యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలో ఒక పాతింటిని కూల్చిన సందర్భంలో నేలలో దేవాలయా స్తంభాలు, సింహయాళీలు బయటపడ్డాయి. ఒక శాసనం కూడా బయటపడ్డది. శిలాఫలకానికి ఒకే పక్క చెక్కబడిన శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో రాసిన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు కాలం నాటిది. ఆ వివరాలు:
భువనగిరి శాసనం:
1. స్వస్తిశ్రీ మన్మహామండలేశ్వర కాకతి
2. య్య ప్రతాపరుద్రదేవ మహారాజు
3. లు సుఖసంకథావినోదంబుల
4. 0 బ్రదివి రాజ్యంబు సేయుచుం
5. డంగాను శక వరుషాలు 1240 అ
6. వు కాళయుక్తి సంవత్సర ఆషాఢ
7. శు 15గు భునగిరి అష్టాదశప్రజను
8. మహారాజునకూను లెంకలకూను
9. అధికారులకూను కరణాలకూను తమ
10. కూం బుణ్యముగాను గొని ఆయూరి శ్రీవి
11. రద్రేశ్వర దేవరకూను ఆపురోతు
12. లకు అంగభోగాత్తమ బలంజ
13. లు పెఱుకందెచ్చిన బండానను పెఱు
14. కను సోవందూను ప్రతిమలగను
15. ఫలమెందూను వా02కలు అసి
16. బెనులయిదు పొంకలూను దీపా
17. నకు వడ్డలగండెగానుగును నిత్య
18. సోలెండు నూనెను ఆచంద్రస్తాయిగా
19. ను చెల్లను ధారవొస్తిమి ...క్రమ
20. ము యట్లచెల్లించుట మహాపుణ్య
21. ము అయినందుగాను శ్రీరామ
22. వాక్యం శ్లోకం ..సామాన్యోయం
శాసన సారం:
మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజు పాలిస్తుండగా శక సం.లు 1240, కాళయుక్తి సం. ఆషాఢ శు.15/పౌర్ణిమ గురువారం అనగా క్రీ.శ.1318 జూన్ 14వ తేదీన
భువనగిరి చెందిన అష్టాదశప్రజలు, మహారాజుకు, లెంకలకు, అధికారులకు, కరణాలకు, తమకు పుణ్యంగా ఆవూరి అనగా భువనగిరి శ్రీవీరభద్రేశ్వర దేవరకు, పురోహితులకు, అంగభోగ నిమిత్తం
బలంజలు పెఱుకలో తెచ్చిన బండా(రం)ను పెఱుకకు సోవందు ప్రతిమలకుగాను ఫలం నిమిత్తం, వాకలు అసిబెనులు అయిదు పొంకలు దీపానికి వడ్డెలగండెగానుగునూనె నిత్యం సోలెడు నూనెను ఆచంద్ర(ఆ సూర్య, చంద్రులున్నంతవరకు) చెల్లేటట్లు ధారవోసినాము. ఈ క్రమం చెల్లించటం పుణ్యం.
శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం
శాసనప్రతి సహకారం: ఆవుల వినోద్, భువనగిరి
No comments:
Post a Comment