Wednesday, 31 May 2023

బ్రాహ్మణ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో నిర్మించిన 'విప్ర‌హిత' బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. 
ఈ కార్యక్రమంలో మంత్రీ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ శ్రీ కెవి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు

Sunday, 28 May 2023

Sr.NTR కు ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.


హైదరాబాద్ : విశ్వవిఖ్యాత నట సార్వభౌమూడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అధ్వర్యంలో హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లోని NTR గారి విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పూల మాలలు వేసి నివాళులర్పించారు. 
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరానికి ఎదిగి తమ నటనలో తనదైన గుర్తింపు సాదించుకుని ఎన్ని వైవిద్యమైన పత్రాలు పోషించి, విలక్షణమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీఆర్ గారు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
ఎన్టీఆర్ గారు అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని కీర్తించారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని, తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.
నివాళులు అర్పించిన వారిలో NTR కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ, మనవరాలు ప్రసన్న తదితరులు ఉన్నారు

Friday, 26 May 2023

శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం 8.22 నుండి 8.49 గంటల మధ్య  మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 
అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.
  అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం 

Tuesday, 16 May 2023

పూర్ణాహుతితో సంపూర్ణమైన అఖండ సుందరకాండ పారాయణం... కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి శుభాశీస్సులు


తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించిన అఖండ సుందరకాండ పారాయణం సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించి.. పూర్ణాహుతి ద్వారా సంపూర్ణం చేశారు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా రాత్రి 8:45 గంటలకు ముగిసింది .
 సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను 67 మంది వేద పండితులు పఠించారు.
భక్తులు కూడా ఎంతో అంకితభావంతో పాల్గొన్నారు.పూర్ణహుతి కార్యక్రమంలో
టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొనగా.. కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి ప్రత్యేకంగా హాజరై అందరికీ శుభ ఆశీస్సులు అందజేశారు.

జీవో 59 ప్రక్రియను సద్వినియోగం చేసుకోండి : జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌


మే,16 ఖమ్మం: ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. జీవో 59 క్రింద జిల్లాలో 2,559 దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇట్టి దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు జారికిగాను ప్రభుత్వ కనీస భూ ధర చెల్లింపుకు డిమాండ్‌ జారిచేయుట జరిగినదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 247 దరఖాస్తుదారులు పూర్తి మొత్తం, 50 మంది పాక్షికంగా చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు. డిమాండ్‌ మేరకు చెల్లింపులు చేసి, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెల్లింపులు చేసిన వారికి క్రమబద్ధీకరణ చేసి, పట్టాల జారిచేయుట జరుగుతుందన్నారు.  క్రమబద్ధీకరణతో సర్వ హక్కులు వస్తాయన్నారు. బ్యాంకర్లు నిర్మాణాలు తదితర అవసరాలకు ఋణాలు అందజేస్తారన్నారు.  అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి డిమాండ్‌ చెల్లింపుపై అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్లు సంయుక్తంగా క్షేత్ర సందర్శన చేయాలని, డిమాండ్‌ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  అనదీకారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే క్రమబద్దీకరణ చేసుకోవాలన్నారు.  డిమాండ్‌ చెల్లించకుండా అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వారిపై తగు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, జిల్లా రిజిస్ట్రార్‌ సిహెచ్‌. అశోక్‌ కుమార్‌, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, ఖమ్మం అర్బన్‌, సత్తుపల్లి తహశీల్దార్లు శైలజ, శ్రీనివాసరావు, ఖమ్మం సబ్ రిజిస్ట్రార్-2: జ్యోతి,  సత్తుపల్లి మునిసిపల్‌ కమీషనర్‌ సుజాత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Monday, 15 May 2023

అర్జీలను సత్వరమే పరిష్కారించండి... కలెక్టర్ వి.పి.గౌతమ్


 ఖమ్మం మే 15: అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.  సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్‌ డే’’ లో కలెక్టర్‌ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతు సంఘం వైరా మండల కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, టి.నాగేశ్వరావులు వైరా మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా చేయడం జరిగిందని, అకాల వర్షాల తాకిడికి పండించిన  పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాల్సిందిగా సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.   తల్లాడ మండలం తల్లాడ గ్రామ పంచాయితీ పరిధి మల్లారం రోడ్‌, 3 వ వార్డు నివాసులు బాలబారతి రోడ్‌, కొత్తగూడెం వెళ్ళు మార్గంలో చాపల దుకాణం, చికెన్‌ షాపుల వ్యర్థాలను వేయడం వల్లన, దుర్వాసన, రైస్‌ మిల్లు నుండి డస్ట్‌ వెలువడడం వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతున్నదని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చగరలని, చెత్తకుండీలు ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.  తిరుమలాయపాలెం మండలం సీతారాంపురం గ్రామనికి చెందిన గుంటి నాగేశ్వరరావు తనకు తాళ్ళచెర్వు రెవెన్యూ పరిధిలో సర్వేనెం.230/అ2/1లో 2 ఎకరాల 29 కుంటల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చిన భూమిని వేరొకరి పేరున ఎక్కించడం జరిగిదని తన భూమిని తనకు ఎక్కించగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా తిరుమలాయపాలెం తహశీల్దారను ఆదేశించారు.  ఖమ్మం నగరం పంపింగ్‌వెల్‌రోడ్‌కు చెందిన సోపాల ధనలక్ష్మీ తన కూతురు సోపాల జననికి తలలో గడ్డ ఉండడం వల్ల కాళ్ళు చచ్చుబడి, కంటిచూపు కూడా లేక మంచానికే పరిమితం అవ్వడం జరిగినదని, ఆర్ధిక స్తోమత లేదని, తన కూతురు పేరున డబుల్‌ బెడ్‌రూమ్‌ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారికి సూచించారు.  రఘునాథపాలెం మండలంకు చెందిన పద్మశాలి, గౌడ కమ్యూనిటీలకు సర్వేనెం.  17/పి నందు 59 కుంటల భూమిని కేటాయించడం జరిగినదని, అట్టి భూమి ప్రక్కన ఉన్న చిన్న (శివ) ప్రభుత్వం కేటాయించిన భూమి తనదని అక్రమించడం జరిగినదని, అట్టి భూమిని తిరిగి మాకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం అదనపు కలెక్టర్‌కు సూచించారు. ఖమ్మం నగరంకు చెందిన  కె.రమ్యశ్రీ తాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అకౌంటెంట్‌ కమ్‌ డి.ఈ.ఓ జాబ్‌ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని దానిలో భాగంగా 75 శాతం ఓ.సి ఉమెన్‌ కోటా క్రింద మెరిట్‌లో                  ఉండడం జరిగినదని, తనకంటే తక్కువ శాతం ఉన్న వ్యక్తిని సెలక్ట్‌ చేయడం జరిగినదని విచారణ చేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి సూచించారు. 
‘‘గ్రీవెన్స్‌ డే’’ లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మదుసూదన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా సైనిక బోర్డు సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం, పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.మునిసిపల్, పంచాయతీల నుండి ఆస్తి పన్ను మినహాయింపు విషయమై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బకాయిల మొత్తానికి మినహాయింపు ఉత్తర్వులు సంబంధిత అధికారులు జారీచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్యాలంటరీ అవార్డ్ గ్రహీత ఎన్. రోశయ్య కు నగదు గ్రాంట్ చెల్లింపుకు చర్యలు చేపట్టాలన్నారు. గన్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసిన మాజీ సైనికుల దరఖాస్తుల పరిష్కారం వెంటనే అయ్యేలా చూడాలన్నారు. మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారికి ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించాలన్నారు. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని డబల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో మాజీ సైనికులకు 2 శాతం ఇండ్ల కేటాయింపులు చేపట్టాలన్నారు. స్వయం ఉపాధికల్పనకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాజీ సైనికులకు కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా ఇంచార్జ్ సైనిక సంక్షేమ అధికారి శ్రీరామ్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, డిఆర్డీవో విద్యాచందన, డిపివో అప్పారావు, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, నాన్ అఫీషియల్స్ కె. నవీన్, ఎస్.ఎం. అరుణ్, వై. రామకృష్ణ, కె. నరేష్, ఎల్. భాస్కర్, పి. రవి మారుతి, అధికారులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sunday, 14 May 2023

తిరుమలలో జాపాలి-ఆకాశగంగా ప్రాంతాల్లో హనుమజ్జయంతి వేడుకలు


     తిరుమలలో హనుమజ్జయంతి వేడుకల‌ను మే 14 నుండి 18వ తేదీ వరకు 
అంజనాద్రి ఆకాశ గంగ, జపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు టిటిడి ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వ‌హించనున్నారు 
     
     ఇందులో భాగంగా అంజనాద్రి ఆకాశ గంగ వద్ద ఉదయం 8.30 గంటలకు,
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఉదయం 9 గంటలకు, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి మధ్యాహ్నం 3 గంటలకు హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు.
  అదేవిధంగా జాపాలి తీర్థంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు స్వామివారికి  పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.
          కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం   ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది. 
 
      హనుమత్ జయంతి సందర్భంగా మఠాధిపతులు అనుగ్రహభాషణం ఇవ్వనున్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్.వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను టిటిడి ఏర్పాటు చేసింది.

పురాణ ప్రాశస్త్యం -

       వానర దేవుడైన హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తొంది. ఆ రోజున వాయువుపుత్రుడైన హనుమంతుడుని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని, శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పండితులు తెలిపారు.

         లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం.  

       కావున తెలుగు ప్రజలు హనుమంతుడు జన్మించిన చైత్రపూర్ణిమ పర్వదినం నుండి 41 రోజులు హనుమదీక్ష ఆచరించి, వైశాఖ మాసం కృష్ణపక్షం బహుళ దశమినాడు 10వ రోజు హనుమజ్జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

Saturday, 13 May 2023

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం...

తిరుపతి  కపిలతీర్థంలో గల పురాతన 
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక  కార్యక్రమాలు, అక్షిణ్మోచనం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, రత్నన్యాసం, బింబస్థాపన, అష్టబంధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం బింబవాస్తు, నవ కలశ చతుర్దశ కలశ స్నపనం, మహాశాంతి, తిరుమంజనం, పూర్ణాహుతి, శయనాధివాసం నిర్వహించారు. మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తిడిపై ఉంది సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ


     తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ  రమణ అన్నారు.
      తిరుపతి - తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల - శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు.
    అలిపిరి టోల్ గేట్ వద్ద ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి  తో కలసి  జెండా ఊపి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమల నుండి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద జస్టిస్ రమణ పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
      ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, తిరుమల కొండలు పరమ పవిత్రమైనవని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల ను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో ప్రతి భక్తుడు భాగస్వాములు కావాలని కోరారు. 2008లో ఈవో శ్రీ ధర్మారెడ్డి ని తమకు ఇలాంటి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. భగవంతుడు తనకు ఇన్నాళ్లకు ఆ అవకాశం ఇచ్చారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈవో తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని, ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.
    ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, 25 రోజుల క్రితం 1600 మంది పారిశుధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో తిరుపతి తో పాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ ల నుండి పారిశుధ్య కార్మికులను రప్పించి టీటీడీ అధికారులు ఉద్యోగులు పారిశుద్ధ్య పనులు చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి శనివారం సామూహిక పారిశుధ్య కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. ఇందులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారని చెప్పారు. ఇకపై ప్రతినెల రెండో శనివారం సుందర తిరుమల- శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, భక్తులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమల ను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. తిరుమలకు భక్తులెవరు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకుని రావద్దని కోరారు.