Wednesday, 6 November 2024

*అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీకి చర్యలు.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం : ఇందిరా మహిళా డైరీ ఏర్పాటులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పాడి పశువులను సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ మహిళా డెయిరీ చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* చిల్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసే  స్థలం వెంటనే స్వాధీనంలోకి తీసుకొని ప్రహరీ గోడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముదిగొండ మండల పరిధిలో చిల్లింగ్ యూనిట్ సంబంధించి 5 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాల సేకరణ కేంద్రానికి కనీసం 10 మంది పాడి రైతులను ట్యాగ్ చేయాలని అన్నారు. పాడి పశువులను పంపిణీ చేసేందుకు మహిళా సంఘాల సభ్యులలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  పాడి పశువుల అంశంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించాలని, ప్రస్తుతం ఒకటి, రెండు పశువులు ఉన్న వారికి మరో రెండు పాడి పశువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల పంపిణీ కోసం లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వారికి సంబంధిత కార్పొరేషన్ల (ఎస్సీ, బీసీ, ఎస్టీ) ద్వారా రుణం మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం ముదిగొండ మండలంలో ఉన్న గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, ఎంతమంది పాఠకులు ప్రతి రోజు గ్రంథాలయానికి వస్తున్నారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు హాజరవుతున్నారా, వారికి స్టడీ మెటీరియల్ అందించారా మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలో పుస్తకాల రిజిస్టర్, పుస్తకాల లెండింగ్ రిజిష్టర్లను కలెక్టర్ పరిశీలించారు. 

గ్రంథాలయాన్ని ప్రతి రోజు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని నిర్వహణ బాధ్యతలలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయాలని, ముదిగొండలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఈ లైబ్రరీ వినియోగించుకునేలా చూడాలని, గ్రంథాలయం మరమ్మత్తుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిటీడబ్ల్యూఓ విజయలక్ష్మీ, ముదిగొండ మండల ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ సునీత ఎలిజబెత్, లైబ్రేరియన్ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------

*ఇందిరా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాలు, క్రొత్త యూనిట్లు ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం :మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ఇందిరా మహిళా డెయిరీలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, క్రొత్త యూనిట్ ల ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*  ఇందిరా మహిళా డెయిరీలో కల్పించాల్సిన మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలని అన్నారు.  మండలంలో ఏ గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ముందుగా నిర్థారించాలని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటూ, అందుబాటులో ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలలో ముందుగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

పాల సేకరణ కేంద్రాలకు అవసరమైన కియాస్కులు ఏపిఎం ల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ అవసరమైన మిల్క్ గ్రేడర్, సెగ్రిగేటర్, క్యాన్ లు, రిఫ్రాక్టోమీటర్ మొదలగు పరికరాలను ఏపిఏం సేకరించి పాల సేకరణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పాల సేకరణ కేంద్రాల నుంచి మండల కేంద్రంలోని బి.ఎం.సి. పాయింట్ వద్దకు పాలు తరలించే రూట్స్, వాహనాల క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. 

మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయు బి.ఎం.సి. పాయింట్ లకు గ్రామాల నుంచి ఇక్కడికి పాలు తరలించేలా రూట్ ర్యాషనలైజేషన్ చేయాలని అన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఎర్రుపాలెం మాదిరి బి.ఎం.సి. యూనిట్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ద్వారా 5000 లీటర్ల పాల చిల్లింగ్, స్టోరెజ్ యూనిట్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రతి బి.ఎం.సి. కేంద్రం యూనిట్ కంటేనర్ తో సహా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

నియోజకవర్గ మండలాల్లో బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు స్థలాల గుర్తింపు పూర్తయిందని, ముందుగా ప్రహరీ గోడ, గేట్ నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఈ పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని అన్నారు.  కాంపౌండ్ వాల్ అనంతరం కంటేనర్ మాడల్ లో బి.ఎం.సి. కేంద్రాల ఏర్పాటుకు టేండర్ ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. 

