Tuesday, 29 April 2025

ఎందుకు వచ్చావు అమ్మ సమస్య ఏమిటి : మంత్రి పొంగులేటి....


 వరంగల్ నగరంలోని  నాని గార్డెన్స్ లో భూభారతి చట్టం-2025 అవగాహన  కార్యక్రమంలో పాల్గొనడానికి  వేదిక వద్దకు చేరుకున్న  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఒక వృద్ధురాలు కాగితం చేతిలో పట్టుకొని దీన స్థితి లో ఏదో అవసరం కోసం వేచి చూస్తున్నట్లుగా  ఉండడాన్ని గమనించిన మంత్రి స్వయంగా వేదిక పై నుండి నిలబడి ఆ వృద్ధురాలిని వేదిక మీదకు ఆప్యాయం గా పిలిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా.. అని సమస్యను గురించి ఆరా తీయగా..  ఆ వృద్ధురాలు బదులిస్తూ తన పేరు వేల్పుల ఊర్మిళ అని 41 వ డివిజన్ శంభునిపేటలో తన నివాసమని, తన మనవరాలు వేల్పుల లిటి ఇటీవల 4 వ తరగతి పూర్తి చేసుకుని సెయింట్ గాబ్రియల్ పాఠశాలలో 5 వ తరగతి లో ప్రవేశానికి పరీక్ష రాసి  సీటు సాధించడం జరిగిందని, కానీ లిటి తల్లిదండ్రులు మనస్పర్ధల వల్ల  వేరు  గా ఉంటున్నారనీ, తన మనవరాలికి  సీటు దక్కినప్పటికిని  చదివించే స్తోమత తనకు లేదని మంత్రి వద్ద వాపోగా, వెంటనే స్పందించిన మంత్రి పొంగురేటి శ్రీనివాసరెడ్డి బాలిక చదువు కోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తానని అక్కడికక్కడే ప్రకటించారు. దీంతో మనవరాలి చదువు సమస్య తీరడంతో వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది.
**********************************************

*ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య,  డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు*

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు 

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరిన ప్రతినిధులు 

వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపిన ప్రతినిధులు 

ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్న ప్రతినిధులు

ఆపరేషన్ కగారు నివారణకు కృషి చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు

*సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క*

*మంత్రి సీతక్క*

ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలిబల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నాను. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు
ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను
ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారుమావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలిరెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి

Sunday, 13 April 2025

*కనుమరుగవుతున్న మానవ సంబంధాలపై కలం దూసిన చిన్నారి..* మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య*

*🔊మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య*

*🔶నాలుగోతరగతి ప్రశ్నపత్రంలో ఓ విద్యార్థిని ఆసక్తికర సమాధానం*

 *🔷కనుమరుగవుతున్న మానవ సంబంధాలు*

*🍥చందుర్తి, ఏప్రిల్ 12 : 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు' అనే ఓ పాటకు సరిగ్గా సరిపోయేలా నాలుగో తరగతి చిన్నారి తనకు వచ్చిన ప్రశ్నకు రాసిన జవాబును చూస్తే అర్థమవుతున్నది. రాజన్న సిరి సిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఆంగ్ల ప్రశ్నపత్రంలో అమ్మకు నచ్చేవి...నచ్చని వాటి గురించి ఓ ప్రశ్న అడిగారు. దీనికి సదరు చిన్నారి 'అమ్మకు నచ్చనిది నానమ్మ తాతయ్య' అని ఆంగ్లంలో రాయడం పేపర్ దిద్దిన ఉపాధ్యాయుడు సైతం ఆశ్చర్యానికి లోనుకావాల్సి వచ్చింది. నేటి సమాజానికి వృద్ధా ప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు భారంగా మారారని, వారి పట్ల ప్రేమ ఎలా ఉన్నదో సదరు విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుంది. మానవ సంబంధాలు, బంధాలు తెగిపోయాయని తెలిపేందుకు ఈ జవాబే చక్కని ఉదాహరణ అని సదరు ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు.*

*వనజీవి రామయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ..*


*పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యావరణహితం కోరుతూ మొక్కలు నాటిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని అన్నారు.* ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో పోస్టు చేశారు.'లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారు.ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్ తరాలపట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి.ఆయన చేసిన కృషి యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.ఓం శాంతి'అంటూ రాసుకొచ్చారు.

Saturday, 12 April 2025

ప్రకృతి పచ్చదనం కోసం పరితపించిన రామయ్య ఇకలేరు...

ప్రకృతి కన్నీరు పెట్టుకుంది 
కంటిపాపల చూసే రామయ్య తమలో కలిసిపోయాడని తెలిసి ప్రకృతి కన్నీరు పెట్టుకుంది.. మొక్కల పెంపకంలో అలసట ఎరుగక
ఎండనక వాననక.. అణువణువు పచ్చదనం నింపేందుకు పరితపించిన వనజీవి రామయ్య ఇకలేడు..
ఆకుల రెపరెపలే తన శ్వాసగా జీవించి కోటి మొక్కలకు ఊపిరి పోసిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపం 

మణికుమార్ కొమ్మమూరు 
సీనియర్ జర్నలిస్ట్,  ఖమ్మం

వనజీవి పద్మశ్రీ రామయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో దరిపెల్లి రామయ్య ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం
చిన్ననాటి నుండి మొక్కల పెంపకం పై దృష్టి సారించిన రామయ్య స్వచ్ఛందంగా కోటికి పైగా మొక్కలను నాటి పర్యావరణం పై ప్రజలు అవగాహన కల్పించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ప్రకృతి పట్ల ఆయన బాధ్యతకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిందివనజీవి రామయ్య మృతి పట్ల ప్రకృతి ప్రేమికులు.. పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

Wednesday, 9 April 2025

విద్యతోనే అస్తిత్వం : జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్



ఖమ్మం : విద్య తోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపుతో పాటు మనకు అస్తిత్వం లభిస్తుందని, భవిష్యత్తులో బంగారు బాటకు చదువు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  అన్నారు.బుధవారం డా. బీఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.వార్షికోత్సవ వేడుకల్లో బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. విద్యార్ధినిలు ప్రదర్శించిన ప్రదర్శనలు కలెక్టర్ తో పాటు, ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* ప్రస్తుతం మనకు అందుతున్న అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ బాలికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ప్రణాళికా బద్ధంగా శ్రమించాలని, మనం ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఉన్న సదుపాయాలు, విద్యను వినియోగించి గొప్ప విజయాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. 
బాలికలు చిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద కలలు కనాలని, విద్యార్థినులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
 జీవితంలో మనం గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత సమాజంలో నలుగురికి సహాయం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని అన్నారు. 
మన స్నేహితులలో ఎవరైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే సహాయం అందించాలని,  ఇతరులతో కలిసి ఎదిగే ఆలోచన పెట్టుకోవాలని అన్నారు. ప్రతిరోజు మనకు అనేక ఆటంకాలు వస్తాయని, వాటిని ఎలా దాటుతామనే అంశంలో విజేత ఉంటారని కలెక్టర్ తెలిపారు‌.
 ఈ కార్యక్రమంలో  గురుకులాల బాధ్యులు రాజలక్ష్మి , స్వరూప రాణి, ఎన్నారై పౌండేషన్ భాధ్యులు రామకృష్ణ, బాబు బాయన్న, కట్టా సాగర్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధైర్యం, పట్టుదలతోనే సివిల్స్ వంటి పరీక్షలను నెగ్గగలం : జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.


ఖమ్మం :  మార్పు మనతోనే సాధ్యం కావాలని సర్వీసెస్ ద్వారా మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే అవకాశం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీస్ వంటి ఉన్నతమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మన లక్ష్యాలు, ఆదర్శాలు, ఎవరి కోసం పనిచేయాలని ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వంటి అంశాలను మర్చిపోవద్దని తెలిపారు.మనం ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు  ఇతరులు ఎదుర్కోకుండా సమాజంలో పది మందికి సహాయం చేసే అవకాశం పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు అందుతుందని, ఏ రంగంలో లేని సంతృప్తి ఇక్కడ మనకు దొరుకుతుందని అన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మన మేధాశక్తి కన్నా పట్టుదల, ధైర్యం చాలా అవసరమని, ఒకసారి విఫలమైనప్పటికీ ధైర్యంగా మరోసారి ప్రయత్నించాలని కలెక్టర్ తెలిపారు. మన సొంత కారణాలు మాత్రమే మనం విఫలమైనప్పుడు మరోసారి  ప్రయత్నించేందుకు అవసరమైన ధైర్యం అందిస్థాయి అని అన్నారు. సమాజంలో మనం కోరుకున్న మార్పు మనతో సాధ్యం అవుతుందని అన్నారు.  దేశానికి స్వాతంత్య్రం కూడా పోరాడిన తర్వాత మాత్రమే సాధ్యమైందని అన్నారు. మనకు కావాల్సిన మార్పు చేతలతోనే సాధ్యమవుతుందని, మాటలతో సాధ్యం కాదని అన్నారు. మార్పు తీసుకుని వచ్చేందుకు సివిల్ సర్వీసెస్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.సివిల్స్ సర్వీస్ లో పోస్టింగ్ వచ్చిన తర్వాత 10 మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తేనే మన జీవితానికి  ఒక సంతృప్తి లభిస్తుందని అన్నారు. 35 సంవత్సరాల పాటు మనకు జీవితంలో పని చేసే అవకాశం లభిస్తుందని, దీనిని బాగా వినియోగిస్తే మనం ఆశించిన లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.యవ్వనంలో ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వృధా చేసుకోవద్దని కలెక్టర్ తెలిపారు. దేశానికి ధైర్యం, నిజాయితీ గల అధికారులు అవసరమని, ఇక్కడ విద్యార్థులంతా దేశానికి గొప్ప సేవలు చేసే అధికారులుగా పని చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.అనంతరం గ్రూప్ 1 పోటీ పరీక్షలో ర్యాంకర్లకు మెమంటోలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వి. అభిరామ్, డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు, యువత, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 3 April 2025

భవిష్యత్ తరాల భూమి పరిరక్షణ అందరి బాధ్యత : నెల్లూరి కోటేశ్వరరావు

పచ్చని భూములను కొల్లగొట్టొద్దు.
- భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ.
- ఖమ్మంలో బీజేవైఎం నిరసన సెగ.
- ప్రకృతి సంరక్షణ కోసం పోరాటం ఉధృతం.
- భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.

ఖమ్మం , ఏప్రిల్ 03, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై ఆందోళన మిన్నంటుతోంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు నిరసన రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థుల నిరసనలపై పోలీసుల నిర్బంధ చర్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్టులపై ఆగ్రహంతో, ప్రజల గొంతుకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బీజేవైఎం సమరశంఖం పూరించింది. ఖమ్మం జిల్లాలో బీజేవైఎం  ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లబ్యాడ్జీలతో వీధుల్లోకి దిగి ప్రభుత్వ మొండివైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ నిరసనలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడే భూమిని కాపాడుకొవాల్సిన బాధ్యత అందరి మద. ఉందని ఆయన పేర్కొన్నారు.. యూనివర్సిటీ భూములు ఇతరుల పరం  చేయడం సరికాదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెడతామని ప్రకటించడంతో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పచ్చని చెట్లు నరుకుతుంటే, ప్రకృతి నాశనమైపోతుంటే, ప్రభుత్వం లాభాల కోసం భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడాన్ని సమర్థించలేమని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
- భాజపా  నిరసన
ఈ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో, ఈ విషయాన్ని తప్పుబడుతూ బీజేపీ నిరసన బాట పట్టింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో రోడ్డెక్కి, ప్రభుత్వం తక్షణమే ఈ వేలాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
- "వేలం నడవదు!" - భాజపా హెచ్చరిక.
భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, "సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇది చెల్లదని, భూములను పరిరక్షించేందుకు తాము పోరాటం కొనసాగిస్తామని" హెచ్చరించారు. భూములను కాపాడాలని 22,000 మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించారని, ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై సమీక్ష జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
- పోరాటం ఆగదు" - భాజపా స్పష్టం.
భూముల రక్షణ కోసం భాజపా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించింది. "ఈ భూములను వేలం వేయాలని చూస్తే, భాజపా దీన్ని నిలువరించకుండా ఉండదు. ప్రభుత్వానికి మా పోరాట శక్తిని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది" అని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నేతలు భూమిని కాపాడాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో ఈ నిరసన తారాస్థాయికి చేరుకునే అవకాశముంది.
- ప్రకృతి రక్షణకు ప్రజల సంఘీభావం.
సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతం నెమళ్ళు, జింకలు, అరుదైన తాబేళ్ల వంటి వన్యప్రాణులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ భూమిని అభివృద్ధి చేయాలంటే, అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం కేంద్ర అనుమతి అవసరం. కానీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండానే ఈ ప్రదేశాన్ని వేలం వేయాలని చూస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చెట్లను నరికి, భూమిని మునుపటి రూపాన్ని కోల్పోయేలా చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షుడు దుద్దుకూరు కార్తీక్,  బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఈదుల భద్రం,  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు శీలం పాపారావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు,  దొడ్డ అరుణ, మంద సరస్వతి,జిల్లా నాయకులు సుదర్శన్ మిశ్రా,నల్లగట్ల ప్రవీణ్ కుమార్,రేఖ వెంకట సత్యనారాయణ, నల్లగట్టు ఉపేందర్ ఏలూరి నాగేశ్వరరావు,  తొడుపునూరి రవీందర్, భూక్య నాయక్, కుమిలి శ్రీనివాస్, జ్యోతుల యుగంధర్, నెల్లూరి బెనర్జీ, ఆచంటి కోటేశ్వరరావు, గడీల నరేష్ పిల్లలమర్రి వెంకట్,  డికొండ శ్యామ్, రీగన్ ప్రతాప్, వలల రమేష్ , కందుల కృష్ణ , రుద్ర ప్రదీప్ రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 2 April 2025

*ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే...ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవు : చంద్రబాబు

*Press Release*

*టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలి*

*తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది*

*అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు*

*టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం*

*వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి*

*అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు*

*త్వరలో JEO, CVSO, SVBC  చైర్మన్, BIRRD డైరెక్టర్‌ల నియామకం*


*అలిపిరిలో భక్తుల కోసం బేస్‌క్యాంప్ నిర్మాణం...60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్*

*ప్రతిసేవపై భక్తుల ఫీడ్‌బ్యాక్...త్వరలో వాట్సాప్ సేవలు*

*సచివాలయంలో నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్ధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

అమరావతి, ఏప్రిల్ 2 :- తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.
 *అవసరమైన పనులే చేయండి*
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ “తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికీ ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఆ మార్పు 100 శాతం ఉండాలి.  అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు...మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమలకు టీటీడీ ఖర్చు చేస్తోంది..దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు....కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబు దారీతనం ఉండాలి” అని సిఎం స్పష్టం చేశారు. “టీటీడీలో సమూల ప్రక్షాళన జరపుతాను అని నేను ఎన్నికల ముందు చెప్పాను. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100 శాతం ఉండాలి. ఎక్కడా పాతవాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్క్షుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు. ప్రక్షాళన అనేది 100 శాతం జరగాల్సిందే...దీనిలో మినహాయింపులు లేవు” అని సిఎం అధికారులకు సూచించారు.

*అలిపిరిలో బేస్ క్యాంప్*
సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 25 వేల మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్తవారు 90 శాతం మంది ఉంటున్నారని అధికారులు చెప్పగా..సగం మంది పాతవారిని నియమించుకోవడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25 వేల మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు తెలపగా..దీనికి మరింత అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈవో, సివిఎస్‌వో, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా...వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుధ్య నిర్వహణపైనా దృష్టి పెట్టాలని సిఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగిచుంకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టర్లలో విస్తరించి ఉండగా....ఇందులో ప్రస్తుతం 68.14 శాతం పచ్చదనం ఉంది. దీనిని 80 శాతానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

*టీటీడీ సేవలపై సంతృప్తి*
 రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్‌బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, అన్నప్రసాదం, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశాలపై 76 శాతం మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 1 శాతం పర్వాలేదని, 1 శాతం మంది మాత్రమే బాగోలేదని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు 74 శాతం మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 3 శాతం పర్వాలేదని, 1 శాతం మంది మాత్రమే బాగోలేదని తెలిపారు. 
మార్చి 9 నుంచి 14 వరకు సాధారణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో చేసిన సర్వేలోనూ అత్యధిక స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. క్యూలైన్ నిర్వహణ, సౌకర్యాలపై 65 శాతం మంది బాగుంది అని చెప్పగా, 28శాతం పర్వాలేదని, 7 శాతం మంది బాగోలేదని సమాధానం ఇచ్చారు. అలాగే వసతి, శుభ్రత బాగుందని 74 శాతం, పర్వాలేదని 19 శాతం, బాగోలేదని 7 శాతం మంది చెప్పారు. లడ్డు రుచి-నాణ్యత బావుందని 77 శాతం, పర్వాలేదని 17 శాతం, బాగోలేదని 6 శాతం మంది చెప్పారు. ఇంకా అన్నదానం, కల్యాణకట్ట, టీటీడీ ఉద్యోగుల ప్రవర్తన, లగేజ్ కలెక్షన్-డెలివరీ వంటి అంశాలపైనా ఇదే స్థాయిలో అభిప్రాయాలు వెల్లడించారు. మొత్తంగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో 61 శాతం మంది భక్తులు టీటీడీ సేవలు బావున్నాయని మెచ్చుకున్నారు. 27 శాతం పర్వాలేదన్నారు. 12 శాతం మంది భక్తులు బాగోలేదన్నారు. 

*టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధి :*
అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. చుట్టూ ప్రాకారం నిర్మాణంతో పాటు ఒక రాజగోపురం, మూడు గోపురాలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తారు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని విస్తరణ పనులతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కొయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణం-అభివృద్ధి కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి,  టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జే ఈ వో  వీరబ్రహ్మం ,చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు