Thursday, 27 February 2025

జిల్లా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.,..


జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 
గురువారం జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం తీర్దాల సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,* స్వామి వారి చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద, జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా వున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 

Monday, 24 February 2025

*పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలోని మోడల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


*నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకత విద్యార్థులు అలవర్చుకోవాలి ... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

**10వ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాల సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి*

**రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి*

**విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి*

***నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకత విద్యార్థులు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ పెనుబల్లి మండలం, టేకులపల్లి గ్రామంలో పర్యటించి తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు.10వ తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని, ఉపాధ్యాయిని బోధిస్తున్న తీరును పరిశీలించారు. ఉపాధ్యాయుడిలా 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ సోషల్ స్టడీస్ క్లాస్ తీసుకున్నారు. బెంగాల్ విభజన, ఇండియా మ్యాప్, వాతావరణం వంటి పలు అంశాలను కలెక్టర్, చాక్ పీస్ తో బోర్డుపై బొమ్మలు వేస్తూ విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,* విద్యార్థులు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకోవాలని, వాటి సాధన దిశగా నూతన అంశాలను నేర్చుకోవాలనే ఉత్సుకతను అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.రాబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ తెలిపారు.  మనం వీక్ గా ఉన్న సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టాలని, గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నా పత్రాలను పరిశీలించి రెగ్యులర్ గా వచ్చే ప్రశ్నలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని అన్నారు. తరగతి గదిలో బాగా చదివే పిల్లలు కొంత వెనుకబడిన పిల్లలకు సహాయం చేయాలని, ఇతరులకు మనం ఒక అంశాన్ని బోధిస్తే ఆ అంశం మనకు బాగా గుర్తుంటుందని అన్నారు.
రాబోయే నెల రోజులపాటు విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ లకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం పరీక్షలకు సిద్ధమయ్యేందుకే కేటాయించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం సమయమ లేచి చదువు కోవాలని అన్నారు.  పెట్రోల్ లేకుండా కారు నడవడం ఎలా సాధ్యం కాదో, అదేవిధంగా ఖాళీ కడుపులతో ఉంటే చదువు మెదడుకు ఎక్కదని, విద్యార్థులు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని అన్నారు. జీవితంలో ఎదురు దెబ్బలు సహజమని,  అట్టి పరిస్థితులను ఎదుర్కొని లక్ష్యం దిశగా కృషి చేసిన వారే విజయం సాధిస్తారని కలెక్టర్ తెలిపారు.   అనంతరం పాఠశాలలో టాయిలెట్స్ ఎలా ఉంటున్నాయి, రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, స్నాక్స్ ఏం ఇస్తున్నారు మొదలగు వివరాలను కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ కావాల్సిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్, పెనుబల్లి మండల విద్యాధికారి సత్యనారాయణ, తహసీల్దార్ సుధీర్, ఎంపిడిఓ అన్నపూర్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, 3 February 2025

ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి..... రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్*


**పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి..... రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్*

**స్థానిక ఎన్నికల సన్నద్దతపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి*
ఖమ్మం, : రాబోయే స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి, స్థానిక ఎన్నికల సన్నద్దతపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.గ్రామ పంచాయతీలలో 2వ సప్లిమెంట్ ఓటర్ జాబితా మ్యాపింగ్, మండలాలకు ఎంపిటిసిల కేటాయింపు, ఎంపిటిసి, జెడ్పిటిసి ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మ్యాన్ పవర్, బ్యాలెట్ బాక్సుల సన్నద్దత, సిబ్బందికి అవసరమైన శిక్షణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై కార్యదర్శి, అదనపు కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శి మాట్లాడుతూ,* రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపిడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో  స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లలో  అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికలు వస్తే చేయాల్సిన పనులను మండల పంచాయతీ అధికారి, ఎంపిడిఓ కలిసి లిస్ట్ ఔట్ చేసుకోవాలని, ప్రతి పనికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని, అవసరమైన సిబ్బంది, మెటీరియల్ వివరాలు అందించాలని ఆయన సూచించారు.ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులుగా నియమించబడిన వారికి చేపట్టాల్సిన విధులను వివరిస్తూ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని అదనపు కలెక్టర్ లను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని, ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్స్ ల తరలింపుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.  ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలనకు అవసరమైన బృందాలు ఏర్పాటు చేసుకొని సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది సిద్ధం చేసుకోవాలని, ఎంపిటిసి, జెడ్పిటిసి ఓటర్ జాబితా తయారు చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2వ  దశ సప్లిమెంట్ ఓటర్ జాబితా తయారు చేసి పోలింగ్ కేంద్రాల ఓటర్లను మ్యాప్ చేయాలని, దివ్యాంగ ఓటర్లకు కల్పించాల్సిన వసతులపై ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ,* ఎన్నికల కమీషన్ కార్యదర్శి అందించిన సూచనలను నోట్ చేసుకున్నామని, క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడతామని తెలిపారు.  ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, డిప్యూటీ సిఇఓ కె. నాగపద్మజ, డి.ఎల్.పి.ఓ. రాంబాబు, 
సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
###############################


*పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి - జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మజ*

**మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ*

**ఇంటర్ పరీక్షల కోసం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు*

*ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా రెవెన్యూ అధికారిణి*
ఖమ్మం : జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారిణి సమీక్షించారు. ఈ సందర్భంగా *జిల్లా రెవెన్యూ అధికారిణి మాట్లాడుతూ,*  మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని,  ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే 36660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని  అధికారులు జిల్లా రెవెన్యూ అధికారిణి కి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగునీరు, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిణి అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. కళావతి బాయి, పోస్టల్ శాఖ నుండి ఆర్. నారాయణ, టిజి ఆర్టీసీ నుండి దినేష్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ ఆర్సీఓ విజయలక్ష్మి, మైనారిటీ శాఖ ఆర్సీఓ వెంకట రామయ్య, విద్యా శాఖ నుండి భానుప్రకాశ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
##############################
**పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ*

**ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయడం, చెత్త సేకరణ పక్కాగా జరగాలి*

**ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి*

*సతుపల్లి, మధిర, వైరా పట్టణాల మునిసిపాలిటీల పని తీరుపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్*
ఖమ్మం : జిల్లాలోని పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సతుపల్లి, మధిర, వైరా పట్టణాల మున్సిపాలిటీల పని తీరుపై అధికారులతో సమీక్షించారు.

మున్సిపాలిటీలలో ఆస్తి పన్నుల వసూలు, చేపట్టిన అభివృద్ధి పనులు, పచ్చదనం, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, టౌన్ ప్లానింగ్ వంటి పలు విభాగాలపై అదనపు కలెక్టర్ వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు. 
 
ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,*  పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై అధిక ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై ఎక్కడ చెత్తా చెదారం,  ప్లాస్టిక్ ఉండడానికి వీలు లేదని అన్నారు.  పట్టణంలోని ప్రతి వార్డుకు చెత్త నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని, అక్కడ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది, అవసరమైన వాహనాలు, యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. 

పట్టణంలో ప్రతి రోజు చెత్త సేకరణ జరగాలని, చెత్త సేకరణ కోసం కాలనీలను  విభజించుకొని, ఎక్కడ ఏ సమయంలో సేకరిస్తామో నిర్దిష్టమైన వివరాలు అందుబాటులో ఉండాలని అన్నారు. రోజు రోడ్లను శుభ్రం చేయాలని, పారిశుధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి పని తీరును ప్రతి రోజు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. చెత్త వాహనాలకు జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసి వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పట్టణాలలో ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించే విధంగా వ్యవస్థ సిద్ధం చేసుకోవాలని అన్నారు. 

మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూలు  సమీక్షించుకొని వంద శాతం పన్ను వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.  ప్రతి మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎంత పన్ను వసూలు జరిగింది, గత సంవత్సరం కంటే పెరిగిందా తగ్గిందా, పెండింగ్ ఉండటానికి గల కారణాలు, వాటి వసూళ్లకు చేపట్టే చర్యల గురించి చర్చించి అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ లలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైయిన్ల నిర్మాణం, జంక్షన్ ల అభివృద్ధి వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్  సూచించారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాకు సంబంధించి సరఫరాలో ఉన్న సమస్యలను ముందుగా గుర్తించి రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో  వైరా, సత్తుపల్లి, మధిర మునిసిపల్ కమిషనర్ లు వేణు, సంపత్ కుమార్, నర్సింహ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 2 February 2025

ఛాంపియన్ ఇండియా... విశ్వ విజేతగా మహిళ జట్టు...


హైదరాబాద్:ఫిబ్రవరి 02: భారత్ విశ్వ విజేతగా అవతరించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రి కాను చిత్తు చేసి విశ్వ విజేతగా ఆవిర్భవించింది. తద్వారా వరుసగా రెండవ U-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలిం ది. ఈ లక్ష్యాన్ని టీమిండి యా 11.2 ఓవర్లలో 1 వికె ట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది...ఈ మ్యాచ్ లో తెలంగాణ అమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ చాటింది. మొదట బౌలింగ్ లో మూడు వికెట్ల పడగొట్టిన ఈ తెలుగు తేజం ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది.  44 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచకప్ విజయం తో టీమ్ ఇండియా కొత్త సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా రెండో ప్రపంచకప్ విజయం తర్వాత అండర్-19 మహి ళల టీమ్ ఇండియాకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.2023లో షఫాలీ వర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా మొదటి అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పు డు మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ ని గెల్చుకుని భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు.

జు జూ బి మాటలు చెప్పను.. డబ్బు వృధా కానివవ్వను అన్న మంత్రి పొంగులేటి... ఫిదా ఆయన జర్నలిస్టులు...



*ఖమ్మం: జుజూబి మాటలు చెప్పనని జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా... నిపుణుల సలహాతో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనను కలిసి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులతో మంత్రి  చర్చించారు.  , ప్రస్తుతం  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ పూర్తయ్యాక జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుందామన్నారు.  జర్నలిస్టుల్లో చాలామంది పేదలు ఉన్నారు... వాళ్ల సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి, ముందుగానే డబ్బులు కట్టించి.. కాలయాపన చేస్తూ మభ్యపెట్టే తీరు నాది కాదని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించి, రూపాయి రూపాయి పోగేసుకునే ఏ ఒక్క జర్నలిస్టు డబ్బులు వృధా కావద్దని.. ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎలా వీలైతే అలా... నిపుణుల సూచన మేరకు ముందుకెళ్దామన్నారు. ఏదో ఒక రకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటివాటిని పట్టించుకోను, కాని జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి తో వున్నానని స్పష్టం చేసారు కొంతమంది జర్నలిస్టు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేద్దాం అన్నారు. కాగా మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో ఖమ్మం సందర్శించిన సందర్భంగా ఆయన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు బాధ్యత తనదే అన్న విషయం విధితమే

Saturday, 1 February 2025

నన్ను బ్రోవమని చెప్పవే... (భద్రాచల రామదాసు జయంతి ప్రత్యేకం)


భద్రాచలంలో రామదాసు 392 జయంతి ఉత్సవం ఘనంగా జరిపారు తెలుగు రాష్ట్రాలనడుముల నుండి వచ్చిన వాగ్గేయకారులు భద్రాచల రామదాసు భక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపించి భద్రాద్రి ఆలయం భక్తి సంగీత గరితంగా మార్చారు.   భద్రాచల రామదాసు 1620 - 1688 మధ్య కాలానికి చెందిన వాగ్గేయకారుడు.వీరి అసలు పేరు కంచర్ల గోపన్న. వీరి  స్వగ్రామం నేలకొండపల్లి.
వీరి తండ్రి కంచర్ల లింగన్న తల్లి కామాంబ వీరి ఇల్లు నిత్యము రామచంద్రుని పూజ, ప్రవచనాలు, నిత్య సమారాధనతో శోభన్లుతూ ఉండేది.
అట్టి వాతావరణంలో పెరిగిన గోపన్నకు వినయ విధేయతలు భగవద్భక్తి బాల్యం నుండి అలవడినవి.
వీరికి తెలుగు భాష యందు అఖండమైన పాండిత్యం కలదు. వీరి ధర్మపత్ని కమల. జీవితం ఆనందంగా సాగిపోతూ ఉండగా గోపన్నకు తల్లిదండ్రులు గతించారు. దానితో కుటుంబ భారము మోయవలసి వచ్చింది. 
ఇతని మేనమామలైన అక్కన్న, మాదన్నలు తమ ప్రభువైన తానిషా కు విన్నవించి గోపన్నను భద్రాచల తహసీలుదారుగా నియమించారు.జీర్ణావస్థలోనున్న భద్రగిరి శ్రీరామచంద్రుని దేవాలయాన్ని చూచి ఖిన్నుడైన గోపన్న ప్రభుత్వ పైకముతో ప్రజల అనుమతితో దేవాలయాన్ని పునరుద్ధరించారు.ఎన్నో వాహనాలు, ప్రాకారాలు, గోపురాలు, ఆభరణాలు చేయించి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.ప్రభుత్వానికి రావలసిన 16 లక్షల పగడాల పైకము దారి మళ్లీనందుకు ప్రభువు కోపించి కారా గారి శిక్ష విధించాడు.12 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తూ ఆర్తితో ఆ శ్రీరామచంద్రునిపై ఎన్నో కీర్తనలు రచించి వాటిని గానం చేస్తూ తన బాధను ఉపశమింప చేసుకున్నారు. ఆ శ్రీరామచంద్రునకు గోపన్న పై దయ కలిగి రామలక్ష్మణులు ఇరువురు మారువేషముతో తానిషా వద్దకు వెళ్లి పైకము చెల్లించి రామదాసుని చెర నుండి విడిపించారు. తానీషా కు లభించిన ఆ రామ దర్శనం తనకి ఎప్పుడు లభించునో అని పరితపించి కడకు ఆ శ్రీరామ దర్శనంతో జన్మను చరితార్థం చేసుకున్న మహానుభావుడు. రామదాసు కీర్తనలన్నీ రమణీయమైన తీయని తెలుగు పలుకులతో రుచి, ఆర్తి, భక్తి,ఆవేదనలు గేయాల రూపంలో ఆ బాలగోపాలం మైమరిచిపోయేటట్లుగా వినిపిస్తాయి.సరళ సంగీతము, భావుకత, భక్తితో కూడి ఉండే సాహిత్యము వినే వారిని అలరిస్తూ ఉంటుంది.
అహిరి, ఆనంద భైరవి, ధన్యాసి, పంతువరాళి, నాదనామక్రియ, సౌరాష్ట్ర వంటి రాగాలలోని కీర్తనలు ఆ రాగ స్వరూపాన్ని మన కన్నుల ముందు ఉంచుతాయి.
సంగీత కచేరీలు, భజనలలో ఈ కీర్తనలు ఎంతో ఆహ్లాదంగా వినపడుతూ ఉంటాయి.త్యాగరాజ స్వామికి కూడా రామదాసు స్ఫూర్తినిచ్చారు అని చెప్తారు క్షీరసాగర సేన అనే త్యాగరాజృతిలో రామదాసు ప్రసక్తి వస్తుంది. 
కీర్తనలే కాక రామదాసు దాశరథి శతకాన్ని రచించి శతక వాంగ్మయానికి వన్నెతెచ్చినారు. ఈ పద్యాలన్నీ అమృత గుడి కలవలే ఆ నోట ఈ నోట నేటికీ వినపడుతూ ఉంటాయి. మీరు జయంతి రోజున భద్రాచలంలో ఎందరో సంగీత అభిమానులు సీతారామ చంద్రుల సమక్షంలో వీరి కీర్తనలలోని తొమ్మిది కీర్తనలను నవరత్న కీర్తనలుగా ఆలపిస్తారు.
ఆ కీర్తనలు రాగాలు ఇవే 
అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి -   వరాళి
శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది - అఠాణ
పలుకే బంగారమాయన  -   ఆనంద భైరవి 
శ్రీరాముల దివ్య నామ -     సావేరి 
రామ జోగి మందుకొనరే -   ఖమాస్ 
తారక మంత్రము  -   ధన్యాసి
హరి హరి రామ -     కానడ 
తక్కువేమి మనకు -   సౌరాష్ట్ర 
కంటి నేడు మా రాముల -   నాదనామక్రియ. ఖండ చాపు తాళం.

ధన్యవాదములు.
లలిత  భావరాజు

మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
శ్రీ రామదాసు గారు

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

పూజ్య గురువులు అనేక ప్రవచనములలో శ్రీ రామదాసు గారి యొక్క భక్తి గురించి ప్రస్తుతించిన విశేషములు...శ్రీ రామదాసు గారి జయంతి సందర్భముగా...

మహానుభావుడు పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్నగారు. ఆయనను రామదాసు గారు అంటూ ఉంటాము. ఆయన జీవితములో చాలా గొప్ప విశేషము - కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము సుఖము వచ్చినా ఈశ్వరుడుతోనే చెప్పుకోవడము. ఏది వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము. లౌకికముగా పైకి మాట్లాడరు. ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే మాట్లాడటము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము. జ్వరము వచ్చినా ఏమిటో ఈశ్వరా! జ్వరముగా ఉన్నది, కాలు చాలా నెప్పిగా ఉన్నది అని ఏదైనా ఈశ్వరుడుకి చెప్పడము అలవాటు అయితే ప్రాణోత్క్రమణము అవుతున్నా ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు అవుతుంది. ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నారు. ఒకరోజు ఆయన ఏడుస్తూ పాడుకున్నారు -
నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జననీ జానకమ్మా
ఆయన ఆ బాధలు ఓర్వలేక సీతమ్మ తల్లిని అమ్మా ఇంత కష్ట పడుతున్నాను కాపాడమని చెప్పమ్మా అంటే తట్టుకోలేక పోయింది. ఆవిడ వెళ్ళి - అంత భక్తి తత్పరుడు కష్టపడి ఆలయము కట్టించాడు అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఆయన చేసిన అపరాధము ఏమీ లేదని, రామదాసు గారిని ఎందుకు రక్షించి బయటికి తీసుకుని రారు అని శ్రీ రాముడిని అడిగింది. రాముడు - సీతా నాకు కూడా రామదాసు కష్టములు చూసి గుండెలు అవిసి పోతున్నాయి. కానీ లోకములో వేదము చెప్పిన శాసనము ఒకటి ఉన్నది. గతజన్మలో ఉండగా ఒక చిలుకను తీసుకుని వెళ్ళి తొమ్మిది సం|| పాటు పంజరములో పెట్టి బాధ పెట్టాడు. పంజరములో ఆ చిలుక ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరముతో తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తి అవుతుందా కనపడదామని నేను కూడా అగ్గగ్గ లాడిపోతున్నాను. కానీ రామదాసు గారి కన్నా ముందుగా నాదర్శనమును ముందుగా తానీషా పొందుతాడు అంటే, అదేమిటి? మిమ్ములను ఇంతగా సేవించి పూజించి గుడి కట్టిన వాడు రామదాసు. ఆయనని బంధించిన వాడు తానీషా. అటువంటి తానీషాకు రామదాసుకన్నా ముందు దర్శనమా? ఎందుకు ఇస్తారు అని అడిగింది.
రామచంద్రమూర్తి దానికి కారణము చెపుతూ గత జన్మలో పరమ శివ భక్తుడైన ఒక వ్యక్తి శివా! నిన్ను సాకారముగా చూడాలని ఉన్నది. పరమ నియమముతో నిన్ను 365 రోజులు రుద్రమును స్వరము తప్పకుండా చెపుతూ గంగా జలములతో అభిషేకము చేస్తాను. నువ్వు దర్శనము ఇవ్వమని అడిగాడు. రోజులు తప్పు లెక్క పెట్టుకుని సం|| నకు ఒక రోజు తక్కువ పూజ చేసి దర్శనము అవలేదని కోపము వచ్చి బిందె తీసి శివలింగమునకు వేసి కొట్టి శివలింగమును బద్దలు కొట్టాడు. అప్పుడు నువ్వు నియమము తప్పి, నన్ను నింద చేసి బిందె పెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేద ప్రమాణము అంగీకరి0చని సిద్ధాంతము ఉన్నచోట జన్మించెదవు కాక అన్నాను. అతను నన్ను ప్రార్ధన చేసాడు శివా ! ఇంత కష్టపడి 364 రోజులు అభిషేకము చేసాను. ఒక్క రోజు తక్కువ అయినందుకు ఇంత శిక్షా అంటే, నువ్వు చేసిన అభిషేకమునకు కూడా ఫలితము ఉంటుంది. శివుడనైన నేను రామభక్తుడైన రామదాసు కన్నా రాముడిగా మొదటి దర్శనము నీకే ఇస్తాను అని వరమిచ్చాను. అందుకని మొదటి దర్శనము తానీషాకి ఇవ్వాలి. ఆయన కోటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభువు అంత ఎత్తులో కూర్చుని కనపడుతూనే ఉంటాడు. ఎవరైనా ఆయనకి ఆపద కలిగించాలి అనుకుని ధనస్సుకి బాణము సంధించి విడచి పెట్టినా, కత్తి విసిరినా ఆయనక తగలదు. మధ్యలో దేనికో తగిలి పడిపోతుంది. ఎందుకనగా అది వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారములు అడ్డు ఉంటాయి. ఆ రోజులలో అంత చిత్ర విచిత్రమైన శిల్పకళా నైపుణ్యముతో కట్టారు. తానీషా రాత్రి నిద్రపోతే పన్నెండు ప్రహారములు దాటితే తప్ప ఆయన నిద్రపోతున్న గదిలోకి వెళ్ళడము సాధ్యము కాదు. ఆయన భార్యతో కలసి ఏకశయ్యా గతుడై గాఢ నిద్రలో ఉండగా రామచంద్రమూర్తి భక్తుడైన రామదాసు గారిని రక్షించుకోవాలి అనుకున్నారు. ఆయన తలచుకుంటే కష్టము ఏమి ఉన్నది? రాజకుమారుల వేషము వేసుకుని గుఱ్ఱముల మీద ప్రహరాలు దాటి తానీషా పడుకున్నగదిలోకి వెళ్ళారు. తానీషా ఉలిక్కి పడి లేచాడు. భద్రాచల వృత్తాంతములో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అనగా నిద్ర లేచిన ప్రభువు ఎవరు నువ్వు? అనలేదు. ఎవరక్కడ? అని గంట కొట్టలేదు. ఎదురుగా ఉన్న రాజకుమారుల అందమును చూసి ఏమి అందము ఎవరు వీళ్ళు అని చూస్తూ అలా ఉండిపోయాడు. అది పరమేశ్వరుని దర్శనము అంటే ! ఆ స్థితిలో కన్నుల నీరే కానీ నోట మాట ఉండదు. రాముడే మాట్లాడారు. మేము రామదాసు గారి దాసులము, ఆయన సేవకులము అన్నారు.. అది భద్రాచల క్షేత్రము యొక్క వైభవము. భద్రాచలములో రామదాసు గారు అంటాము. రామదాసు గారు రాముడికి దాసుడు కాదు, రాముడు రామదాసుగారికి దాసుడు! భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఆయన ఎంత దాసుడైపోతాడో భద్రాచల క్షేత్రము చూపిస్తుంది.
మేము రామదాసుగారి సేవకులము ఆయన ఏ ద్రవ్యమును ఉపయోగించి ఆలయము కట్టాడని అభియోగము చేసారో ఆ వరహాలు పట్టుకుని వచ్చాము. తీసుకుని రశీదు ఇవ్వండి. రామదాసు గారిని విడిపించుకుంటాము అని అన్నారు.

ప్రభువు ఇంత రాత్రివేళ డబ్బు పట్టుకుని తిన్నగా నాదగ్గరకు రావడమేమిటి? రశీదు ఇమ్మని అనడము ఏమిటి? నిర్దానుడై చేతిలో రూపాయ కాసు లేకపోతే కదా కారాగారములో పెట్టాము. అటువంటి రామదాసు గారికి ఇన్ని లక్షల వరహాలు ఎలా వచ్చాయి. కారాగారములో ఉన్నవాడి కోసము మీరు ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అని తానీషా అడగ లేదు రామ దర్శనముతో అలా ఉండిపోయాడు. రామ లక్ష్మణుల దర్శనము పొందడము మాటలు కాదు. ఆనంద పారవశ్యములో ఉండిపోయి డబ్బు పుచ్చుకున్నాడు. డబ్బు ముట్టినది విడచి పెట్టమని తానీషా రశీదు వ్రాసి ఇచ్చేసాడు. రాముడు ఉన్నాడని అనడానికి రామచంద్రమూర్తి ఇచ్చిన డబ్బే సాక్ష్యము. ఆ రశీదు పట్టుకుని రామదాసు గారిని విడిపించారు. నాకు సేవకులు ఎవరు? దాసులు ఎవరు? వాళ్ళు ఇన్ని లక్షల వరహాలు పట్టుకుని వచ్చి నన్ను విడిపించడము ఏమిటి? అని ఆయన తెల్లబోయారు. వెంటనే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారు అనుకున్నారు. వారు తమ పేర్లు దాచలేదు. రామోజీ, లక్ష్మోజీ అని చెప్పారు. ఇద్దరూ రామదాసు గారిని విడిపించి తీసుకుని వచ్చారు. ప్రభువు కూడా అనేక రకములైన ఈనాములు కానుకలు ఇచ్చి దివ్యస్నానము చేయించి పట్టుబట్టలు కట్టి పల్లకీలో తీసుకుని వచ్చి భద్రాచలమునకు తాహసీల్దారు పదవిని ఇచ్చాడు. ఆయన వాడిన ఆరు లక్షల వరహాలు కూడా ఇచ్చాడు. ఆ డబ్బంతా పెట్టి రామచంద్రమూర్తికి నగలూ పాత్రలూ వైభవాలూ ఉత్సవాలు ఎన్నో చేయించారు.

వృద్దాప్యములోకి వచ్చిన తరవాత ఆయనకి శరీరము బడలిపోయి కొండ ఎక్కలేక పూజామందిరములో కూర్చుని రామా! ఎప్పటికి నిన్ను చేరుకుంటాను? ఇందులో ఉండలేక పోతున్నాను, డొల్ల బారిపోయింది అని ప్రార్ధన చేస్తే భద్రాచలమునకు శ్రీ వైకుంఠము నుంచి దివ్య విమానము వచ్చి రామదాసు గారి ఇంటి ముందు దిగింది. అందులో నించి విష్ణు పార్శదులు దిగి, లోపలి వచ్చి, అయ్యా గోపరాజు గారూ శ్రీమన్నారాయణుడు మీకోసము విమానము పంపించారు. మిమ్ములను సశరీరముగా విమానము అధిరోహించి రమ్మన్నారు అంటే విని ఆయన సంతోషముగా బయటికి వెళుతూ భార్య కమలాంబని పిలిచి కమలా వైకుంఠము నుంచి విమానము వచ్చింది వెళ్ళిపోతున్నాను నువ్వూ వస్తావా? అన్నారు. ఎప్పుడూ రామనామము చెపుతూ విమానము వచ్చింది నారాయణుడు వచ్చాడు అని అనడము అలవాటు అయినా కమలాంబ గారు ఏదో పలవరిస్తున్నారు అనుకుని అలాగే నేను పనిలో ఉన్నాను మీరు బయలుదేరండి నేను తరవాత వస్తాను అంటే మహానుభావుడు బయటికి వచ్చి విమానము ఎక్కి అందరి వంకా చూసి భద్రాచల క్షేత్రములో అందరితో రామనామము చెప్పించారు.

భండన భీముడార్త జనబాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండకలాప్రచండభుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండ దాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !

రాముడున్నాడని నాకు ఎంత నమ్మకమో తెలుసా? ఉన్నాడని చెప్పడము కాదు, నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభములు పాతి, మధ్యలో పెద్ద భేరి కట్టి, ఏనుగు ఎక్కి, వచ్చి ఢామ్ ఢామ్ అని భేరి మ్రోగిస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు అలా మ్రోగిస్తున్నారు అని అడిగితే, నా రాముడు సాటి దైవము ఇంక లేడు! ఆయన యొక్క భుజములు శత్రువులను మర్దనము చేసేటప్పుడు తాండవము చేస్తాయి! ఎప్పుడు ధనుస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణము తీసి వింటి నారికి సంధిస్తాడో, ఎప్పుడు విడచి పెడతాడో తెలియదు! అటువంటి వాడు రాముడు! అని చెప్పుకున్న మహానుభావుడు రామదాసు గారు