Saturday, 3 February 2024

పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ : మంత్రి సీతక్క ...


ఖమ్మం : రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుండి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తో కలిసి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారుల పాలన ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పారిశుధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో నూతన పంచాయితీరాజ్‌ చట్టం, గ్రామ పంచాయి విధి నిర్వహణ విధానాలు వంటి అంశాలపై ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పిస్తూ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.  రాబోయే వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.  గ్రామంలో త్రాగునీటి కనెక్షన్లపై సర్వేనిర్వహించి, ఇంకా నల్లా కనెక్షన్‌ లేని ఇండ్లు గుర్తించాలన్నారు.  త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్ధిక సంఘం నిధులను వినియోగంచుకునే అవకాశం ఉందని, అవసరమైన చోట నీటి లీకేజీ మర్మత్తు పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  గ్రామంలో అంతర్గత నీటి సరఫరా, నూతన నల్ల కనెక్షన్‌ పనుల ప్రాతిపాదనలు రూపొందించి జల్‌ జీవన్‌ మిషిన్‌ ద్వారా నిధులు పొందాలని తెలిపారు.  
నూతన కలెక్టరేట్‌ స్పూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌   మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినందున జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 2వ తేదీ నుండి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేసే విధంగా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వేసవిలో త్రాగునీటికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విధంగా గ్రామీణ మంచినీటి సరఫరా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కుటుంబానికి మిషన్‌ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.  గ్రామపంచాయతీలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ కూలీల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, డంపింగ్‌ యార్డుల నిర్వహణ, వైకుంఠధామాల అభివృద్ధిపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.  జిల్లాలో ఈనెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, జిల్లా పంచాయితీ అధికారి హరికిషన్‌, ఎస్‌ఈ పి.ఆర్‌ చంధ్రమౌళిశ్వరరావు, ఏ.పి.డి శిరీష, మిషన్‌ భగీరథ ఇ.ఇ పుష్పలత, వివిధ శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
------------------------------------------------------------------------
యువత అవకాశాలు ఎక్కడ ఉంటే, అక్కడకి వెళ్ళాలి : కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం :  స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, మెగా జాబ్ మేళాకు వచ్చినవారు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  హైదరాబాద్, వరంగల్ తో పాటు  వివిధ ప్రాంతాలకు చెందిన 65 పైగా కంపెనీలు, 5000 పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 45 వేల నుండి 50 వేల వేతనం గల ఉద్యోగాలు 500 ఉండగా, 25 వేల నుండి 45 వేల మధ్యలో 3 వేలకు పైగా ఉద్యోగాలున్నట్లు ఆయన అన్నారు. ఒక ఫ్రెషర్ కి ఆఫ్ క్యాంపస్ ద్వారా ఇది మంచి అవకాశమని అన్నారు. ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని, వచ్చిన ఏ చిన్న అవకాశమైనా విడిచి పెట్టక, ఒక్కో మెట్టు ఎదుగుతూ, లక్ష్యం చేరాలన్నారు. ప్రతి ఉద్యోగం ఒక పాఠం వంటిదని, ప్రతి ఉద్యోగం లో ఎంతో నేర్చుకోవచని, నైపుణ్యం, అనుభవం పొంది కెరీర్ పరంగా ఎడగాలన్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగకల్పన చేయనుందని, ఇప్పుడు పొందే ఉద్యోగాలతో ఉపాధి పొందుతూ, మన కాళ్ళ మీద మనం నిలబడి, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలన్నారు. యువత, విద్యార్థులు అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలను పొందాలన్నారు. ఉద్యోగావకాశం ఎక్కడ వచ్చిన చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా అభ్యర్థుల ఇంటర్వ్యూలు సాఫీగా సాగేవిధంగా నిర్వహిచాలని జాబ్ మేళా చేపట్టిన కంపెనీ ప్రతినిధులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా లో ఆర్డర్ పొందిన ఇద్దరికి ఆఫర్ లేటర్లను అందజేశారు. ఇట్టి జాబ్ మేళా కు జిల్లాలో 11530 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వివిధ కంపెనీలకు 1122 మంది యువత ఎంపిక కాగా, 2698 మంది యువత షార్ట్ లిస్టెడ్ అయినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు వివిధ కంపెనీల ప్రతినిధులు  ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఆఫర్ లెటర్స్ అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగార్థులకు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, జగన్నాధం, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment