Saturday, 26 December 2020

పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్..

కేరళ/పందళం : శబరిమల అయ్యప్పకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మకరజ్యోతి కార్యక్రమానికి ముందుగా అయ్యప్పకు పందళరాజు చేయించిన తిరువాభరణాలను అలకరించే అనావాయితి.ఈ అభరణాలు పందళం నుండి శబరిమాలకు కాలినడకన చెట్టు..పుట్ట..కొండాకోన దాటి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయ్యప్పను చేరుతాయి.దారిపొడవునా ఈ అభరణాలు ప్రయాణం చేసినంత దూరం ఆలయ సిబ్బంది, డోలీలతో పాటు..కేరళ పోలీసులు వెంట వుంటారు.ఈ ఏడాది ఈ అనవాయితి కొనసాగించేందుకు అభరణాల వెంట  పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్ వుంటారు. ఈ మేరకు పందళరాజ వంశీకులు ఓ లేఖను విడుదల చేశారు.
 అసలు ఈ తిరువాభరణాలు ఏమిటి ? 

అంటే వీటిని పందళ రాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని తెలుస్తోంది.

 సంవత్సరకాలం అంతా పందళ రాజ ప్రసాదంలోని "స్రంపికల్ భవనం"లో  అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచబడతాయి.మకర జ్యోతి కి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండలపూజా  సమయంలో ఇక్కడ  దర్శించుకోవచ్చును. 
మళయాళ పంచాగం(కొల్ల వర్షం) లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున అంటే జనవరి పన్నెండో తారీఖున తిరువాభరణ మూడు పెట్టెలకు ప్రత్యేక పూజల చేస్తారు. ఈ మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది  అయిన  తిరువాభరణం పెట్టిలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీ రూపు, పెద్ద, చిన్న ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెము, స్వామి వాహనాలైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. 
రెండోది  అయిన కొడి పెట్టిలో  స్వామి వారి ధ్వజాలు, అన్నిటికన్నా చిన్నదైనా "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి ఉంటాయి.
అనంతరం తెల్లవారు జాము నాలుగు గంటలకు పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ  పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకొంటూ శబరిమల బయలు దేరుతారు.వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు, కాపలాగా రక్షక భటులు ! 
వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్ధసారధి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహన్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక "కృష్ణ పక్షి" (గరుడ)ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ ఎనభై మూడు కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్థులు మహదానంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. 
మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాదులకు ఆలయాలలో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహన్నం పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానం చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో  మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన శ్రీ ధర్మశాస్త దర్శనం చేసుకోబోతున్నామన్నసంతోషం మొదలవుతుంది. సంధ్యా చీకట్లు ఆవరించుకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠ స్వామికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుండి మకర జ్యోతి కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామి శరణం!అయ్యప్ప శరణం!" అంటూ చేసే శరణ ఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి. 
శ్రీ ధర్మశాస్త ఈ ఆభరణాలను ధరించి ఐదు రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందళ రాజు పూజ చేసుకొన్న తరువాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు.పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్  గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త కి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి ఇరవై మూడో తారీఖు నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సినదే!!

No comments:

Post a Comment