ఖమ్మం : విద్య తోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపుతో పాటు మనకు అస్తిత్వం లభిస్తుందని, భవిష్యత్తులో బంగారు బాటకు చదువు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం డా. బీఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.వార్షికోత్సవ వేడుకల్లో బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. విద్యార్ధినిలు ప్రదర్శించిన ప్రదర్శనలు కలెక్టర్ తో పాటు, ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* ప్రస్తుతం మనకు అందుతున్న అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ బాలికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ప్రణాళికా బద్ధంగా శ్రమించాలని, మనం ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఉన్న సదుపాయాలు, విద్యను వినియోగించి గొప్ప విజయాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.
బాలికలు చిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద కలలు కనాలని, విద్యార్థినులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
జీవితంలో మనం గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత సమాజంలో నలుగురికి సహాయం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని అన్నారు.
మన స్నేహితులలో ఎవరైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే సహాయం అందించాలని, ఇతరులతో కలిసి ఎదిగే ఆలోచన పెట్టుకోవాలని అన్నారు. ప్రతిరోజు మనకు అనేక ఆటంకాలు వస్తాయని, వాటిని ఎలా దాటుతామనే అంశంలో విజేత ఉంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురుకులాల బాధ్యులు రాజలక్ష్మి , స్వరూప రాణి, ఎన్నారై పౌండేషన్ భాధ్యులు రామకృష్ణ, బాబు బాయన్న, కట్టా సాగర్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment