Monday, 31 July 2023

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని

 టి ఎస్ ఆర్ టి సి ఎండి వైస్ చైర్మన్ సజ్జనార్ అన్నారు.

సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ గారికి‌ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూ...

*మీ..*
*వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌*
*వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌*
*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ*

Friday, 28 July 2023

మున్నేరు ముంపు ప్రాంతాల్లో... ఎమ్మెల్సీ తాతమధు,, కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యటన... బాధితులకు పరమార్శ...


ఖమ్మం, జూలై 28: ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లతో కలిసి, మున్నేరు ముంపు ప్రాంతాలు పోలేపల్లి, కరుణగిరి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు పరిశీలించారు. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్యం, క్రిమీ కీటకాలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంపు బెడద పూర్తిగా తొలగేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలని ముంపు బాధితులకు సూచించారు. 
    ఈ సందర్భంగా జెడ్పి సిఇఓ అప్పారావు, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ సుమ, అధికారులు తదితరులు ఉన్నారు.
మున్నేరు ముంపు ప్రాంతాల బాధిత శిబిరాలను సందర్శించిన కలెక్టర్, వి.పి.గౌతమ్, సి.పి. విష్ణు వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు..
ఖమ్మం, జూలై 28: పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు భోజన, వసతి సౌకర్యం తో పాటు అన్ని మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ తో నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, రామ్ లీల ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం, త్రాగునీరు, వసతులు పరిశీలించి, ముంపు బాధితులతో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భోజనం, సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. పారిశుద్ధ్యం పాటించాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని, వ్యర్థాలు వెంట వెంటనే తొలగించాలని వారు అన్నారు. పునరావాస కేంద్రం పరిస్థితి చక్కబడే దాకా ఉంటుందని, ఇప్పుడే ఇండ్లకు వెళ్లి, ఇబ్బందులు పడవద్దని వారు అన్నారు. ఇండ్లలో క్రిమికీటకాలు, విష సర్పాలు చేరవచ్చని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు తడి ఉండగా ఆన్ చేయడం లాంటివి చేయవద్దని వారు అన్నారు. తీగలపై బట్టలు ఆరవేయడం చేయకూడదని, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 
    నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్, సిపి లు భోజనం మధ్యాహ్న భోజనం చేశారు.
    ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, అధికారులు, తదితరులు ఉన్నారు.

మంత్రి పువ్వాడ ను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ లు.



ఖమ్మంజిల్లాలో నూతన బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ (లోకల్ బాడీస్), మధుసూధన్ నాయక్(రెవెన్యూ) లు శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని VDO'S కాలనీ లొని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వరద పూర్తిగా అదులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారుజిల్లా అధికారులు, సిబ్బంది తమ కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వరద సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు అవసరం అయ్యే సేవలు అందించాలన్నారు.

Thursday, 27 July 2023

అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనండి....

ఖమ్మం: నిర్విరామంగా కురుస్తున్న వర్షాల ధాటికి మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆదేశించారు.
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే 48 గంటలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మంత్రి ఆదేశించారు. 

ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ vp గౌతమ్ తో కలిసి మంత్రి పువ్వాడ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలో 40 సెంటిమీటర్లకు పైగా వర్ష సూచన ఉన్నాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, FCI, దానవాయిగూడెం ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు..

జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట ప్రజలు నేరుగా రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను విష్ణు ఎస్.వారియర్ ను ఆదేశించారు.

ప్రమాదానికి ఆస్కారం వుండి, అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. 
వర్షంలో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు. లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 
ముంపుకు గురయ్యే ప్రాంతాలు, పీఆర్, ఆర్ అండ్ బి రోడ్లపై, కల్వర్టులపై నీరు ప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. రోడ్లపై రవాణా నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే సూచికలు ప్రదర్శించాలని, ప్రవాహంకి ఇరువైపుల ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి, సిబ్బందిని కాపలా పెట్టాలని ఆయన తెలిపారు.

Wednesday, 19 July 2023

జిల్లా అభివృద్ధిలో స్నేహలత పాత్ర ప్రశంసనీయం: కలేక్టర్ వి.పి.గౌతమ్.


ఖమ్మం, జూలై 19: జిల్లా సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా స్నేహాలత మొగిలి అత్యుత్తమ సేవలు అందించారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేస్తూ, బదిలీపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమీషనర్ గా వెళ్లిన స్నేహాలత మొగిలి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు మొదటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమింపబడి, 3 సంవత్సరాలకు పైగా జిల్లాలో విశిష్ట సేవలు అందించారన్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు బలోపేతం తోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం అదనపు కలెక్టర్ పోస్టులు ఏర్పాటుచేసిందని ఆయన తెలిపారు. జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, దళితబంధు, మన ఊరు-మన బడి లాంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో జిల్లా ఉన్నత స్థానంలో నిలుచుటలో స్నేహాలత పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పొంది, ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని, మార్గదర్శకంగా నిలిచారని కలెక్టర్ తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో బదిలీపై వెళుతున్నారని శుభాకాంక్షలు తెలియజేశారు.
    ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి మాట్లాడుతూ, విధి నిర్వహణలో స్వేచ్ఛ నిచ్చి ప్రోత్సాహించారని, ఖమ్మం లో పనిచేయడంతో మంచి అనుభవమని, విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
    కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన అదనపు కలెక్టర్ ని జిల్లా కలెక్టర్, అధికారులు ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపీఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 18 July 2023

జిల్లాకు రెడ్ అలెర్ట్... ముందస్తు చర్యలపై అధికారుల దృష్టి...


ఖమ్మం, జూలై 18: వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందన నేపధ్యంలో ఖమ్మం జిల్లా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టారు.
భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీస్ అధికారులతో కలెక్టర్ వర్ష పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలోని సింగరేణి, కామేపల్లి మండలాల్లో 100 మి.మి. పైగా, రఘునాథపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో 60 నుండి 100 మి.మి. వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరుగుతున్నట్లు, వీటి నివారణకు దామిని (damini) యాప్ పై డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దామిని యాప్ తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇర్రిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వున్న రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. వర్షం లో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు. లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ తెలిపారు. 
ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, అదనపు డిసిపి ఏ.ఎస్.సి. బోస్, ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, ఎస్డీసి దశరథం, ఏసీపీలు, తహశీల్దార్లు, పోలీస్, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలపై నివేదిక ఇవ్వండి: కలేక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, జూలై 18: ప్రతి పోలింగ్ కేంద్రాల సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఇఆర్ఓ లు, ఏఇఆర్ఓలు, ఎస్డిపీవో లు, ఎస్హెచ్ఓ లతో జిల్లా ఎన్నికల కార్యాచరణ, జిల్లా బందోబస్తు కార్యాచరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికి 1439 పోలింగ్ కేంద్రాలు, 718 లోకేషన్లలో ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పిమ్మట ఈ సంఖ్య పెరగవచ్చని ఆయన తెలిపారు. తహశీల్దార్లు, ఎస్హెచ్ఓలు పోలింగ్ కేంద్రాల వారిగా సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, అప్రోచ్ రోడ్లు, భద్రత, వల్నరబుల్  తదితర అంశాలపై పరిశీలన చేయాలన్నారు. 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను ఒక సెక్టార్ గా విభజించి, సెక్టార్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇవిఎం లలో 10 శాతం శిక్షణా, అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు, ఇట్టి ఇవిఎం లను నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి ఇవిఎం ల భద్రతకు నియోజకవర్గాల్లో గోడౌన్ ఎంపిక చేయాలని, గోడౌన్ కు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. మొబైల్ డిమాన్స్ట్రేషన్ వాహనాలు నియోజకవర్గానికి 2 వస్తాయని, వీటికి గ్రామ గ్రామాన తిరిగి ఓటర్లలో ఓటింగ్ పై అవగాహన కు షెడ్యూల్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అవగాహన కార్యక్రమాలు జూలై 20 నుండి ప్రారంభమై, ఎన్నికల నోటిఫికేషన్ వరకు కొనసాగుతాయని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, ర్యాంప్, టాయిలెట్, ప్రహారీ ఉండేట్లు చూడాలని, చేపట్టాల్సిన మరమ్మత్తులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఎస్ఎస్ టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల లోకేషన్లు తెలపాలని ఆయన అన్నారు. సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, గతం కంటే పోలింగ్ కేంద్రాలు, ప్రదేశాలు, రూట్లు పెరిగినట్లు, పెరిగిన కేంద్రాల ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పోలీస్ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి స్పష్టత కు రావాలన్నారు. జులై నెలాఖరు కల్లా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రాధాన్యత నిచ్చి, ప్రమాణాల ప్రకారం గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయాలని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ఇండ్ల యజమానుల వివరాలు తీసుకోవాలని, పోలింగ్ రోజున ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టకుండా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాకు 262 కి.మీ. మేర అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉన్నట్లు, చెక్ పోస్టుల ఏర్పాటుకు కార్యాచరణ చేయాలని అన్నారు. 
    ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, అదనపు డిసిపి ఏ.ఎస్.సి. బోస్, ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, ఎస్డీసి దశరథం, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు, తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 14 July 2023

జాగే తవజయ గాధ...చంద్రయాన్ - 3 తొలిదశ విజయవంతం


చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 తొలిదశ విజయవంతమైంది. బాహుబలి రాకెట్ గా పేరొందిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ శాటిలైట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట షార్ సెంటర్ నుండి ప్రత్యక్షంగా చంద్రయాన్ ప్రయోగాన్ని పలువురు వీక్షించారు  తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.యావత్ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను చంద్రయాన్-3 మిషన్ నింగిలోకి మోసుకెళ్లింది. భారత అంతరిక్ష రంగంలో చంద్రయాన్ ప్రయోగం మరో కలికూతురాయిగా నిలిచిపోతుంది. నెల్లూరులోని శ్రీహారి కోట సతీష్ ధవన్ అంతరిక్షకేంద్రం నుండి ఈ రోజు శుక్రవారం చంద్రయాన్ -3 ఎల్వీఎం3-ఎం4  రాకెట్ ను ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపించడం పట్ల ఊరు-వాడ ఆనందాన్ని వ్యక్తం చేశారు..ఇది అఖండ భారతవాని గర్వించదగ్గ విషయం.. ఈ సందర్భంగా ఇస్రో సిబ్బందితో సహా చైర్మన్,శాస్త్రవేత్తలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని  నరేంద్ర మోడీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంతులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వై.యస్.జగన్మోహన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.అంతే కాకుండా చంద్రయాన్ 3 విజయవంతం రానున్న రోజుల్లో అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ దేశాన్ని కీలక పాత్ర నిర్వహించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.


Monday, 3 July 2023

వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ...


తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.