ఖమ్మం : మార్పు మనతోనే సాధ్యం కావాలని సర్వీసెస్ ద్వారా మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే అవకాశం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీస్ వంటి ఉన్నతమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మన లక్ష్యాలు, ఆదర్శాలు, ఎవరి కోసం పనిచేయాలని ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం వంటి అంశాలను మర్చిపోవద్దని తెలిపారు.మనం ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు ఇతరులు ఎదుర్కోకుండా సమాజంలో పది మందికి సహాయం చేసే అవకాశం పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు అందుతుందని, ఏ రంగంలో లేని సంతృప్తి ఇక్కడ మనకు దొరుకుతుందని అన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మన మేధాశక్తి కన్నా పట్టుదల, ధైర్యం చాలా అవసరమని, ఒకసారి విఫలమైనప్పటికీ ధైర్యంగా మరోసారి ప్రయత్నించాలని కలెక్టర్ తెలిపారు. మన సొంత కారణాలు మాత్రమే మనం విఫలమైనప్పుడు మరోసారి ప్రయత్నించేందుకు అవసరమైన ధైర్యం అందిస్థాయి అని అన్నారు. సమాజంలో మనం కోరుకున్న మార్పు మనతో సాధ్యం అవుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం కూడా పోరాడిన తర్వాత మాత్రమే సాధ్యమైందని అన్నారు. మనకు కావాల్సిన మార్పు చేతలతోనే సాధ్యమవుతుందని, మాటలతో సాధ్యం కాదని అన్నారు. మార్పు తీసుకుని వచ్చేందుకు సివిల్ సర్వీసెస్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.సివిల్స్ సర్వీస్ లో పోస్టింగ్ వచ్చిన తర్వాత 10 మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తేనే మన జీవితానికి ఒక సంతృప్తి లభిస్తుందని అన్నారు. 35 సంవత్సరాల పాటు మనకు జీవితంలో పని చేసే అవకాశం లభిస్తుందని, దీనిని బాగా వినియోగిస్తే మనం ఆశించిన లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.యవ్వనంలో ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వృధా చేసుకోవద్దని కలెక్టర్ తెలిపారు. దేశానికి ధైర్యం, నిజాయితీ గల అధికారులు అవసరమని, ఇక్కడ విద్యార్థులంతా దేశానికి గొప్ప సేవలు చేసే అధికారులుగా పని చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.అనంతరం గ్రూప్ 1 పోటీ పరీక్షలో ర్యాంకర్లకు మెమంటోలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అభిరామ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వి. అభిరామ్, డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment