ఖమ్మం, అక్టోబర్ 21: పోలీస్ అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పేరడ్ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత, అమర వీరుల స్మృత్యర్థం సాయుధ బలగాలు పెరేడ్, గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. గార్డ్ ఆఫ్ హానర్ పెరేడ్ ఇన్చార్జిగా ఆర్ఐ శ్రీశైలం వ్యవహరించారు.దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధినిర్వహణలో అసువులు బాసిన 189 మంది అమర వీరుల పేర్లను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ కేఆర్ కె. ప్రసాద్ రావు చదివి వినిపించారు. పోలీసు అమర వీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన వారి కుటుంబీకులు, బంధువులు స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించే సమయంలో, తమ వారిని స్మరించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వర్తిస్తున్నారని, తీవ్రవాదం, ఉగ్రవాదం, అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటాల్లో ఎంతో మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తున్నారంటే అనాటి పోలీసు త్యాగాల ఫలితమేనని అన్నారు. నక్సలైట్ ప్రభావితమైన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గతంలో పోలీస్ సిబ్బంది పోలీస్ వాహనాలలో తిరిగే పరిస్థితి వుండేది కాదని, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి తీవ్రవాద కార్యకాలాపాలను అదుపు చేయగలిగారని అన్నారు. అలాంటి సందర్భంలో కూడా పోలీసు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వున్నాయని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలను నిస్పక్షపాతంగా అమలు చేయడంలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్య దేశానికి ఇది కీలకమని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోబం తలెత్తిన తొలి రోజుల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పోలీసు బలగాలు కీలకపాత్ర పోషించారని, లాక్ డౌన్ నిబంధనల అమలులో పోలీసు బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు. రానున్న ఎన్నికలలో సైతం స్వేచ్చ, శాంతియుత వాతావరణంలో నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా వుందని అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ,1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడి పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారని,
అనాటి నుండి దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నామని, వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకిత చేశారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇంటి స్ధలం ఎదురుచూస్తున్న ఖమ్మం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ చొరవతో 22 మంది కుటుంబ సభ్యులకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా
అక్టోబర్ 25, 27 తేదీల్లో సైకిల్ ర్యాలీ, 26వ రక్తదాన శిబిరం, 27వ తేదీన పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు , 28 న ఆన్‌లైన్ ఓపెన్ హౌస్, విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో జిల్లా కలెక్టర్ ,పోలీస్ కమిషనర్లు మాట్లాడారు. ఏదైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పాషా కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ చేయూత ఫండ్ నుండి లక్ష రూపాయల చెక్కు ను కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు గణేష్, హరికృష్ణ, బస్వారెడ్డి, రహెమాన్, ప్రసన్న కుమార్, కృపాకర్, రవి, సారంగపాణి, శివరామయ్య, సాంబరాజు నర్సయ్య , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment