*ప్రారంభోత్సవకు సిద్దమైన ఖమ్మం మహిళా మార్ట్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*మహిళా మార్ట్ ను లాభాల బాటలో నడిపేలా అవసరమైన కార్యచరణ*
**సీక్వెల్ రోడ్డులోని మహిళా మార్ట్ ప్రారంభ ఏర్పాటు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం : మహిళా సంఘాలకు అర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ బుధవారం మంత్రులచే అధికారంగా ప్రారంభోత్సవంకు సంసిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్, సీక్వెల్ రోడ్డులోని ఖమ్మం మహిళా మార్ట్ ను సందర్శించి మంత్రులచే ప్రారంభోత్సవ ఏర్పాటు పనులను పరిశీలించారు. మార్ట్ లో ఏర్పాటు చేయు ఆర్గానిక్ ఉత్పత్తులు, మహిళాలచే చేసిన తినుబండారాలు, బొమ్మలు, ఎక్విప్మెంట్ లపై, ప్రొడక్ట్స్, స్వయం తయారీ ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఖమ్మం బ్రాండ్ మార్క్ ను పరిశీలించారు. మార్ట్ ఆకర్షణీయంగా ఉండే విధంగా కంప్యూటరైజ్ బిల్లు, లోగోల నిర్వహణ పట్ల అధికారులను కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* మహిళా మార్ట్ నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. మహిళా మార్ట్ ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాలకు ప్రత్యేక కార్యచరణ రూపొంచామని చెప్పారు. మహిళా మార్ట్ లో ఏ.సి. ఏర్పాటు ద్వారా ప్రతి నెలా కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని, మహిళా మార్ట్ ప్రారంభించిన తర్వాత నిర్వహణ బాధ్యత స్వశక్తి మహిళా సంఘాలపై మాత్రమే ఉంటుందని, వీటిని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
మహిళా మార్ట్ ముందు భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్ లో రిటైల్ బిజినెస్ క్రింద ఏర్పాటు చేస్తున్న వాటిని, వర్షం వచ్చిన కూడా ఇబ్బంది లేకుండా నీడలో కూర్చొనే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.మహిళా మార్ట్ నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని, సామాన్లు అందంగా పొందికగా అమర్చాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళా మార్ట్ లో పెట్టే వస్తువుల స్టాక్ నిల్వలు పకడ్బందీగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పీఆర్ ఈఈ మహేష్ బాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***********************************************
*భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకం ....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*శిక్షణ పొందిన సర్వేయర్లు భూ హద్దులలో రైతులకు న్యాయం చేయాలి.*
*ల్యాండ్ సర్వేయర్ల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి*
ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి లైసెన్స్ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం స్థానిక టిటిడిసి భవనంలో సర్వే, ల్యాండ్ రికార్డు శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. భూ భారతి చట్టం, భూ సమస్యలపై సమగ్ర అవగాహన, భూ మ్యాప్, నక్షా, భూ హద్దులు తదితర విషయాలపై స్పష్టంగా సర్వేయర్ల అవసరమని వారి విధుల పై అవగాహన కల్పిస్తు కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్ సర్వేయర్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి శిక్షణ అందించి అర్హత సాధించిన వారికి లైసెన్సులను జారీ చేయనుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన వారికి శిక్షణ కోసం ఎంపిక చేశామని అన్నారు. 50 రోజుల పాటు వీరికి భూముల సర్వేలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన వారిచే శిక్షణ ఇస్తున్నామని వివరించారు.భూభారతి చట్టంలో పొందుపర్చిన సెక్షన్ ల ప్రకారం భూముల క్రయవిక్రయాలు, సక్సేషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్ లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవసాయ భూములకు కూడా సర్వే మ్యాప్ లను జతచేయాలని భూభారతి చట్టంలో పొందుపర్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు లైసెన్సుడ్ సర్వేయర్లు సర్వే జరిపి భూముల హద్దులు, సమగ్ర వివరాలతో సర్వే మ్యాప్ లను సమర్పిస్తే, వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్ బుక్ కు జతచేయడం జరుగుతుందని తెలిపారు. పట్టా పాస్ బుక్ లు కలిగిన రైతులు ఎవరైనా సరే సర్వే మ్యాప్ కోసం దరఖాస్తు చేసుకుని, లైసెన్సుడ్ సర్వేయర్లచే సర్వే చేయించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి భూమి పార్సిల్ కు ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ ను కేటాయించనుందని, దీని కోసం కూడా లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలు అవసరం అవుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు తదితర అంశాలపై థియరీ క్లాసులతో పాటు క్షేత్రస్థాయిలో చెయిన్ సర్వే, మ్యాప్ రీడింగ్ వంటి వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ సంబంధిత సమస్యలలో అత్యధికంగా సర్వేతో ముడిపడిన అంశాలే ఎక్కువగా ఉన్నందున లైసెన్సుడ్ సర్వేయర్లు చక్కగా సేవలందిస్తే, అనేక భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, తద్వారా భూ వివాదాలకు తావు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అన్నారు.
సర్వేయర్ల శిక్షణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంశయానికి లోను కాకుండా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 50 రోజుల పని దినాలలో కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. భూభారతి చట్టం గురించి అవగాహన ఏర్పర్చుకుని, భూముల సర్వే విధానాన్ని సమగ్రంగా నేర్చుకుంటే లైసెన్సుడ్ సర్వేయర్ గా చక్కటి ఆదాయ వనరులను పొందవచ్చని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన లైసెన్సుడ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములు లావాదేవీలు జరిగినప్పుడు సర్వే చేసి హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తరువాత రిజిస్ర్టేషన్లు జరుగుతాయని దీనివల్ల తగాదాలకు చోటు ఉండదని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగులు ఈ ట్రైనింగ్ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం నూతన సర్వేయర్లకు శిక్షణ మెటీరియల్ ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏ డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
***********************************************
*అమ్మాయిల పరిరక్షణ అందరి బాధ్యత ....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*బాలికలు సమయపూర్తితో సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలి.*
*సోషల్ మీడియా పట్ల అమ్మాయులు అప్రమత్తంగా ఉండాలి.*
*రిక్కాబజార్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న బాలికల రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్ పై స్కూల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------------
ఖమ్మం : బాలికల భద్రత పట్ల ప్రభుత్వ ప్రాధాన్యత లో మొదటి అంశంగా ప్రత్యేక రక్షణ వ్యవస్ధ కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక రిక్కాబజార్ హైస్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్ లకు నిర్వహించిన బాలికల రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్ పై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బాలికల భద్రత, హక్కులు, మానవ అక్రమ రవాణా నివారణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అమ్మాయిలకు కలిగే ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులను గుర్తించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అమ్మాయిలు అనుమానాస్పద వ్యక్తులతో మాటలాడే ముందు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ మహిళలు పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే, తక్షణమే అప్రమత్తం ఉండేలాగా అమ్మాయిలకు ధైర్యం కల్పించాలని వివరించారు.విద్యార్థుల మానసిక, శారీరక మార్పులను గమనిస్తూ అవసరమైన సందర్భాల్లో సలహా, సహాయం ఉపాధ్యాయులు అందించాలని తెలిపారు. సిబ్బందికి బాలికల పట్ల చైతన్యవంతమైన శిక్షణ, వర్క్‌షాప్‌లు నిర్వహించడం ముఖ్యమని అన్నారు.విద్యార్థులు భద్రంగా ఉండాలంటే ఉపాధ్యాయులు ముందుగా అప్రమత్తంగా ఉండాలని, మానవ అక్రమ రవాణా వంటి మానవతా విరుద్ధ చర్యలను ఎదుర్కొనేందుకు స్కూల్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.