Monday, 30 June 2025

ఫోన్ కాల్స్ పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: : *ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య*



ఖమ్మం : మున్సిపాలిటీ నుంచి ట్రెడ్ లైసెన్స్ గురించి ఎటువంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పేరిట వస్తున్న ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
ఖమ్మం జిల్లాలోని పెద్ద పెద్ద భవనాలు, ఆసుపత్రులు, వాణిజ్య వ్యాపారవేత్తలకు 9346423925 నెంబర్ నుంచి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చేసినట్లుగా ఫేక్ ఫోన్ కాల్స్ చేసి ట్రేడ్ లైసెన్స్ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని, ప్రజలు వ్యాపారులు ఎవరు ఎటువంటి ఫోన్ కాల్స్ ను పట్టించుకోవద్దని, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ ద్వారా బిల్లుల సేకరణ జరగదని అన్నారు.ఫేక్ కాల్స్ నమ్మి ఎవరు డబ్బులు చెల్లించి మోసపోవద్దని, ఇటువంటి ఫోన్ కాల్స్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదు చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Sunday, 29 June 2025

ఆ గ్రామాలను తిరిగి ఇవ్వండి: తుమ్మల


నిజామాబాద్ : - ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు మరియు పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి .. కేంద్ర మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు.నిజామాబాద్ వాసుల సుదీర్ఘ కాలం  పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం  కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఇది వరకే రాష్ట్రంలోని నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఆదివారం దాని ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున  గౌరవ  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు మరియు నిజామాబాద్ ఇంచార్జీ మంత్రి సీతక్క గారు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ కి పసుపు బోర్డు ప్రకటించి, దాని కార్యాలయాన్ని కూడా ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున కృతజ్ఙతలు తెలిపారు. అలాగే పసుపు  రైతుల సంక్షేమం కోసం మరిన్ని  పధకాలను అమలు చేయాలని ఆయన కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.

Monday, 23 June 2025

ప్రణాళికా బద్ధంగా భూ సేకరణ చేపట్టాలి :జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం : మున్నేరు  కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల, భూ సేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత సంవత్సరం వచ్చిన వరద, మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, రిటైనింగ్ వాల్ కొరకు భూసేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చే ప్రభుత్వ స్థలం వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  మాట్లాడుతూ*  మున్నేరు నదికి ఇరువైపులా ఎనిమిదిన్నర కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటీ కోసం మొత్తం 245 ఎకరాల భూమి అవసరమని, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూమిలో 5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని అన్నారు.   మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన 138 ఎకరాల పట్టా భూమి సేకరణ చేయాలని నిర్ణయించామని అన్నారు.  పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అభివృద్ధి చేసి పరిహారంగా అందించేలా స్థానిక రైతులను ఒప్పించాలని అన్నారు.మున్నేరు నదికి ఇరువైపులా సేకరించాల్సిన పట్టా భూముల రైతులతో పలుమార్లు చర్చలు జరిపి 70 ఎకరాల వరకు ఒప్పించామని అధికారులు తెలిపారు.  పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో వెంచర్, 100 ఫీట్ రోడ్డు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసిన భూమి పట్టాదారులకు అందించాల్సి ఉంటుందని అన్నారు. 
పోలేపల్లి ఏరియాను ముందు గ్రౌండ్ లెవెలింగ్ పనులు, 100 ఫీట్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 
పోలేపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ లాగా అంతర్గత రోడ్లు, స్కూల్స్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు.  ప్రతి వారం పనుల పురోగతి నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకోవాలని అన్నారు. ప్రకాష్ నగర్ చెక్ డ్యాం బ్యాక్ వాటర్ కారణంగా ముంపు పెరుగుతుందని, దానిని తొలగించడానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖలతో ఫాలో అప్ అవుతూ త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం డిస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం పనులకు, సింగరేణి, జాతీయ రహదారుల నిర్మాణం  అవసరమైన భూ సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.  భూ సేకరణ ఎంజాయ్ మెంట్ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్ గౌడ్, నేషనల్ హై వే పిడి రామాంజనేయ రెడ్డి, మేనేజర్ దివ్య, ఇర్రిగేషన్ డిఇ రమేష్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*రైతుల ఖాతాల్లో 406 కోట్ల 36 లక్షల రైతు భరోసా
------------------------------------------------------------------------
 నిధులు జమ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం : రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 406 కోట్ల 36 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
జిల్లాలో 3 లక్షల 53 వేల 794 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 436 కోట్ల 84 లక్షల 65 వేల 365 రూపాయలు జమ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు వున్న 3 లక్షల 31 వేల 397 మంది రైతులకు 406 కోట్ల 36 లక్షల 62 వేల 570 రూపాయలను రైతు భరోసా వానాకాలం - 2025 క్రింద రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Wednesday, 11 June 2025

*మహిళలు హెల్ప్ లైన్ 181 నెంబర్ ఉపయోగించుకోండి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


*పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పై అవగాహనకు రూపొందించిన గోడప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
---------------------------------------------------------------------
ఖమ్మం : మహిళా సాధికారత కేంద్రం ఖమ్మం జిల్లా 
అధ్వా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేదింపుల నిరోధక చట్టం పై అవగాహనకు రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి అవిష్కరించారు.
కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలలో మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసే ఫిర్యాదుల స్వీకరణ పెట్టెలను కలెక్టర్ పరిశీలించారు. మహిళాల భద్రత కోసం లైంగిక వేదింపుల చట్టం POSH(Prevention Of Sexual Harassment) యాక్ట్ మహిళలు పనిచేసే ప్రదేశంలో మగవారు అనుచితంగా ప్రవర్తించడం, లైంగిక దాడులు,  అవాంచనీయ, అసాంఘిక ప్రవర్తన ద్వారా వేధించిన వారి పట్ల ఈ చట్టం వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. మహిళల ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోని టాయిలెట్ల వద్ద ఫిర్యాదు స్వీకరణ పెట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.  హెల్ప్ లైన్ 181 నెంబర్ ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ చైర్ పర్సన్ భారత రాణి, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి విష్ణు చందన, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు