుడే సమాజంలో చక్కటి పౌరులుగా భావి భారత నిర్మాణానికి నాంది అవుతారని టిటిడి పిఆర్వో డాక్టర్ టి.రవి అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో యువ ధార్మిక సమ్మేళనం రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఆర్వో  మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు అందించిన వేదాల్లోని సారాన్ని, అధ్యాత్మిక చింతనను చిన్నతనం నుండి అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. తల్లిదండ్రుల, గురువుల మాట వినాలని, తమ పని తాము చేసుకుంటూ ఆదర్శంగా నిలవాలన్నారు. 
సమాజంలో నడుచుకోవాల్సిన తీరు, మానవత్వంతో వ్యవహరించాల్సిన విధానం, దైవత్వం సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర విషయాలను వివరించారు.
అనంతరం సిఏఓ శ్రీ శేషశైలేంద్ర
కార్యక్రమంలో  దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు యుక్త వయసులో ప్రతి మానవునిలో గొప్ప పరిణామం కలుగుతుందని,  ఈ వయసులో నేర్చుకునే విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు.ఈ కారణంగానే భారత యువతను ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా ఉన్నారని చెప్పారు. మానవ జీవితంలో రామాయణం, భగవద్గీత, భాగవతాల ప్రాముఖ్యతను వివరించారు.
 దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ప్రసంగిస్తూ, యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికి విద్య రావచ్చు గాని, సంస్కారం రాదని, సంస్కారం కలిగిన వ్యక్తి దేవుడు గురించి ఆలోచిస్తాడన్నారు. పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లు, మనిషి ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి రెండు రెక్కలు కావాలని, అందులో ఒకటి మానవ ప్రయత్నం, రెండవది దైవానుగ్రహం అని తెలియజేశారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు సంస్కారవతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. 
  ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 1600 మంది 10 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు పాల్గొన్నారు.

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి


తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.
రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలీసుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ మజ్దూర్‌లు భక్తులకు దారి పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. పాపవినాశనానికి భక్తులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 30 బస్సులను నడిపింది. పాప వినాశనం వద్ద పార్కింగ్‌కు స్థలం పరిమితంగా ఉన్నందున గోగర్భం డ్యాం పాయింట్ దాటి ప్రైవేట్ ట్యాక్సీలు మరియు జీప్‌లను అనుమతించలేదు.   మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు.
     పాపవినాశనం డ్యాం వద్ద అంబులెన్స్‌తో పాటు మూడు పాయింట్ల వద్ద వైద్య బృందాలను ఉంచారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు 100 మంది శ్రీవారి సేవకులను నియమించారు.
     టీటీడీ, పోలీస్, ఆర్టీసీలోని సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.  స్థానికులతో పాటు తమిళనాడు మరియు కర్ణాటక నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులకు ట్రెక్కింగ్ సాఫీగా జరిగేలా చూసారు.

Saturday, 4 February 2023

సినీ శ్రావ్య సంగీత "వాణి" కన్నుమూత

 తెలిమంచును కరిగిందంటూ తేటతెలుగుపదాలు పలికిన..
ఆహా ఏమిటి లోకమంటూ సమాజంపై సెటైర్లు వేసిన ఆగళంలో మాధుర్యమే..మర్యాదే....
చిన్న..పెద్ద..అందరిని మీరు అంటూ గౌరవంగా పిలిచే ఆ గళం మూగపోయింది..
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషాదాన్ని మరువక ముందే ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) (vani jayaram) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. కర్ణాటక సంగీతం ఔపోసన పట్టిన ఆమె, ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు చక్కగా పాడేవారు. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ప్రశంసలు అందుకున్నారు.  వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఆమె మృతిపట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వాణీ జయరాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

   ఆల్‌ ఇండియా రేడియోతో పాపులర్‌:
వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో మంచి గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టండి’ అని సూచించారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదట. ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న ఆమె.. ఆ తర్వాత టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణిలాంటి సంగీత విద్వాంసుల శిక్షణలో మరింత ఆరితేరారు. పదేళ్ల వయసులో తొలిసారి ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని అందుకున్న వాణీ(vani jayaram).. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించారు. రేడియోలో వరుసగా నాటకాలు వేయడం.. కవితలు చదవడం.. పాడటం.. దాదాపు పదేళ్ల పాటు నిరంతరం అదే ఆమె వ్యాపకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయారు. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు మళ్లింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని అవమానంగా భావించేది వాణీజయరాం కుటుంబం. అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్‌ పెట్టుకొని కంఠతా పట్టేవారు వాణీ (vani jayaram). అలా క్రమంగా సినిమాల్లో ఎలాగైనా పాటలు పాడాలని బలంగా నిర్ణయించుకున్నారామె. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
ఇలా ఓ కచేరీ చేస్తున్న సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే (vani jayaram singer) అవకాశమిచ్చారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్‌ హిట్టయ్యింది. దానికి తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం.. ఆ తర్వాత ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్‌.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారాయన. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు.
ఆమె గానానికి మూడు జాతీయ అవార్డులు పాదాక్రాంతం..
కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో ఆమె పాడిన పాటలకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో  ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు  మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘తెలిమంచు కరిగింది’,  ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘ఒక బృందావనం’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె (vani jayaram) గళం నుంచి జాలువారిన ప్రతి పాటా సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా.. కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సహమే కారణమంటారు వాణీ (vani jayaram). తమకు పిల్లలు లేకున్నా.. ఆ లోటును సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుంటారామె. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు. ఇటీవలే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్‌ ప్రకటించింది.....
.....సేకరణ

Wednesday, 1 February 2023

హాట్ న్యూస్: ఇటు జోగి.. అటు జమ్మాన.. మధ్యలో పరిషత్ రాజ్ పంచాయతీ..


ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. రసవత్తరమైన రాజకీయంలో ఉత్తరాంధ్ర పాత్ర చాలా పెద్దది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఉత్తరాంధ్ర పెద్దపీట వేసింది. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర వచ్చే ఎన్నికలలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా పక్క పక్కన ఉండే రెండు నియోజకవర్గాలు ఇబ్బందికర పరిస్థితులను చూపిస్తుంది. మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం, పార్వతి పురం నియోజకవర్గం గ్రూప్ రాజకీయ లతో,అవినీతి వేట లతో, బావ బామ్మర్ది పంచాయతీలతో కొట్టుకుంటున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.. ఈ యుద్ధం ఎక్కడ వరకు చేరుకుందంటే ఆఖరికి పార్టీ కార్యక్రమాలలో ఒకరి పేరు ఒకరు చెప్పలేని స్థితికి చేరుకుంది. ఇటీవల పార్వతీపురం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో అతనితోపాటు వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి భర్త పరిషత్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పరిషత్ రాజ్ ఎమ్మెల్యే జోగారావు పేరు చెప్పడానికి కూడా ఇష్ట పడలేదు. ఎమ్మెల్యే జోగారావు పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఆరోపణలన్నిటిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే పోతున్నారు అని బయట టాక్.
ఓవర్గం మీడియాను ఎమ్మెల్యే జోగారావు పెంచి పోషిస్తున్నప్పటికీ చాప కింద నీరులా ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతూ వస్తున్నాయి. దీనికి తోడు పార్వతిపురం ఎమ్మెల్యే టికెట్ రేసులో ప్రస్తుత టిడ్కో చైర్మన్  ప్రసన్నకుమార్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రసన్నకుమార్ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై దృష్టి పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నానని తన సొంత కార్యకర్తలకు పలుమార్లు చెప్పినట్టు కూడా సమాచారం. ఎమ్మెల్యే జోగారావు కి ఈ విషయం తెలిసి ముందుగానే అప్రమత్తమై ఓవర్గం ప్రజలతో చైర్మన్ ప్రసన్నకుమార్ పై నిఘా పెట్టమని చెప్పినట్టు విశ్వసించిన వర్గాల సమాచారం. ఈ గ్రూపు రాజకీయాలు మధ్య ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగారావు కోట్ల రూపాయలు దందా చేసి భారీగా సొమ్మును వెనకేసుకున్నారు.. ఇది ఆ నియోజకవర్గంలో చిన్నపిల్లాడిని అడిగిన చెప్పే సత్యం అంటూ భారీ టాక్ నడుస్తోంది. దీనికి నిదర్శనమే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే జోగారావు గడపగడప కార్యక్రమానికి పార్వతిపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలానికి వెళ్లారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే పై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


సందట్లో సడే మియా అంటూ.. ప్రసన్నకుమార్ పరిషత్ రాజుతో కలిసిమెలిసి ఉంటూ జోగారావు పై అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమైపోయారు. కానీ ఉత్తరాంధ్ర పెద్ద నేత నీడలో ఎమ్మెల్యే జోగారావు ఒంటి కన్నుతో నిద్రిస్తున్నారు. జోగారావు చుట్టూ ఎప్పుడూ ఉండే నలుగురు మనుషులు కీలకంగా పనిచేస్తూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు జోగారావు చెవిలో వేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ వచ్చి పర్యటించడం.. ప్రజలతో మమేకం అవడం అంతా గమనిస్తూనే ఉన్నారు.. కానీ ఇక్కడ ప్రసన్నకుమార్ నోటితో మాట్లాడుతుంటే.. అక్కడ జోగారావు కరెన్సీ నోట్ల తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ కరెన్సీ వైపే చూస్తారు తప్ప నోటి మాటలతో చెప్పే తీయ్యటి అమృతమైన చేదుగానే అనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో ప్రసన్నకుమార్ గెలుపు వరకు వెళ్లి ఓటమి పాలవడానికి కారణం కూడా ఈ కరెన్సీ నోట్లు. ఓటుకి నోటు పంచడంలో ఆయన విప్లమయ్యారు.. ఇప్పుడు కూడా చుట్టూ ఒక నలుగురిని వేసుకొని తిరగడం తప్ప చేసేదేమీ లేదంటూ కూడా సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ప్రసన్న కుమార్ కి అత్యంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవల్ లో విఫలమవుతున్నారు. అందుకే ఇప్పుడు చైర్మన్ ప్రసన్నకుమార్ తన రూటు మారుస్తూ ఈ మధ్యకాలంలో మీడియాపై ఫోకస్ పెంచారు.. బాగానే మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.. అంతేకాదు కొంతమంది బడా నాయకులతో సంప్రదింపులు చేసి సహాయం కావాలి అని కూడా అభ్యర్థిస్తున్నట్టు సమాచారం.. ఈ అభ్యర్థన లిస్టులో పరిషత్ రాజు మొదటి వ్యక్తిగా తెలుస్తుంది. ఈ పార్వతీపురం,కురుపాం నియోజకవర్గాలలో పెద్దల పరిశీలన కరువైంది.. ఇక వచ్చే ఎన్నికలలో సొంత పార్టీ నాయకులే వారి ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తుంది. రాను రోజులలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.