బి.ఎం.సి. కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని, 4 మండలాలలో ఎర్రుపాలెం మాదిరిగానే విద్యుత్ సరఫరా పనులు చేపట్టాలని కలెక్టర్ ఎస్ఈ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 

రాబోయే సమావేశం నాటికి బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు గుర్తించిన భూములలో కాంపౌండ్ వాల్, గేట్ నిర్మాణం, బి.ఎం.సి. యూనిట్ టెండర్ ప్రక్రియ, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాల ఉత్పత్తి పెంచేందుకు డిసెంబర్ నెలలోపు 500 గేదెలు కొనుగోలు చేసి 250 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాల ఉత్పత్తి చేసే పాడి కుటుంబాలను గుర్తించి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వారీగా  పాడి పశువుల యూనిట్ గ్రౌండ్ చేయాలని, మండలానికి 50 యూనిట్లు డిసెంబర్ నాటికి గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం తక్కువ పశువులు ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నవంబర్ 15 నాటికి పాడి పశువులు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించి వారి జాబితా అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల యూనిట్ల సంబంధిత లబ్ధిదారుల కులాల కార్పొరేషన్ (ఎస్సి,బీసి, ఎస్టీ) కార్పొరేషన్ ద్వారా గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ చేశాక పాలు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందని, మన దగ్గర పాలు పోసే పాడి రైతులకు అందుబాటులో ఉన్న రివాల్వింగ్ ఫండ్ నుంచి 48 గంటల వ్యవధి లోగా చెల్లింపు చేస్తున్నామని అన్నారు.  

జిల్లాలో కనీసం 90 శాతం స్వశక్తి మహిళా సంఘాలకు ఏ+ బి  గ్రేడింగ్  ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ముదిగొండ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ పెరిగిందని, ఇదే పనితీరు కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. తల్లాడ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ తగ్గడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. తల్లాడ మండల పరిధిలో విఓఏ సమావేశాలు రెగ్యులర్గా ఎందుకు జరగడం లేదు కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మహిళా శక్తి కార్యక్రమ అమలు కోసం నిరంతరం స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.  రాబోయే రెండు నెలల తర్వాత నిర్వహించే సమావేశంలో సైతం పని తీరు మెరుగు కానీ పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని , పనిచేయడం ఇష్టం లేని పక్షంలో ఖమ్మం జిల్లా వదిలి ఇతర జిల్లాలకు బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని కలెక్టర్ సూచించారు.కూసుమంచి మండలంలో 300 పైగా గ్రూపులకు గ్రేడింగ్ జరగక పోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.  మహిళా సంఘాల గ్రూపులకు గ్రేడింగ్ వచ్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. 
ముదిగొండ, వైరా, రఘునాధపాలెం, మొదలగు మండలాలలో గ్రేడింగ్ పెరిగిందని సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత పెరిగేలా పని చేయాలని  సూచించారు. మహిళా సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా నిర్వహిస్తూ వారి  జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.
మహిళా శక్తి కింద గ్రౌండ్ చేసిన యూనిట్లు లాభసాటిగా నడిచేలా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు అందించాలని అన్నారు.  మహిళా శక్తి యూనిట్లలో బాగా నడవని వివరాలను సీసీ ల ద్వారా సేకరించి వాటిని పరిశీలిస్తూ ఎందుకు నడవడం లేదు పరిశీలించి వాటి పని తీరు మెరుగయ్యేలా చూడాలని అన్నారు. 
మధిర, చింతకాని మండలాలు మహిళా శక్తి యూనిట్ గ్రౌండింగ్ బాగా చేశాయని కలెక్టర్ అభినందించారు. మహిళా శక్తి యూనిట్ ల గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు, ఎటువంటి యూనిట్ల గ్రౌండింగ్ కాలేదు కలెక్టర్ ఆరా తీశారు.  సీసీలను ఎప్పటి కప్పుడు ఫాలో అప్ చేస్తూ , బ్యాంకర్లతో సంబంధం చేసుకుంటూ త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే సమావేశం నాటికి కనీసం 70 శాతం వరకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. 
ఐకేపి ద్వారా సన్న రకం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. స్థానిక రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతు ఎన్ని ఎకరాలలో పంట పండించాడొ అంత పంట మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్డీఏ డిపిఎంలు, ఏపీఎం లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment