ఈరోజు నా కళ్ళు ఒక అద్భుతాన్ని చూశాయి..
నాలుక ఒక అమోఘమైన రుచిని ఆస్వాదించాయి..
మనసు ఒక జీవితానికి కావాల్సిన ధైర్యాన్ని నింపుకుంది..
కారణం ఒక బామ్మ...
ఐరన్ యార్డ్ లో ఒక క్లయింట్ను కలిసి స్వాతి రోడ్ లోని వైఎస్సార్ బొమ్మ పక్క సందులో నుండీ వెళ్తున్నా.. అప్పటికే చాలా ఆకలి.. వాటర్ కానీ సింగిల్ టీ కూడా ఆఫర్ చెయ్యకుండా కోట్ల వ్యాపారం డీల్ చేయించుకుందాము అనే లోకం బాగా అనుభవమే.. అలాంటి వాళ్ళని పచ్చి మంచి నీళ్ళు కూడా అడగను.. ఆఫ్కొర్స్.. నేను ఏమీ ఆశించను.. జస్ట్ మనుషుల గురించి చెప్తున్నాను అంతే...
అదే ఆకలితో ఆ రోడ్ లో వెళుతూ ఉంటే చిన్న వెలుగులో ఒక టిఫిన్ బండి.. ఎందుకో అప్రయత్నంగా నా బండి ఆగింది..
కారణం ఆ బండి దగ్గర ఉన్న బామ్మ.. చూడగానే అర్థం అవుతుంది ఆమె చాలా పెద్ద వయసు అని... బండి పక్కన పార్క్ చేసి ఏమున్నాయి బామ్మ అని అడిగాను.. బదులుగా బామ్మ " నువ్వు ఏమి తింటావో చెప్పు ?? వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి, బొబ్బట్లు,హల్వా పూరి, పునుగులు, వేడి వేడి బజ్జీ ఉన్నాయి.." అని అంటూనే సరే ఒక పని చెయ్యి ఒక్కోటి పెడతాను తినగలిగినన్ని తిను అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా అన్నీ ఒక కాగితంలో పెడుతూ అద్భుతమైన చట్నీ, అమోఘమైన అల్లం చట్నీతో (ఈ మధ్య ఎక్కడా ఇంత చక్కని అల్లం చట్నీ తినలేదు) కొసరి కొసరి వడ్డిస్తూ.. ఈ వయసులో తినకపోతే ఎలా డైటింగ్ గీటింగ్ వేస్ట్ అంటూ ప్రేమగా మాట్లాడుతుంటే..
అప్రయత్నంగా మీ వయసు ఎంత బామ్మా అని అడిగాను.. ఒక సెకండ్ పాస్ ఇచ్చి ఎంత ఉంటుంది అని ఎదురు ప్రశ్న వేసింది.. చూస్తానికి ఒకప్పుడు బాగా బ్రతికి చితికిన జీవితం అని ఆమె రాయల్టీ చూస్తే అర్ధం అవుతునే ఉన్నది.. ఎస్టిమేట్ చెయ్యలేక పోయే సరికి ఆమే చెప్పింది డెబ్బయ్ కి ఒక సంవత్సరం తక్కువ అని.. కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.. ఈలోపు ఆమెకి సరుకు సప్లై చేసే మనిషి వచ్చాడు... మా డిస్కషన్ విని ఒకటే చెప్పాడు.. ఏమండీ నేను ఎన్నో సంవత్సరాల నుండీ ఆమెను చూస్తున్నాను.. ఒకరికి పెట్టడమే కానీ తీసుకోవడం తెలీదు.. రేపటికి రూపాయి అప్పు పెట్టదు.. ఒకరి డబ్బు ఆశించదు.. పైగా పెట్టే గుణం.. అనగానే.. బామ్మ మాట అందుకుంది.. " ఈవయసులో అణ పైసా రుణం నాకు ఉండకూడదు.. ఋణ గ్రస్తురాలిగా చనిపోకూడదు.. ఈ ప్రాణం ఉన్నన్ని నాళ్లు కష్టపడి సంపాదించాలి.. కష్టపడి బ్రతకాలి.." కళ్ళు ఆశ్చర్యంతో కూడి చెమర్చాయి.. ఆ సంకల్పానికి, నమ్మకానికి, వ్యక్తిత్వానికి..
మరి ఒక్క దానివే ఇన్ని పదార్థాలు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే సమాధానం " నేనూ నా కూతురు ఉంటాము అయ్యా.. తను ఇప్పుడే ఇంటికి వెళ్ళింది.. ఆమె పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి బందర్ లో సెటిల్ అయ్యారు.. జగన్ అన్న కి ఇల్లు అర్జీ పెట్టుకున్నాము.. వస్తుంది ఏమో అని ఒక ఆశ..
ఇంక మీకు ఎవరూ లేరా బామ్మా అని అడిగితే " ఎందుకు లేరయ్యా!! నా భర్త కి ఏడుగురు అన్నా తమ్ములు నలుగురు అక్కా చెల్లెళ్ళు.. పెద్ద బలగం.. ఒకప్పుడు వస్త్రలత లో నాలుగు ఐదు షాపులు ఉండేవి... లాటరీ తికెట్లకి అలవాటు పడి.. జీవితంలో తొందరగా కోట్లు సంపాదించాలి అన్న ఆశతో ఆస్థి అంతా పోగొట్టారు నా భర్త.. నా చేతిలో శక్తి విద్య ఉంది.. కష్టపడుతున్నాము.. ఎవరైనా ఆర్ధర్స్ ఉంటే పాతిక ముప్పై మందికి వండి పంపగలము అని చెప్తూ రోజుకి శక్తి కొలది ఒక వంద రూపాయిలు తగ్గకుండా బేంక్ లో దాచుకో అయ్యా ఆఖరికి అవ్వే నీకు పనికి వస్తాయి అని జీవిత కష్ట సారాంశాన్ని చెప్పింది బామ్మ..
చేతిలో ఒక వంద పెడితే వద్దు అంటూ తిన్న దానికి మాత్రమే డబ్బులు తీసుకుంది...
ఎన్ని మేనేజ్మెంట్ డిగ్రీలు పీహెచ్డీలు ఉంటే ఇంత గొప్ప వ్యక్తిగతం, కష్టం, క్వాలిటీ మేనేజ్ మెంట్, దార్సినికత అబ్బుతాయి ??
జీవితంలో ఏమీ సాధించని వాళ్ళని, పిల్ల కాలువలో కూడా ఈదని వాళ్ళని, ఎటువంటి ఆటు పోట్ల అనుభవం లేని వాళ్ళని ఏసీ హాల్స్ లో, ఇంపాక్ట్ క్లాసెస్ లో, ఎంబీఏ కాలేజీల్లో, టెడ్ టాక్స్ లో ఊర సొల్లు చిలక పలుకులు చెప్పిస్తారు లక్షలు కోట్లు ఇచ్చి... ఇటువంటి నిజమైన వ్యక్తిత్వం, నిజమైన ఆటుపోట్లు, సక్సెస్ అన్నీ చూసిన వారితో చెప్పించరు.. అఫ్కోర్స్ మనకి అంత టైం లేదు.. అన్నీ ఫెబ్రికేట్డ్ జీవితాలు... ఫెబ్రికేటెడ్ సక్సెస్ లు..
వీలైతే ఆ అద్భుతాన్ని వెళ్ళి పలకరించండి, వెళ్ళి ఆ రుచులను ఆస్వాదించండి... నలుగురితో ఈ విషయాన్ని పంచండి.. కుదిరితే ఎప్పుడైనా వెజిటేరియన్ ఫుడ్ ఒక పాతిక ముప్పై మందికి ఆర్డర్ ఇవ్వండి..
ఫుడ్ వ్లాగర్స్ ఫ్రీ తిండి కోసం, నాలుగు డబ్బుల కోసం, ఆల్రెడీ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళని ఎటువంటి క్వాలిటీ లేకపోయినా అద్భుతం అమోఘం అంటూ గాలికి ఎత్తేసి మనల్ని పిచ్చి తిండికి పురమాయిస్తున్నారు.. రోడ్లు బ్లాక్ చేయించి మరీ ఇంకా కోటీశ్వరులను చేస్తున్నారు.. ఇలాంటి బక్క జీవితాలు, నిజమైన అద్భుతాలను ఎవరూ పట్టించుకోరు.. కనీసం మనమైనా సపోర్ట్ చేద్దాం..
ఇంతకీ బామ్మ పేరు ఏమిటీ అని అడగగా " తిరువీధుల కుసుమ కుమారి అని చెప్పారు.. ఎంతో గర్వంగా హుందాగా రాయల్ గా.. హాట్స్ ఆఫ్ బామ్మ.. ఒక జీవితానికి సరిపడా మనోధైర్యాన్ని ఇచ్చావు... ఆమె నాకు ఇచ్చిన రెండో సలహా.." ఏమైనా ధైర్యాన్ని కోల్పోవద్దు అని.."
ఎక్కడో దూరంలో ఉన్న గుడి నుండీ"తిరువీధుల వెలసీ ఈ దేవ దేవుడు.. " అన్న పాట వినపడుతుంటే జేబుల్లో చేతులు పెట్టుకోకుండా బండి ఉన్నది అన్న స్పృహ కూడా మర్చిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను...
బామ్మ ఫోన్ నంబర్ : 7075803856
అడ్రస్ : వైఎస్సార్ విగ్రహం ప్రక్క సందు నుండీ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ కు వెళ్ళే దారిలో ,
భవానీ పురం,
విజయవాడ.
- మీ మోహన్ వంశీ ధర్ బచ్చు.
No comments:
Post a Comment