ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్ మీ ఎమ్మెల్యే కావడం మీరంతా అదృష్టవంతులు అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల విషయంలో నాపై పోరాటం చేసి వారికి కావాల్సిన అవసరాలు, మరమగ్గాలను ఆధునీకరించేందుకు డబ్బులతో ఇతర సదుపాయాలు తీసుకొచ్చారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి మార్చి.. ఇవాళ చల్లగా బతికే పరిస్థితి తీసుకొచ్చారు. సోలాపూర్ ఎలా ఉంటదో సిరిసిల్ల అలా కావాలి. మీకు ఒక్క మాట హామీ ఇస్తున్నా. మళ్లీ మనమే గెలవబోతున్నాం. చేనేత కార్మికుల అవసరాలు తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటది.. అని హామీ ఇస్తున్నానని కేసీఆర్ తెలిపారు.కొంత మంది దుర్మార్గులు ఉంటారని ప్రతిపక్షాలను ఉద్దేశించి కేసీఆర్ మండిపడ్డారు. నీచాతీ నీచంగా, రాజకీయం చేసే చిల్లరగాళ్లు ఉంటారు. చేనేత కార్మికులు బతకాలి. మరమగ్గాలు నడవాలి. అవన్నీ జరగాలంటే వారికి పని పుట్టించాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలు అందిస్తోంది. కనీసం కోటి కుటుంబాలకు నిరుపేదలకు బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చాం. ఆ పథకం ద్వారా రూ. 300 కోట్లతో ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతోంది. పేదలకు బట్టలు అందుతున్నాయి. కానీ కొంత మంది దుర్మార్గులు ఆ చీరలను తీసుకుపోయి కాలవెట్టి మాకు ఈ చీరలు ఇస్తారా..? ఆ చీరలు ఇస్తారా..? అని అంటున్నారు. నిన్ను ఎవరు కట్టుకోమన్నారు.. ఎవరైనా బతిమాలిడారా..? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక్కడ ఉరి పెట్టుకుని అప్పులపాలైన చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచే గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. ఇక్కడ పని చేస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆ పథకం ప్రతిపాదిస్తే.. కేబినెట్ ఆమోదించింది.. చేనేత కార్మికులను కాపాడుకోవాలని చేసుకున్నాం. కొందరు దుర్మార్గాల మాటలను నమ్మొద్దు, వినొద్దు అని కేసీఆర్ సూచించారు.
నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం ఓ 170 సార్లు తిరిగాను అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్కడ బంధుత్వాలు, ఆత్మీయతలు, ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇది. హెలికాప్టర్‌లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారింది. సంతోసంగా ఉంది. నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వస్తే బ్రహ్మాండంగా మానేరులో నీళ్లు కనిపించేవి. కానీ సమైక్య పాలనలో దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. పోతుగల్లు గ్రామం పైన గూడూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి మా అక్కను ఇచ్చాం. అక్కడ అప్పర్ మానేరు కాలువలో నేను ఈత కొట్టాను. నా కండ్ల ముందే పోతగల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వచ్చాయి. సమైక్య పాలకుల దాడి, దోపిడీ పెరిగాక.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవి మాయమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో అప్పర్ మానేరు అడుగంటి పోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ జరిపిన పరిస్థితిని చూశాం. ప్రాణం పోయినా సరే రాష్ట్రం రావాలి. వచ్చిన రాష్ట్రం సజీవ జలధారలతో కళకళలాడాలని కలలు కన్నాం. అప్పర్ మానేరు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతుంటే సంతోషంగా ఉంది. ఉద్యమ సందర్భంలో జయశంకర్ నాతో కలిసి తిగిరిగేవారు. ఓరోజు మధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావకండి అని రాయించారు. ఆ రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డాం. ఇక్కడ ఎంపీగా వస్తే ఆదరించి గెలిపించారు. ఒక రోజు హైదరాబాద్‌లో పేపర్ తిరిగేస్తే ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఎంపీగా ఉన్న నేను చలించి, చేనేత పెద్దమనషులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పార్టీ డబ్బుల ద్వారా కొంత ఫండ్ సమకూర్చి దండం పెడుతా చనిపోవద్దను అని వేడుకున్నాను. కానీ పూర్తి రిజల్ట్ రాలేదు.. కానీ కొంత ఉపశమనం లభించింది అని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆర్ అన్నారు.
ఇవాళ ఎక్కడా చూసినా పచ్చటి పంట పొలాలతో ఒక బెత్తడి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనడబుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషం. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నా తెలంగాణ బిడ్డలు.. సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో, వచ్చే ప్రభుత్వంలో సన్నబియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు.
అబద్దాలు, మోసపు మాటలతో, ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చే వారుంటారు.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కేటీ రామారావు గుణమేందో. గణమేందో మీకే ఎక్కువ తెలుసు. ఇక్కడ రావాల్సినవి వచ్చాయి. గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం. నీళ్లు పుష్కలంగా వచ్చాయి. అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆపద మొక్కులు మొక్కే వారు చాలా మంది వస్తుంటారు. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. మూడు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోకరి పరం కావొద్దు అని ధరణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్లు పావుగంటలో అయిపోతున్నాయి. ధరణి వల్ల 98 శాతం మంది రైతులకు మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తారట. మళ్లీ వీఆర్‌వోలు, గిర్దావర్‌లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోకరికి రాసి, మళ్లీ రైతులను కోర్టుల చుట్టు తిప్పే పరిస్థితి వస్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డారవ్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒకరికి కోపమొచ్చినా రైతు భూమి ఆగమయ్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతులకే అధికారం ఇచ్చాం. మీ బొటన వేలి ప్రమేయం లేకుండా.. భూమి ఇతరులకు పోయే అవకాశం లేదు. మీ భూమి హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి. ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ మాటలు నమ్మకండి.. ఇవాళ ధరణి పుణ్యం వల్ల పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదం వచ్చి నెత్తిన పడుతది. మళ్లీ కథ మొదటికి వస్తది.. చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అనేక రంగాల్లో.. మనం నంబర్‌వన్‌గా ఉన్నాం అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
No comments:
Post a Comment