Monday, 29 September 2025

నా గమ్యం వచ్చింది...మీ సహకారం మరువలేను.. ప్రయాణికులే దేవుళ్లుగా భావించి సాగండి ..సజ్జానార్

*ఆర్టీసీతో నాలుగేళ్ళ నా ప్రయాణం ముగిసింది.*

ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు!! నేను తేది 03.09.2021 నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ చాలా క‌ష్ట‌కాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది. 

అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థను బయటికి తీసుకువచ్చేందుకు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక  నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి.. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాం. ‘కృషితో నాస్తి దుర్బిక్షం’ అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మ‌న ప్ర‌యాణం సాగిన‌ప్ప‌టికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాము.  మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశాం. పాత బస్సులను కొత్త బ‌స్సుల‌తో రిప్లేస్ చేయ‌డం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబ‌డి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్ప‌త్రిని తీర్చిదిద్దడం,  గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వ‌హ‌ణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా  మిమ్మ‌ల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాం. మీ అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను.

గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. నేను మొదట మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న, 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించి.. ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించాం. 

ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగ‌స్వాముల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000  మంది ఉద్యోగుల, వారి జీవిత భాగ‌స్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో మనం అమలు చేశాం. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశాం. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశాం. ఈ మహాయజ్ఞంలో నాతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను.  గతంలోనూ మీరే సంస్థలో విధులు నిర్వర్తించారు. అప్పుడు ఇప్పుడూ సంస్థలో ఎంత తేడా వచ్చిందో మీకు తెలియనిది కాదు. 

ఒక మహాకవి చెప్పినట్లుగా ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని, ఎదురుచూసి మోసపోకుమా’ అన్నది నిజం. సంస్థలోని ప్రతి ఉద్యోగి కూడా ఈ సంస్థ నాది అనే భావనతో శక్తివంచన లేకుండా అంకితభావంతో ప్రతి క్ష‌ణాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రయాణికులకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందినట్లైతే, సంస్థ రాబోయే కాలంలో ఎంతో వృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ‘ప్రయాణికులే మన సంస్థకు దేవుళ్లు’ అనే విషయం ఎప్పుడు మన హృదయాల్లో నాటుకుపోవాలి. ప్రయాణికుల పట్ల చాలా గౌరవంతో మెలగాలి. 
చివరగా.. ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.  భ‌విష్య‌త్‌లో నేను ఎక్క‌డ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థవ్య‌వ‌స్థ‌కు, ఈ గొప్ప సంస్థ‌కు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..

*మీ.. వీసీ సజ్జనర్, ఐపీఎస్,*
*అదనపు డీజీపీ*

Tuesday, 23 September 2025

నిష్టతో...జాతర పనులు నిర్వహించండి : మేడారంలో సిం.ఎం.రేవంత్ రెడ్డి సూచన

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ.. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కుంభమేళా స్థాయిలో జరిగే ఈ మహాజాతరకు జాతీయ గుర్తింపునివ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయాలని కోరారు.వచ్చే ఏడాది ప్రారంభంలో శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై మేడారంలో ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేపట్టే అవకాశం దక్కడంతో నా జన్మ ధన్యమైంది. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నా.
గతంలో పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష ప్రదర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ ఆనాటి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. వారేదో దాన, ధర్మమిచ్చినట్టుగా తాత్కాలిక పనులతో సరిపెట్టారు. తాను ఇక్కడి నుంచే పాదయాత్ర బయలుదేరా. ఆదివాసీలే ఈ దేశానికి మూల వాసులు. దొరల పాలనను అంతం చేసి ప్రజా పాలనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రణాళిక అందించింది. బడుగు బలహీన వర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినప్పుడు సరిపోవని ఆదివాసీ, గిరిజన ప్రాంత వాసులు చెప్పినప్పుడు ఐటీడీఏ ప్రాంతాల్లో వారికి అదనంగా ఇండ్లు ఇచ్చాం.ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా ఆదివాసీలకు ఇవ్వాల్సిన వాటా, కోటా ఇవ్వాల్సిందే. దశాబ్దాలుగా వారికి అన్యాయం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దాలని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గద్దెలు, ప్రాంగణ అభివృద్ధి నిర్మాణం జీవితంలో వచ్చిన గొప్ప, అరుదైన అవకాశం. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో జన్మ ధన్యమైంది. వాటి నిర్మాణంలో నిధుల సమస్య ఉండదు. ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నాం. సిమెంట్ కన్నా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడితే వేల ఏండ్లు ఉంటుంది. గొప్ప నగిశీలు, రాతి కట్టడాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ప్రణాళికలు వేశాం.ఈ గొప్ప కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఆదివాసీ సోదరుల కోరిక మేరకు ఈ ప్రణాళిక తీసుకొచ్చాం. వచ్చే జాతర నాటికి కార్యక్రమాలు పూర్తి కావాలంటే రాత్రింబవళ్లు ఇక్కడ పనులు జరగాలి. ఆలయ అభివృద్ధితో పాటు జంపన్న వాగు నిర్మాణం, రహదారుల నిర్మాణాలపైన కూడా సలహాలు, సూచనలు తీసుకుంటాం.రాబోయే వంద రోజులు ప్రతి వారం జిల్లా ఇంచార్జీ మంత్రి  ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి. నిష్టతో స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తీరుగా సమ్మక్క సారలమ్మ మాల ధరించిన రీతిలో పనులను పర్యవేక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటిస్తా.మేడారం జాతరను ఈసారి అత్యంత అద్భుతంగా చేసుకుందాం. ఈ ఆదివాసీ కుంభమేళాను జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతున్నాం. కుంభమేళాకు వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు కూడా నిధులను మంజూరు చేయాలి. అందరం కలిసి ఒక మంచి సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కష్టపడి పనిచేద్దాం..” అని పిలుపునిచ్చారు.ఈ సభలో మంత్రులు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణలోని గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ ప్రతినిధులు, గిరిజనులు పాల్గొన్నారు. 


*ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*



**కలెక్టరేట్ లో నిర్వహించిన బతుకమ్మ  వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*
ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మూడవ రోజు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ సతీమణితో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ  వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు.   
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం విద్యార్థినులు, వైద్య శాఖ ఉద్యోగినులు, సిబ్బంది, అందరూ పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.

Friday, 19 September 2025

*ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో జర్నలిస్టుల భేటీ*


👉 ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు...*
👉 స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లు తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోండి - మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
👉 హైదరాబాద్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి 100కిపైగా ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొననున్నారు

*హైదరాబాద్ :  ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి‌ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల గారు కలిసి ‘పిచ్2ప్రెస్’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27, 2025న హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జర్నలిస్టుల ముందు నేరుగా ఇన్నోవేటర్లు తమ అనుభవాలను చెప్పుకునే అవకాశం ఇది. 
పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా, *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* "స్టార్టప్‌లు ఎక్కువగా ఇన్వెస్టర్లకే ఫోకస్ చేస్తుంటారు. కానీ మీ అనుభవాలను ప్రపంచానికి చెబితేనే నిజమైన గుర్తింపు వస్తుంది. పత్రిక లేదా టీవీ కథనాలు మీ వ్యాపారాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లగలదు. అందుకే స్టార్టప్‌లు, స్కేల్‌అప్స్ తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి" అని అన్నారు. 
ఇదే సందర్భంలో, మంత్రి తన స్వగ్రామమైన మంథని నియోజకవర్గంలోని ధన్వాడ గ్రామం డిజిటల్ గ్రామంగా మారిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, డిజిథాన్ సంస్థ చేస్తున్న పనిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పిచ్2ప్రెస్ ఈవెంట్‌లో దేశం నలుమూలల నుండి 100 కంటే ఎక్కువ ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొంటున్నారు. వీరంతా టెక్నాలజీ, స్టార్టప్‌లు మరియు ఇన్నోవేషన్ కవరేజ్‌లో నిపుణులు. ఇది 100 మంది ఇన్నోవేటర్లకు తమ అనుభవాలను మీడియా ముందు నేరుగా ప్రెజెంట్ చేసే అరుదైన అవకాశం.ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ,* “పిచ్2ప్రెస్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇన్నోవేషన్‌కు గొంతుక ఇవ్వడం, మంచి అనుభవాల ద్వారా వ్యాపారాన్ని వేగంగా ఎదిగించడమే మా లక్ష్యం. ఒక సారీ జర్నలిస్టులకు మీ అనుభవం నచ్చితే, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించగలదు. జర్నలిస్టులు, ఇన్నోవేటర్లు ఇద్దరూ తప్పక ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలి" అన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిజిథాన్ బృంద సభ్యులు భాగ్యలక్ష్మి వాకిటి, హేమా మారం, దీపిక జోషి, తేజస్విని, నితిన్య హర్కరా మరియు ప్రకాష్ పాల్గొన్నారు.
ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే స్టార్టప్‌లు/ఇన్నోవేటర్లు
tinyurl.com/pitch2press ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు
లేదా +91 80190 77575 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sunday, 14 September 2025

మేడారానికి పోలీస్ బైక్ పై మంత్రి సీతక్క...

ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్,  మంత్రి సీతక్క  మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. 
🔸జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు.🔸అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.🔸జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 


Monday, 8 September 2025

భాజపా రాష్ట్ర కోశాధికారిగా దేవకి వాసుదేవరావు.• అభినందించిన జిల్లా అధ్యక్షులు నెల్లూరు.


ఖమ్మం : భాలతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో ఖమ్మం జిల్లా నాయకుడు దేవకి వాసుదేవరావుకి కీలక బాధ్యతలు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవకి వాసుదేవరావును హృదయపూర్వకంగా అభినందించారు.ఖమ్మం జిల్లా నాయకుడిగా దేవకి వాసుదేవరావు రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ బలపడేందుకు తోడ్పడుతుందని భాజపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Tuesday, 2 September 2025

*విపత్తు నివారణ పనులపై సమగ్ర నివేదిక పంపండి..... సీఎం రేవంత్ రెడ్డి*


ఖమ్మం, సెప్టెంబర్-1: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, విపత్తు నిర్వహణ నిధుల క్రింద చేపట్టిన పనులు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.భారీ వర్షాలు, వరద నష్టం, సహాయంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు లతో కలిసి, హైదరాబాద్ నుండి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలు పాల్గొన్నారు.*సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు, పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, వరదల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో గత వరదల సమయంలో వినియోగించిన నిధులను పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద జమ చేసి కేంద్రం నుంచి సహాయం రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల యూసీలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 720 కోట్ల విలువ గల 1009 కిలో మీటర్ల ఆర్ అండ్ బి రోడ్లు, 11 కోట్ల విలువ గల జాతీయ రహదారులు, 374 కోట్ల విలువ గల పంచాయతీరాజ్ రోడ్లు, 32 కోట్ల 73  లక్షల విలువ గల   విద్యుత్ శాఖ పరికరాలు దెబ్బతిన్నాయని అన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు.*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు మాట్లాడుతూ* ఆగస్టు 26 నుంచి 28 తేదీలలో భారీ వర్షాలు మన రాష్ట్రంలో కురిసాయని ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురువడంతో ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 4124 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించిందని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డిఆర్ఓ  ఏ. పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఎస్ఈ ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, సిపిఓ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్,, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలకు రెవెన్యూ - రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం: మంత్రి పొంగులేటి

పౌరులకు మెరుగైన మరియు పారదర్శక సేవలను అందించడానికి, తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ మరియు సర్వే విభాగాలను అనుసంధానించే ఏకీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది - గౌరవనీయులైన రెవెన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 📍: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. 🔹 భూ భారతి పోర్టల్‌తో సర్వే మ్యాప్‌లను అనుసంధానించడం 🔹 కోర్టు కేసు పర్యవేక్షణ వ్యవస్థ 🔹 గ్లిచ్-ఫ్రీ మరియు యూజర్ ఫ్రెండ్లీ భూభారతి పోర్టల్‌ను నిర్ధారించడం 🔹 5 పైలట్ గ్రామాలలో రీ-సర్వే పూర్తయింది 🔹 408 గ్రామాల్లో త్వరలో రీ-సర్వే ప్రారంభం కానుంది భవిష్యత్తులో తెలంగాణ అంతటా భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ చొరవ మార్గదర్శక చట్రంగా పనిచేస్తుంది. రెవెన్యూ కార్యదర్శి శ్రీ డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ ఐ.జి., శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, CCLA, కార్యదర్శి, శ్రీ మంద మకరంద్, NIC SIO శ్రీ ప్రసాద్, శ్రీ విజయ్ మోహన్; శ్రీ కృష్ణ, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.