Sunday, 29 October 2023

*రెండు రోజుల్లో తెల్ఛండీ లేకుంటే ఒంటరి పోరుకు సిద్ధం: తమ్మినేని అల్టిమేటం


*మిర్యాలగూడతో పాటు... వైరా ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ*
*రెండు రోజుల్లో* *పొత్తులు తేల్చాలి*...
*ఇంకా ఎన్నోమెట్లు దిగే పరిస్థితి లేదు*..
*రాజకీయ విధానాన్ని కాపాడుకునేలా తమ నిర్ణయం*
- *కాంగ్రెస్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అల్టీమేటం*

ఖమ్మం, అక్టోబర్‌ 29, 2023 :`  కాంగ్రెస్‌ చెప్పినట్లుగానే మిర్యాలగూడతో పాటు వైరా అసెంబ్లీ సీట్లను సీపీఐ (ఎం)కు కేటాయించకపోతే లౌకిక శక్తులను కలుపుకొని విడిగా పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండురోజుల్లో ఏ నిర్ణయమైంది తెలపకపోతే తమ పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు వచ్చేది ఉండదని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. లౌకికశక్తుల ఐక్యత కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రతిపాదన పెట్టారని, ఆ ప్రకారం తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ పది సార్లు ఎన్నికలు జరిగితే దానిలో 8 సార్లు భద్రాచలం స్థానాన్ని సీపీఐ (ఎం) దక్కించుకుందన్నారు. అయినప్పటికీ తాము ఆ స్థానాన్ని త్యాగం చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడెం, భద్రాచలం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను తమ పార్టీ కోరిందన్నారు. ఈ స్థానాలు కాంగ్రెస్‌తో పొత్తు కోసమో...లేక ఇతర పార్టీలతో పొత్తుకోసమో ఎంపిక చేసినవి కాదు..తమకున్న బలం దృష్ట్యా వీటిని ఎంచుకున్నామన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం మొదటి నుంచి ఒక మాట స్పష్టం చేస్తూ వచ్చిందన్నారు. భద్రాచలం తమ సిట్టింగ్‌ స్థానం... అందరూ అమ్ముడుపోయినా సరే అక్కడి ఎమ్మెల్యే మాత్రం నిబద్ధతతో పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చిందన్నారు. ఆయన సీటు మార్చడం తప్పుడు సంకేతాలిస్తుందని కాంగ్రెస్‌ చెప్పిందని, ఒకటి, రెండుసార్లు పట్టుబట్టినా వారు చెప్పిన దాన్ని గౌరవించామన్నారు. అప్పటికీ ఉదాహరణ చెప్పామని త్రిపురలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ పార్టీ సిట్టింగ్‌ సీటును కోరితే ఇచ్చిన ఉదంతాన్ని కూడా ప్రస్తావించామన్నారు. అయినా సరే వారు పట్టుబట్టారు..దీంతో భద్రాచలం స్థానాన్ని వదిలేశామన్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కస్థానమైనా ఇవ్వాల్సిందిగా కోరుతూ పాలేరు సీటు అడిగామన్నారు. ఒక దశలో వారు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినా...ఆ తర్వాత మీడియాలో లీక్‌లు ఇచ్చారు...ఈ వార్తలు కాంగ్రెస్‌ పార్టీ లీకుచేసిందా...! లేక పత్రికలు ఊహించి రాశాయా? తెలియదుగానీ తమ్మినేని వీరభద్రం పట్టుదలతోనే చర్చలు ఆలస్యమవుతున్నాయి...అని ఓ పత్రికలో వార్తలు సైతం వచ్చాయన్నారు. తాజాగా మరో పత్రిక మిర్యాలగూడెం, వైరా రెండుస్థానాలు ఇస్తామంటే కూడా వైరాను కాదని పాలేరు కోసమే సీపీఐ(ఎం) పట్టుబడుతుందని మరో పత్రిక రాసిందని తెలిపారు. ఇవేవీ వాస్తవాలు కాదన్నారు. 27వ తేదీ ఉదయం పాలేరు సీటు ఇవ్వడం కుదరదని చెప్పి...కాంగ్రెస్‌ క్యాండిడేట్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించిందన్నారు. అదేరోజు సాయంత్రం తమ పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగిందని తెలిపారు. దానిలో వైరా సీటును అంగీకరిద్దామనే నిర్ణయం జరిగిందని చెప్పారు. ఆ ప్రకారం మిర్యాలగూడెం, వైరా సీట్లను తీసుకోవడానికి సిద్ధమయ్యాయమన్నారు. దీనికంటే ముందు ఏఐసీసీ నాయకులు ఒకరు వైరా స్థానం నుంచి ఓ ఇండిపెండెంట్‌ పోటీ చేస్తారని, కానీ నచ్చజెప్పుతామని ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. 27వ తేదీ రాత్రి ఆ ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రికి ఫోన్‌ చేసి వైరాకు అంగీకారం తెలిపామన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టితో మాట్లాడిస్తామని ఆ నాయకుడు చెప్పారే కానీ ఆ తర్వాత ఏ ఒక్క నాయకుడు తనతో మాట్లాడలేదన్నారు. అయినప్పటికీ ఆదివారం ఉదయం తానే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఫోన్‌ చేసి వైరా తీసుకోవడానికి సిద్ధమని చెప్పానన్నారు. దానికి ఆయన స్పందిస్తూ మిర్యాలగూడతో పాటు ఇంకో సీటు ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తున్నామని సమాధానం చెప్పారన్నారు. దీనిపై వైరా ఇస్తామని అన్నారు కదా..! అంటే తాము ఎప్పుడూ అనలేదని ప్రతిసమాధానం చెప్పినట్లుగా తెలిపారు. దీనిపై తాము సీపీఐ(ఎం) ఇచ్చే సీట్ల విషయం చెప్పండని ప్రశ్నించామన్నారు. దానికి వారు మిర్యాలగూడెంతో పాటు హైదరాబాద్‌ సిటీలో ఓ సీటు ఇస్తామని చెప్పినట్లుగా తెలిపారు. తామెప్పుడూ హైదరాబాద్‌లో సీటు అడగలేదు కదా! అని ప్రశ్నించామన్నారు. దీనిబట్టి సీపీఐ(ఎం)తో పొత్తు పట్ల కాంగ్రెస్‌కు సీరియస్‌నెస్‌ లేదని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించుకోవాలన్నారు.
ఈ రాష్ట్రంలో బీజేపీ  గానీ, బీజేపీ అనుకూల శక్తులేవీ గెలవొద్దని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ఆ ప్రాధాన్యతను గుర్తించి మిర్యాలగూడతో పాటు వైరా స్థానాన్ని ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధమన్నారు. లేదంటే ఇంకా ఎన్నిమెట్లో దిగటం కుదరదన్నారు. భద్రాచలం నుంచి పాలేరు, అక్కడి నుంచి వైరా అన్నారు..ఇప్పుడు వైరా కూడా కాదంటే పొత్తు సాధ్యం కాదన్నారు. మరోవైపు మిర్యాలగూడ ఒప్పుకున్నా కాంగ్రెస్‌ అభ్యర్థిగా భావిస్తున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారని తెలిపారు. అది చూసి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు తమ పార్టీ జిల్లా నాయకత్వానికి ఫోన్‌ చేసి వైరాలో తాము కూడా స్వతంత్ర అభ్యర్థిని పెడతామని చెప్పుతున్నట్లు పేర్కొన్నారు. అస్సలు నాయకులు సీట్లు ఇవ్వకుండా పక్కదారి పట్టించే యత్నం...ఆ నియోజకవర్గ స్థానిక నాయకులేమో మా నాయకులు సీట్లు ఇచ్చినా మీకు మేము ఎసరు పెడతామనే రీతిలో వ్యహరిస్తున్నారన్నారు. మిర్యాలగూడెం, పాలేరు రెండు ఇవ్వడం అవసరం...ఈ రెండిరటిలో పోటీ లేకుండా ఐక్యంగా గెలిపించాల్సిన అవసరం కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై ఉందన్నారు. కొందరు మీరైతే గెలవలేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు..కాంగ్రెస్‌ ఓట్లేస్తే తామెందుకు గెలవమని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) లేకుండా ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ ఎలా గెలుస్తుందన్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)కలిస్తే ఏంటో చూపించాలంటే ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని కోరారు. ఆరకంగా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విడిగా పోటీ చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. ఇవేవీ లేకుండా తమ వెంట రమ్మంటే తాము రాజకీయాల కోసం, రాజకీయ విధానం కోసం         ఉన్నామన్నారు. తమ ఆర్గనైజేషన్‌ను కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. రాజకీయ విధానం, ఆర్గనైజేషన్‌ను కాపాడుకునే లక్ష్యంతో తప్పకుండా తాము ఆలోచన చేస్తామన్నారు. రేపటి వరకు చూసి, ఎల్లుండి రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందన్నారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర కమిటీ మీటింగ్‌ ఉంటుందని, దీనికి పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ లోపు ఏ సీట్లు అనేది కాంగ్రెస్‌ స్పష్టం చేయకపోతే ఆ సమావేశాల్లో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఒక్కసారి నిర్ణయానికి వచ్చాక సీపీఐ(ఎం) వెనక్కు తగ్గేది ఉండదని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఎం.సాయిబాబు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి పాల్గొన్నారు.

Saturday, 28 October 2023

పోలీసు వాహనాలు జల్లేడ పడుతున్న కేంద్ర బలగాలు...


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెపట్టిన వాహనాలను అన్ని కోణాల్లో పరిశీలించి కేంద్ర బలగాలు సంతృప్తి పడిన తర్వాతే పంపుతున్నట్లు తెలిసింది. పోలీస్‌ సిబ్బంది గత ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బు సంచులను పోలీస్‌ వాహనాల్లోనే తరలించి ఓటర్లకు పంపిణీ చేశారని ప్రత్యర్థులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రావొద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల నిర్వహణలో కేంద్ర బలగాలు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. లోకల్‌ పోలీసుల మాటలను పట్టించుకోవడంలేదని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోపక్క ట్రై కమిషనరేట్ల సీపీలు సైతం విధినిర్వహణలో కచ్చితంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహించినా, అలసత్వం ప్రదర్శించినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. బోరబండ ఇన్‌స్పెక్టర్‌ వద్ద రౌడీషీటర్ల సమాచారం లేకపోవడంతో సీపీ కార్యాలయానికి ఆయనను హైదరాబాద్‌ సీపీ అటాచ్‌ చేశారు.
ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో రౌడీషీటర్ల మధ్య గ్యాంగ్‌వార్‌, మర్డర్‌ జరగడంతో అక్కడే ఇన్‌స్పెక్టర్‌, ఏసీపీలకు చార్జి మెమో ఇచ్చినట్లు సమాచారం..

Thursday, 26 October 2023

*టీఎస్,ఆర్టీసీ కి కోట్ల ఆదాయం తెచ్చి పెట్టిన దసరా పండుగ*


తెలంగాణలో దసరా పండుగ ధూం ధాంగా జరిగింది. టీఎస్ ఆర్టీసీకి ఈ దసరా పండుగ కోట్ల వర్షం కురిపించింది. దసరా పండుగ వేళ టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
కేవలం 11 రోజుల్లోనే.. ఆర్టీసీ ఖాజానాలో సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. పండుగను పుసర్కరించుకుని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడిపించింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు నగరంలోని అన్ని పికప్ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. అయితే.. ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది టీఎస్ ఆర్టీసీ. అయితే.. ఈసారి డైనమిక్‌ ఛార్జీలను కూడా టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలోనే డైనమిక్‌ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ.. పండుగ వేళ అవి ఆర్టీసీకి కలిసొచ్చాయి. విశాఖపట్టణం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు డైనమిక్ ఫేర్‌ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు
ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో జనాలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇక పండుగ సందర్బంగా..అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపించింది. తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా.. సాధారణంగా రోజూ ఆర్టీసీకి సుమారు 12 నుంచి 13 కోట్ల ఆదాయం సమకూరగా... దసరా పండుగకు మాత్రం ప్రతిరోజూ అదనంగా 2 నుంచి 3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
అత్యధికంగా ఒక రోజు 19 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా.. ఆర్టీసీకి గత 11 రోజుల్లోనే 25 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు 2 కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు...

Monday, 23 October 2023

*కన్నుల పండుగగా స్వామి వారి పారు వేట. .*పాల్గొన్న మంత్రి పువ్వాడ, కుటుంబ సభ్యులు..*



ఖమ్మం: విజయదశమిని పురస్కరించుకుని ఖమ్మం శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి పారు వేట కన్నుల పండుగగా జరిగింది.రేవతి సెంటర్లో గల ఆలయ మెట్ల వద్ద అర్చకుల అధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పారువేటలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పల్లకి ని ఎత్తుకుని స్వామి వారి పారు వేటను ప్రారంభించారు.అక్కడి నుండి నెహ్రూ నగర్, వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్ మీదగా జమ్మిబండ వరకు స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ జమ్మిబండ్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) పారువేట స్థలంకు చేరుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ దుర్గా దేవి అమ్మ వారికి మంత్రి దంపతులు అజయ్ కుమార్, వసంత లక్ష్మీ, తనయుడు, కోడలు Dr. నయన్, అపర్ణ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ  సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..ఖమ్మం శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి స్వామి వారి పారువేట సేవ, శమీ పూజ, అమ్మ వారి వద్ద పూజ, రావణ దహనం నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నానని అన్నారు.స్వామి వారి పారుసేవలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు నాకు మంచి ఆరోగ్యం, విజయం ఇవ్వడం వల్లే వారు దయ తోనే ఖమ్మంను ఇంత అభివృద్ది చేయగలిగా అని అన్నారు. ఇలానే ఆ స్వామి వారి దీవెనలు మన ఖమ్మం ప్రజలపై ఉండాలని, వారి చల్లని కరుణ మనందరిపై ఉండాలని కోరుకుంటూన్నానని అన్నారు. అనంతరం రావణ దహనం చేశారు.విజయాలను చేకూర్చ విజయదశమి ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకతో ఈ పండుగను జరుపుకోవాలనిఆకాంక్షించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు(చిన్న), గోలి అనూప్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, దాదే అమృతమ్మ సతీష్, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరిరావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, సింగు శ్రీను, మందడపు రమా రావు, సత్యాల మధు, కణతాల నర్సింహా రావు, ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Saturday, 21 October 2023

అమరవీరుల ఆశయాలకు కృషి చేద్దాం.... పోలీసు అమరుల దినోత్సవంలో కలెక్టర్.వి.పి.గౌతమ్,.సి.పి. విష్టువారియర్ పిలుపు..


ఖమ్మం, అక్టోబర్ 21: పోలీస్ అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్  వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్  పేరడ్‌ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత, అమర వీరుల స్మృత్యర్థం సాయుధ బలగాలు పెరేడ్, గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. గార్డ్ ఆఫ్ హానర్ పెరేడ్ ఇన్చార్జిగా ఆర్ఐ శ్రీశైలం  వ్యవహరించారు.దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధినిర్వహణలో అసువులు బాసిన 189 మంది అమర వీరుల పేర్లను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ కేఆర్ కె. ప్రసాద్ రావు చదివి వినిపించారు. పోలీసు అమర వీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన వారి కుటుంబీకులు, బంధువులు స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించే సమయంలో, తమ వారిని స్మరించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వర్తిస్తున్నారని, తీవ్రవాదం, ఉగ్రవాదం, అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటాల్లో ఎంతో మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తున్నారంటే అనాటి పోలీసు త్యాగాల ఫలితమేనని అన్నారు. నక్సలైట్ ప్రభావితమైన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గతంలో పోలీస్ సిబ్బంది పోలీస్ వాహనాలలో తిరిగే పరిస్థితి వుండేది కాదని, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి తీవ్రవాద కార్యకాలాపాలను అదుపు చేయగలిగారని అన్నారు. అలాంటి సందర్భంలో కూడా పోలీసు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వున్నాయని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలను నిస్పక్షపాతంగా అమలు చేయడంలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్య దేశానికి ఇది కీలకమని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోబం తలెత్తిన తొలి రోజుల్లో  కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పోలీసు బలగాలు కీలకపాత్ర పోషించారని, లాక్ డౌన్ నిబంధనల అమలులో పోలీసు బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు. రానున్న ఎన్నికలలో సైతం స్వేచ్చ, శాంతియుత వాతావరణంలో  నిస్పక్షపాతంగా ఎన్నికలు  నిర్వహించేందుకు జిల్లా పోలీస్  యంత్రాంగం సిద్ధంగా వుందని అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ,1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడి పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారని,
అనాటి నుండి దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నామని, వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకిత చేశారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇంటి స్ధలం ఎదురుచూస్తున్న ఖమ్మం పోలీస్ అమరవీరుల  కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ చొరవతో 22 మంది కుటుంబ సభ్యులకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా 
అక్టోబర్‌ 25, 27 తేదీల్లో సైకిల్ ర్యాలీ, 26వ రక్తదాన శిబిరం, 27వ తేదీన పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు , 28 న ఆన్‌లైన్ ఓపెన్ హౌస్, విద్యార్థులకు ఆన్‌లైన్  వ్యాసరచన పోటీలు,  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
     అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో జిల్లా కలెక్టర్ ,పోలీస్ కమిషనర్లు మాట్లాడారు. ఏదైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పాషా కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ చేయూత ఫండ్ నుండి లక్ష రూపాయల చెక్కు ను కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు.
     కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు గణేష్, హరికృష్ణ, బస్వారెడ్డి, రహెమాన్, ప్రసన్న కుమార్, కృపాకర్, రవి, సారంగపాణి, శివరామయ్య, సాంబరాజు నర్సయ్య , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

*’అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి’**- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర...**-అమరవీరులకు ఘనంగా నివాళులు..*



సైబరాబాద్: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (అక్టోబర్ 21, 2023) సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్‌ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సీపీ గారు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే  బాధ్యత  పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు.
ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్‌ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు  189  పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.అమరుల మరణం వారి కుటుంబసభ్యులకు తీరని లోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డిపార్ట్ మెంట్ పోలీసులు.. కాబట్టి పోలీసులకు ఎప్పుడూ సహకరించాలన్నారు. 
1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. 
అలాగే 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు. 
అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ) ఏడీసీపీ శ్రీనివాస్ రావు చదివారు.
అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమన్గల్ ఎస్ఐ కే హనుమంత్ రెడ్డి, తలకొండపల్లి  పోలీస్ కనీస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మ్ డ్ కానిస్టేబ్లుల్ ఈశ్వర్ రావును సేవలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శాలువా కప్పి సత్కరించారు. 
భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందన్నారు. 
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలైందని, మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవన్నారు. 
1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు అమరులయ్యారు. 'హాట్ స్ప్రింగ్స్' అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం అని, కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన 'హాట్ స్ప్రింగ్స్' నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతీ ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., డీసీపీ అడ్మిన్ శ్రీ రవి చందన్ రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, శంషాబాద్ డీసీపీ శ్రీ నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, ఐపీఎస్., డీసీపీ రోడ్ సేఫ్టీ ఎల్ సి నాయక్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, సీస్డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఇతర  ఏడీసీపీలు, ఏసీపీలు, సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, సీఏఓ అడ్మిన్ గీత,  ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది, పోలీసు సిబ్బంది, మరియు మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

MALAYAPPA SHINES ON SURYAPRABHA #Tirumala on Bramostvams# సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం



తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
TIRUMALA, Sri Malayappa Swamy shined brightly on Suryaprabha Vahanam on Saturday morning.The seventh day of the ongoing Navaratri Brahmotsavams witnessed Suryprabha Vahanam, the Sun carrier to bless His devotees along the four mada streets.
Sri Malayappa was decked with a mammoth bright red ixora flowers garland which enhanced the charm and richness of the processional deity.
In the entire constellation, Sun has a significant role and is believed to be the chief source of life on earth.

#Credit by: ttd photographer#

Friday, 20 October 2023

ఎన్నికల వేళ వినూత్నంగా బతుకమ్మ సంబరాలు....


ఖమ్మం, అక్టోబర్ 20: నూతన కలెక్టరేట్ లో ప్రతిరోజూ వినూత్నంగా జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకలు శుక్రవారం మహిళా ఉద్యోగులు సంబురంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో ఎన్నికల భావనతో చేపట్టిన బతుకమ్మ లతో మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.
సి విజిల్ ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి డౌన్లోడ్ చేసుకోవాలని, యువత కు అవగాహన కల్పించి డౌన్లోడ్ చేయించాలని అన్నారు. డబ్బు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటు వేయాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టే సామాజిక బాధ్యతను ప్రతిఒక్కరు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి డిఆర్డీఓ విద్యాచందన,జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, డిడబ్ల్యూఓ సుమ, జిల్లా  అధికారులు, మహిళలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించండి : కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, అక్టోబర్ 20: అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులకు పీవో, ఏపీవోల విధులపై చేపట్టిన శిక్షణ, అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీవో, ఏపీవోలు పోలింగ్, పోలింగ్ యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి వుండాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఎన్నికల అధికారులు, బ్యాలెట్ యూనిట్, ఏజెంట్ ల సీటింగ్ నమూనా మేరకు చేపట్టాలన్నారు. పోలింగ్ యంత్రాల సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మాక్ పోలింగ్, పోలింగ్ సందర్భంలో సాంకేతిక సమస్యలు ఎదురయినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు-1, 2, 3 లు ఎన్నికల సందర్భంలో ఏ ఏ విధులు నిర్వర్తించాలో మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలన్నారు. మాక్ పోల్ పూర్తయ్యాక తప్పనిసరిగా క్లియర్ చేయాలన్నారు. బూత్ ఆక్రమణ, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి, క్యూ నిర్వహణ ఎలా చేయాలి, ఓటర్ల గుర్తింపు ఏ విధంగా చేపట్టాలి, ఓటింగ్ తర్వాత క్లోజ్ బటన్, ఓటింగ్ యంత్రాల సీలింగ్, ఎన్నికల పత్రాల సీలింగ్, చట్టబద్ధమైన ఫారాలు పూరింపులపై అవగాహన కల్గివుండాలని కలెక్టర్ అన్నారు. ఎన్నికల సంఘం చే జారీచేసిన పీవో హ్యాండ్ బుక్,  పూర్తిగా చదివి, ఏ సమయంలో ఏం చేయాలి తూ.చ. తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు. 
     కార్యక్రమంలో మాస్టర్ ట్రేయినర్లు శ్రీరామ్, మదన్ గోపాల్ లు పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ అధికారుల విధులు, భాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించారు. ఓటింగ్ యంత్రాలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు.
    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ మలయప్ప....


తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
హ‌నుమంత వాహ‌నం - భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి
 హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
Photos credit by : ttdphotographer


Wednesday, 18 October 2023

కలెక్టరేట్ ప్రాంగణంలో రెండోరోజు కొనసాగిన బతుకమ్మ సంబరాలు...


ఖమ్మం, అక్టోబర్ 18: బుధవారం నూతన కలెక్టరేట్ లో రెండోరోజు బతుకమ్మ వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ సంబరాల్లో సి విజిల్, ఎన్నికల సంఘం లోగో ముగ్గులు వేసి, స్వీప్ కార్యక్రమం ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం పై నినాదాలు, ప్లే కార్డులు బతుకమ్మల వద్ద ప్రదర్శిస్తూ, ఓటు కు సంబంధించి పాటలు పాడుతూ కలెక్టరేట్ లోని వివిధ శాఖల మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు సి విజిల్ ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి డౌన్లోడ్ చేసుకోవాలని, యువత కు అవగాహన కల్పించి డౌన్లోడ్ చేయించాలని అన్నారు. దేశమంతా పండుగలా వస్తున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. డబ్బు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటు వేయాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టే సామాజిక బాధ్యతను ప్రతిఒక్కరు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 17 October 2023

సిద్ధిపేట..నన్ను ముఖ్యమంత్రిని చేసిన గడ్డ : కేసీఆర్

సిద్దిపేటకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను
నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్, అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావు గారికి గతంలో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

#KCROnceAgain
#VoteForCar

సిరిసిల్ల కార్మికుల బ్రతుకులు మారింది తెలంగాణ వచ్చినంకే : కెసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్ మీ ఎమ్మెల్యే కావ‌డం మీరంతా అదృష్ట‌వంతులు అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల విష‌యంలో నాపై పోరాటం చేసి వారికి కావాల్సిన అవ‌స‌రాలు, మ‌ర‌మ‌గ్గాల‌ను ఆధునీక‌రించేందుకు డ‌బ్బులతో ఇత‌ర స‌దుపాయాలు తీసుకొచ్చారు. సిరిసిల్ల‌లో చేనేత కార్మికుల ప‌రిస్థితి మార్చి.. ఇవాళ చ‌ల్ల‌గా బ‌తికే ప‌రిస్థితి తీసుకొచ్చారు. సోలాపూర్ ఎలా ఉంట‌దో సిరిసిల్ల అలా కావాలి. మీకు ఒక్క మాట హామీ ఇస్తున్నా. మ‌ళ్లీ మ‌న‌మే గెల‌వ‌బోతున్నాం. చేనేత కార్మికుల అవ‌స‌రాలు తీర్చ‌డానికి నేను ప్ర‌భుత్వం మీ వెంట ఉంట‌ది.. అని హామీ ఇస్తున్నానని కేసీఆర్ తెలిపారు.కొంత మంది దుర్మార్గులు ఉంటారని ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి కేసీఆర్ మండిప‌డ్డారు. నీచాతీ నీచంగా, రాజ‌కీయం చేసే చిల్ల‌ర‌గాళ్లు ఉంటారు. చేనేత కార్మికులు బ‌త‌కాలి. మ‌ర‌మ‌గ్గాలు న‌డ‌వాలి. అవ‌న్నీ జ‌ర‌గాలంటే వారికి ప‌ని పుట్టించాలి. ప్ర‌భుత్వ‌మే ఆ బాధ్య‌త తీసుకోవాలి. బ‌తుక‌మ్మ‌, రంజాన్, క్రిస్మ‌స్ వంటి పండుగ‌ల‌కు ప్ర‌భుత్వం ఉచితంగా బ‌ట్ట‌లు అందిస్తోంది. క‌నీసం కోటి కుటుంబాల‌కు నిరుపేద‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల ప‌థ‌కం తీసుకొచ్చాం. ఆ ప‌థ‌కం ద్వారా రూ. 300 కోట్లతో ఇక్కడ ప‌రిశ్ర‌మ‌కు ప‌ని దొరుకుతోంది. పేద‌ల‌కు బ‌ట్ట‌లు అందుతున్నాయి. కానీ కొంత మంది దుర్మార్గులు ఆ చీర‌ల‌ను తీసుకుపోయి కాల‌వెట్టి మాకు ఈ చీర‌లు ఇస్తారా..? ఆ చీర‌లు ఇస్తారా..? అని అంటున్నారు. నిన్ను ఎవ‌రు క‌ట్టుకోమ‌న్నారు.. ఎవ‌రైనా బ‌తిమాలిడారా..? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక్క‌డ ఉరి పెట్టుకుని అప్పుల‌పాలైన చేనేత కార్మికుల క‌న్నీళ్లు తుడిచే గొప్ప మాన‌వ‌తా దృక్ప‌థంతో చేప‌ట్టిన ప‌థ‌కం అది. ఇక్క‌డ ప‌ని చేస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆ ప‌థ‌కం ప్రతిపాదిస్తే.. కేబినెట్ ఆమోదించింది.. చేనేత కార్మికుల‌ను కాపాడుకోవాల‌ని చేసుకున్నాం. కొంద‌రు దుర్మార్గాల మాట‌ల‌ను న‌మ్మొద్దు, వినొద్దు అని కేసీఆర్ సూచించారు. 
నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్ల‌లో క‌నీసం ఓ 170 సార్లు తిరిగాను అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్క‌డ బంధుత్వాలు, ఆత్మీయ‌త‌లు, ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇది. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తుంటే అప్ప‌ర్ మానేరు నుంచి సిరిసిల్ల వ‌ర‌కు ఒక స‌జీవ జ‌ల‌ధార‌గా మారింది. సంతోసంగా ఉంది. నేను చిన్న‌ప్పుడు మోటార్ బైక్ మీద‌, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వ‌స్తే బ్ర‌హ్మాండంగా మానేరులో నీళ్లు క‌నిపించేవి. కానీ స‌మైక్య పాల‌న‌లో దుమ్ములేసే ప‌రిస్థితి వ‌చ్చింది. పోతుగ‌ల్లు గ్రామం పైన గూడూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి మా అక్క‌ను ఇచ్చాం. అక్క‌డ అప్ప‌ర్ మానేరు కాలువ‌లో నేను ఈత కొట్టాను. నా కండ్ల ముందే పోత‌గ‌ల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వ‌చ్చాయి. స‌మైక్య పాల‌కుల దాడి, దోపిడీ పెరిగాక‌.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో అవి మాయ‌మైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు.

స‌మైక్య రాష్ట్రంలో అప్ప‌ర్ మానేరు అడుగంటి పోయింద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్య‌మ స‌భ జ‌రిపిన ప‌రిస్థితిని చూశాం. ప్రాణం పోయినా స‌రే రాష్ట్రం రావాలి. వ‌చ్చిన రాష్ట్రం స‌జీవ జ‌ల‌ధారల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని క‌ల‌లు క‌న్నాం. అప్ప‌ర్ మానేరు ఎండాకాలంలో కూడా మ‌త్త‌డి దుంకుతుంటే సంతోషంగా ఉంది. ఉద్య‌మ సంద‌ర్భంలో జ‌య‌శంక‌ర్ నాతో క‌లిసి తిగిరిగేవారు. ఓరోజు మ‌ధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైద‌రాబాద్ వెళ్తున్నాం. ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాదు.. చావ‌కండి అని రాయించారు. ఆ రాత‌లు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాం. స‌మైక్య రాష్ట్రంలో మ‌న‌కు ఎందుకు ఈ బాధ‌లు అని బాధ‌ప‌డ్డాం. ఇక్క‌డ ఎంపీగా వ‌స్తే ఆద‌రించి గెలిపించారు. ఒక రోజు హైద‌రాబాద్‌లో పేప‌ర్ తిరిగేస్తే ఏడుగురు కార్మికులు చ‌నిపోయారు. ఎంపీగా ఉన్న నేను చ‌లించి, చేనేత పెద్ద‌మ‌న‌షుల‌కు ఫోన్ చేసి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పార్టీ డ‌బ్బుల ద్వారా కొంత ఫండ్ స‌మ‌కూర్చి దండం పెడుతా చ‌నిపోవ‌ద్ద‌ను అని వేడుకున్నాను. కానీ పూర్తి రిజ‌ల్ట్ రాలేదు.. కానీ కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది అని కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ త‌న భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంద‌ని, రైతుల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు తీసుకొస్త‌ద‌ని కేసీఆర్ అన్నారు.

ఇవాళ ఎక్క‌డా చూసినా ప‌చ్చ‌టి పంట పొలాల‌తో ఒక బెత్త‌డి జాగా ఖాళీ లేకుండా వ‌రి నాట్లు క‌న‌డ‌బుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషం. మూడు కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించే నా తెలంగాణ బిడ్డ‌లు.. స‌న్న‌బియ్యం తినాల‌నే ఉద్దేశంతో, వ‌చ్చే ప్ర‌భుత్వంలో స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని మేనిఫెస్టోలో పెట్టుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

అబ‌ద్దాలు, మోస‌పు మాట‌ల‌తో, ఆప‌ద మొక్కులు మొక్కుతూ వ‌చ్చే వారుంటారు.. వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ సూచించారు. కేటీ రామారావు గుణ‌మేందో. గ‌ణ‌మేందో మీకే ఎక్కువ తెలుసు. ఇక్క‌డ రావాల్సిన‌వి వ‌చ్చాయి. గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం. నీళ్లు పుష్క‌లంగా వ‌చ్చాయి. అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి ఏర్ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఆప‌ద మొక్కులు మొక్కే వారు చాలా మంది వ‌స్తుంటారు. ఒక పెద్ద ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. రైతు సోద‌రుల‌ను హెచ్చ‌రిస్తున్నా. మూడు సంవ‌త్స‌రాలు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ధ‌ర‌ణి పోర్ట‌ల్ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోక‌రి ప‌రం కావొద్దు అని ధ‌ర‌ణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేష‌న్లు పావుగంట‌లో అయిపోతున్నాయి. ధ‌ర‌ణి వ‌ల్ల 98 శాతం మంది రైతుల‌కు మేలు జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే ధ‌ర‌ణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తార‌ట‌. మ‌ళ్లీ వీఆర్‌వోలు, గిర్దావ‌ర్‌లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోక‌రికి రాసి, మ‌ళ్లీ రైతుల‌ను కోర్టుల చుట్టు తిప్పే ప‌రిస్థితి వ‌స్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డార‌వ్, డిప్యూటీ త‌హ‌సీల్దార్, త‌హ‌సీల్దార్, ఆర్డీవో, జాయింట్ క‌లెక్ట‌ర్, జిల్లా క‌లెక్ట‌ర్, రెవెన్యూ సెక్ర‌ట‌రీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒక‌రికి కోప‌మొచ్చినా రైతు భూమి ఆగ‌మ‌య్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతుల‌కే అధికారం ఇచ్చాం. మీ బొట‌న వేలి ప్ర‌మేయం లేకుండా.. భూమి ఇత‌రుల‌కు పోయే అవ‌కాశం లేదు. మీ భూమి హ‌క్కులు మీ బొట‌న‌వేలితోనే మారుతాయి. ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ మాట‌లు న‌మ్మ‌కండి.. ఇవాళ ధ‌ర‌ణి పుణ్యం వ‌ల్ల ప‌ల్లెలు ప్ర‌శాంతంగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్న ప్ర‌మాదం వ‌చ్చి నెత్తిన ప‌డుత‌ది. మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్త‌ది.. చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతున్నాను. అనేక రంగాల్లో.. మ‌నం నంబ‌ర్‌వ‌న్‌గా ఉన్నాం అని కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి.. ఎన్నికల మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు జరపండి: కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, అక్టోబర్ 17: నూతన కలెక్టరేట్ లో నిర్వహించబడుచున్న ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో ప్రదర్శించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంసిసి, ఎఫ్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల వివరాలు, సంప్రదించాల్సిన నెంబర్లతో సహా ఉన్న ఫ్లెక్సీలను పరిశీలించారు. సి విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా 72 ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 343 కాల్స్ వచ్చినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారి ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సిసి కెమెరాలు అమర్చినట్లు, అట్టి సిసి కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ *1950, 9063211298* లకు కాల్ చేసి ఫిర్యాదులు, సందేహాలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, రంజిత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
 సాధారణ ఎన్నికలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వివరాలను భారత ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, శాసనసభ సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల నమోదు పై అకౌంటింగ్ బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని, పారదర్శకంగా ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థి ఎన్నికల ఖర్చును గరిష్ట పరిమితి రూ. 40 లక్షలుగా నిర్ధారించిందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజులలో జిల్లాలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలు సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ, ప్రచార ప్రకటనలు, వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలు వాటికి అయ్యే వివరాలను నిషితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఖర్చుకు ఆధారాలు నిర్వహించాలన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థి ఎన్నికల కోసం చేసే ఖర్చులకు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందని, అందులో నుంచి మాత్రమే ఎన్నికల ఖర్చులు చేయాలని, వీటిని పరిశీలించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, వీడియో సర్వేలెన్సు బృందాలు వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మానిటరింగ్ సెల్ కాల్ సెంటర్, స్టాటిటిక్ సర్వేలైన్స్ బృందాలు, వ్యయ మానిటరింగ్ సెల్ మొదలకు బృందాలు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కాల్ సూచించారు. జిల్లాలో ఇక పై ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కరపత్రాలు ఫ్లెక్సీలు బ్యానర్లు ముద్రించే సమయంలో తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ఫ్లెక్సీల పై ఎవరు ముద్రిస్తున్నారో వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ప్రింట్ చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు మద్యం ప్రభావం ఉండకుండా నిరంతరం నిఘా ఉండాలని, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై అధికారులు డేగ కన్నుతో పరిశీలించాలని అన్నారు. ప్రజా ప్రాతినిధ్య 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించే వారిపై  చర్యలు  తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో వ్యయ పరిశీలన, స్వీప్ నోడల్ అధికారులు బృందాలకు తమ విధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారురు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, ఏఇఓ లు, ఆడిట్ అధికారులు, అకౌంట్, విఎస్టి, వివిటి బృంద సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, 16 October 2023

హంస వాహనంపై వీణాపాణిగా శ్రీ మలయప్ప..

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.
హంస వాహనం - బ్రహ్మపద ప్రాప్తి...
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
           కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ‌లు జ‌రుగుతాయి.

ద్వారక మహర్షిని కరుణించిన ద్వారక తిరుమలేశుడు

🙏ద్వారకా తిరుమల( చిన్న తిరుపతి )🙏

🌹ఆలయంలో ఉన్న తెలియని ప్రత్యేకతలు 🌹

మాములు ప్రతి ఆలయంలో విగ్రహ మూర్తికి మూల విరాట్ ( దేవుని విగ్రహం ) ఒక్కటే ఉంటుందండి. కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్ లు ఉండి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు.
అలాగే ఆలయ చరిత్ర మనకు తెలిసిందే ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారు. అయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి వారు ఏ వరం కావాలి అని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాద సేవ చాలు అని చెప్పాడట దానితో  ఆ మహర్షి కోరిక మేరకు స్వామి వారు అక్కడ స్వయంభు గా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాల కలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పై భాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో భక్తులు స్వామి వారిని కొలిచేందుకు కుదిరేదికాదట .. అసలు పాదసేవ ఏ అత్యంత ప్రాధాన్యం అది లేకుండా ఎలా అని  అనుకోగా కొంతకాలానికి  ఋషులు స్వామి వారిని స్వామి నీకు పూజ ఎలా చేయాలని వేడుకోగా మరొక మూర్తిని ( విగ్రహాన్ని ) ప్రతిష్టించి వలసినదిగా స్వామి వారు అన్నారట దీంతో ఋషులు తిరుమల ( పెద్ద తిరుపతి ) నుండి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూ వెలిసిన స్వామి వారి విగ్రహ వెనుక భాగంలో పాద సేవ కోసం ప్రతిష్టించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులు గా స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమల గా ప్రసిద్ధి చెందింది. రెండు మూల విరాట్ లు ఉండటం వలన ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. 
మాములుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా తిరుమలలో స్వామి వారు దక్షిణ ముఖంగా ఉంటారు. అలా ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వలన ఆయనకు ఎదురుగ స్వామి వారు ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మాములుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి వారికీ అభిషేకం చేయరు అది ఎందుకు అంటే స్వామి వారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి ఉందట అందుకే అభిషేకం చేయరు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడిన కొణిజులు ( ఎర్ర చీమలు ) విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. 🙏
సేకరణ

Sunday, 15 October 2023

నగదు, మద్యం రవాణకు చెక్ పెట్టండి : కలెక్టర్ వి.పి.గౌతమ్..బెల్టుషాపు సీజ్


ఖమ్మం, అక్టోబర్ 15: చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఆదివారం రాత్రి సుబ్లేడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంత మంది విధులు నిర్వర్తించుచున్నది, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు. గూడ్స్ వాహనాలను తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. నగదు, మద్యం రవాణా నియంత్రించాలన్నారు. వాహనాల తనిఖీ సంబంధించి రిజిస్టర్ ను నిర్వహించాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీ కి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని ఆయన అన్నారు.
*బెల్ట్ షాప్ ను తనిఖీ చేసి, సీజ్ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్*
    చెక్ పోస్ట్ తనిఖీ అనంతరం కలెక్టర్ ప్రక్కనే ఉన్న బానోత్ మంగీలాల్ షాపుని తనిఖీ చేశారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు గమనించి షాపులో తనిఖీలు చేయగా, అమ్మకానికి ఉంచిన మద్యం సీసాలు కలెక్టర్ గుర్తించారు. షాపు సీజుకు అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే మద్యం షాపులపై చర్యలు చేపట్టాలన్నారు.
    కలెక్టర్ తనిఖీ సందర్భంగా పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి, ఎస్డీసి రాజేశ్వరి, సిఐ జితేందర్ రెడ్డి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ పివి. రామకృష్ణ, ఎన్నికల డిటి రవీందర్, ఆర్ఐ వీరయ్య, అధికారులు తదితరులు ఉన్నారు.

శేషునిపై శేషాద్రి వాసుడు.. పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి క‌టాక్షం. PEDDA SESHA VAHANA SEVA HELD


          శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడుతలల పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
       ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
TIRUMALA The Pedda Sesha Vahana Seva was held with religious fervour in Tirumala on the first day evening of the ongoing Navaratri Brahmotsavams on Sunday.
In Paramapada Vaikunthanatha Alankara, Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi blessed His devotees along the four mada streets.


Monday, 2 October 2023

"బాపు" మీడియకు భద్రత కల్పించండి అంటూ పాత్రికేయుల వేడుకోలు.. ప్రభుత్వాల వైఖరిపై నిరసన గళం...

*మీడియా కమీషన్ కోసం గళం విప్పిన జర్నలిస్టులు*
*మీడియకు భద్రత కల్పించాలని గాంధిజీకి మొరపెట్టుకున్నపాత్రికేయులు*
*టియుడబ్ల్యుజె ఐజెయు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా  నిరసననలు*
ఖమ్మం/అక్టోబర్ 02 : ప్రజా స్వామ్యానికి నాలుగో స్ధంభమైన  మీడియ రంగాన్ని పరిరక్షించాలని ,మీడియాకు భద్రత కల్పించి ,మీడియ కమీషన్ ను వేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) ఆధ్వర్యంలో గాంధి జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి.  జిల్లాలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను చేపట్టి జాతీపిత మహత్మగాంధికి మొరపెట్టుకున్నారు.పలు చోట్ల మహత్మగాంధి తోపాటు ఆర్డీవోలకు,తహసిల్ధార్లకు మెమోరాండం సమర్పించారు.వైరా లో ఎంపి నామ నాగేశ్వర్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో గాంధిచౌక్ లోని మహత్మగాంధి విగ్రహం వద్ద జర్నలిస్టులంతా నిరసన వ్యక్తం చేశారు.ప్లకార్డులను చేతబట్టి సెవ్ జర్నలిజం అంటూ నినాదాలు చేశారు. మీడియాతో పాటు మీడియా లో పనిచేసే వ్యక్తులకోసం భధ్రతా చట్టంను అమలు చేయాలని, విభిన్నమైన రంగాలకు చెందిన  ప్రముఖ వ్యక్తులతో మీడియా కమీషన్ వేయాలని,జర్నలిస్టుల రైల్వే పాస్ లను పున:రుద్దరించాలని,జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని,జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  ఈ సందర్బంగా టియుడబ్ల్యు జె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు మాట్లాడ్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్   జాతీయ కార్యనిర్వాహక కమిటీ  బీహార్ రాజధాని పాట్నాలో తీసుకున్న నిర్ణయం మేరకు  జాతీపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీని 'డిమాండ్స్ డే'గా పాటించాలని దేశవ్యాప్త పిలుపు ఇచ్చారని అందులోభాగంగా  ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.జాతీపిత గాంధిజి కూడా  ప్రముఖ పాత్రికేయుడు సంపాదకుడని నేటి పాలకులు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయనకే మొరపెట్టుకుంటున్నామన్నారు.బిజెపి పాలనలో మీడియాలో కార్పోరేట్ శక్తులు,విదేశి పెట్టుబడులను జోప్పించి మీడియాను తమగుప్పిట్లో పెట్టుకుంటుందని, నిజాలను వెలికితీసిన వారిని అవసరం అయితే హత్య కు కూడా వెనుకడలేదన్నారు.అందుకోసం మీడియా వ్యక్తుల కోసం భద్రతా చట్టం ను తీసుకరావాలని డిమాండ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో  రాజకీయనేతలను తీసుకరావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీనియర్ పాత్రికేయులను,రిటైర్డ్ జడ్జీలతో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాను పరిరక్షించాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రానిక్  డిజిటల్ మీడియాలోకి వెళ్లడానికి భిన్నమైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు కాలగమనంలోఎలక్ట్రానిక్ మీడియా , తరువాత డిజిటల్ మీడియా ప్రవేశంతో మీడియా తీవ్ర మార్పులకు గురైందని    ఈ నేపధ్యంలో మీడియా  కమీషన్ లోకొత్త సంస్కరణలు తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె  ఐజెయురాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
*కాంగ్రెస్ పార్టీ సంఘీభావం*
 జర్నలిస్టులు చేసిన ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. నగర కమిటీ అధ్యక్షులు మమ్మద్ జావేద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు డి సౌజన్య తదితర నాయకులు జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపారు