Tuesday, 2 April 2024

*పోలింగ్ 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలి* : కలెక్టర్ వి పి గౌతమ్


ఖమ్మం, ఏప్రిల్ 2: పోలింగ్ రోజున చేయవలసిన విధులు, బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తి అవగాహన కలగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి సెగ్మెంట్ ల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో ఖమ్మం, వైరా నియోజకవర్గ పీవో, ఏపీవో లకు శిక్షణా కార్యక్రమ ఏర్పాట్లు చేశారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల, ఇవిఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసి ఓటింగ్, పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్  పోలింగ్ జరపాలని, మాక్ పోలింగులో 50 కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని,  రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని, అనంతరం అసలైన పోలింగుకు సన్నద్ధం కావాలని సూచించారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు.  హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని, హ్యాండ్ బుక్ లో సూచించిన విధంగా మొత్తం పోలింగ్ సామాగ్రిని సేకరించుకోవాలని, ఫారములు, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ కవర్స్, మెటీరియల్స్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానంపై, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై,  పోల్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్ పై అవగాహన పొందాలని, ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని,  బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలని, ఓటర్లకు అవసరమైన సహాయం అందించడానికి బూత్ లెవల్  ఆఫీసర్ల ద్వారా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని  సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఫారం-12ఏ, ఫారం-12 ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోస్టల్ బ్యాలెట్ లు పొంది, ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్, సి-విజిల్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏవేని పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని, ఎన్నికల నిర్వహణ వంద శాతం విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. శిక్షణా కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ఇవిఎం యంత్రాలతో హాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, డిఎఫ్ఓ
 సిద్ధార్థ విక్రం సింగ్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, మదన్ గోపాల్ తహశీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment