Friday, 20 October 2023

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ మలయప్ప....


తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
హ‌నుమంత వాహ‌నం - భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి
 హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
Photos credit by : ttdphotographer


No comments:

Post a Comment