Saturday, 15 November 2025

వ్యాపారి - రాజు కథ.... లక్ష్యం నిర్దేశించుకుంటేనే సోమరితనం పోతుంది..

ఒకప్పుడు ఒక రాజుకి  ఒక గుర్రపు వ్యాపారితో  స్నేహం ఏర్పడింది. 
ఆ వ్యాపారి రాజు కోసం ఉత్తమమైన గుర్రాలను తీసుకువచ్చేవాడు, అతను తెచ్చిన గుర్రాలు చాలా ఆరోగ్యంగా, చురుకైనవిగా ఉండటం వల్ల, రాజు హృదయం ఆనందంతో నిండిపోయేది. 
వాటన్నింటినీ ఎంత ధర వెచ్చించయినా కొనేవాడు. చాలా సార్లు, వ్యాపారి రాజుకు చాలా ఖరీదైన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చేవాడు. రాజు కూడా దానిని నిరభ్యంతరంగా స్వీకరించేవాడు.
వారిరువురి మధ్య చాలా మధురమైన, సన్నిహితమైన స్నేహం ఉండేది, రాజు తన స్నేహితుడితో ఎన్నడూ తాను ఒక దేశానికి రాజన్న హోదాలో ప్రవర్తించేవాడు కాదు. వ్యాపారి కూడా రాజును తనకంటే ఉన్నతమైన వాడని భావించి అతనితో మాట్లాడేవాడు కాదు. ఇద్దరికీ ఒకరికొకరంటే చాలా గౌరవం, ప్రేమ ఉండేది.

కాలక్రమంలో, వ్యాపారి డబ్బును కోల్పోవడం ప్రారంభించాడు. అతను తన గుర్రాలకు, పెట్టిన ఖర్చు కంటే తక్కువ డబ్బు రావడం మొదలయింది. అలాగే, అతని ఖరీదైన, ఉన్నత జాతి గుర్రాలు గుర్తుతెలియని వ్యాధులతో చనిపోవడం ప్రారంభించాయి. తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. నెమ్మదిగా, అతని ఆదాయం తగ్గిపోయి, దాచుకున్న డబ్బు వ్యయం అయిపోయి, క్రమంగా బీదవాడైపోయాడు.

మొదట, అతను తన కష్టాలను రాజు నుండి దాచాడు. అయితే ఉండేందుకు ఇల్లు, పిల్లలకు రెండు పూటలా భోజనానికి కూడా కష్టమైపోవడంతో భార్య కోరిక మేరకు రాజాస్థానానికి వెళ్లాడు.

తన కష్టాలను రాజుకు తెలియజేసి, కొంత డబ్బు సహాయం చేయమని అడిగాడు కానీ, రాజును సహాయం అడగవలసివస్తున్నందుకు వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు.

వ్యాపారి చెప్పేది ఓపికగా, శ్రద్ధగా విన్న రాజు, "మిత్రమా, నీవు ఏ పని చేయగలవు?" అని వ్యాపారిని అడిగాడు.

వ్యాపారి కాసేపు ఆలోచించి, "నేను నా జీవితమంతా గుర్రపు పని మాత్రమే చేసాను, కానీ చాలా కాలం క్రితం కొరడాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. బహుశా, అది చేయగలగుతానేమో", అన్నాడు.

రాజు కొంచెం ఆలోచించి, కోశాధికారితో, "నా స్నేహితుడికి 500 నాణేలు ఇవ్వండి. అతను ఎప్పుడు వచ్చినా కారణం అడగకుండా 500 నాణేలు ఇవ్వాలి", అని ఆజ్ఞాపించాడు. రాజు మాటలు విన్న వ్యాపారి 500 నాణేలు సరిపోవని, ఇబ్బందిగా అనిపించినా చిరునవ్వుతో రాజు సహాయాన్ని స్వీకరించాడు.

కాలం గడుస్తూ ఉంది. వ్యాపారి వచ్చినప్పుడల్లా, కోశాధికారి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అతనికి 500 నాణేలు ఇచ్చేవాడు. వ్యాపారి కూడా తన వంతు ప్రయత్నంగా, పూర్తి అంకితభావంతో కొరడాలను తయారుచేసేవాడు. కానీ ఏదో ఒక లోపం, లేదా ఏదో ఒక కారణంగా తరచుగా అతను పెట్టిన ఖర్చు కంటే తక్కువ పొందేవాడు. అదృష్టవశాత్తూ, రాజు చేస్తున్న సహాయంతో, ఇప్పుడు అతను తన కుటుంబానికి ఆహారం సమకూర్చడంలో ఎటువంటి ఇబ్బంది పడట్లేదు. కొన్ని నెలలు గడిచినా వ్యాపారి పట్టువదల్లేదు. అతను కొరడాలను తయారు చేయడంలో మరింత కష్టపడుతూ, విక్రయించడంలో మరింత శ్రద్ధపెడుతూ పనిచేశాడు. ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాడు.

క్రమంగా, వ్యాపారి నిష్ణాతుడయ్యాడు, నైపుణ్యత సాధించాడు. అతని కొరడాలు మునుపటి కంటే చాలా చక్కగా తయారవుతున్నాయి. ఇప్పుడు కొంత లాభం రావడం కూడా మొదలయింది. మళ్లీ తన ఇల్లు అమర్చుకునే ఏర్పాట్లు మొదలుపెట్టాడు.

కాలక్రమేణా కావల్సినంత డబ్బు కూడబెట్టిన తర్వాత, ఒక స్నేహితుడిగా రాజు తనకు డబ్బు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు తన పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండడం వలన, రాజుకు ఆ డబ్బు కొద్ది, కొద్దిగా తిరిగి చెల్లించేయాలని అనుకున్నాడు.

అతను 500 నాణేలు తీసుకుని కోశాధికారి వద్దకు వెళ్లి, "దయచేసి ఈ నాణేలను మీ కోశాధికారంలో జమ చేయండి" అని అభ్యర్థించాడు. కోశాధికారి చేతులు జోడించి నిరాకరించాడు. " మీకు 500 నాణేలు ఇవ్వమని మాత్రమే నాకు ఆజ్ఞ ఉంది; మీ నుండి డబ్బు తీసుకునే హక్కు నాకు లేదు ఎందుకంటే అలాంటి ఆజ్ఞ నాకు ఇవ్వలేదు. మీకు కావాలంటే ఇక్కడ నుండి ఇంకొంత డబ్బు తీసుకోండి, కానీ మీరు ఇచ్చిన ఈ మొత్తాన్ని తీసుకుని జమ చేసుకోలేను"అన్నాడు.

ఇది విన్న వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఆ నాణేలతో రాజాస్థానం చేరుకుని వాటిని రాజుకు ఇచ్చి, "మహారాజా, మీ దయతో ఇప్పుడు నా వ్యాపారం బాగా జరుగుతోంది! ఇప్పుడు నేను మీ నుండి అప్పుగా తీసుకున్న డబ్బును కొద్ది కొద్దిగా తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, కానీ కోశాధికారి దానిని అంగీకరించడం లేదు", అన్నాడు.

అది విన్న రాజు చిరునవ్వు నవ్వి కోశాధికారితో ఇలా అన్నాడు: "ఇప్పుడు నా ఈ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి ఎంత డబ్బు అడిగినా, ఎలాంటి లెక్కా వేయకుండా, ఎలాంటి ఖాతా పెట్టకుండా తక్షణమే అతనికి ఇవ్వు." అని మళ్ళీ అన్నాడు.

రాజు అన్న ఈ మాటలు విని వ్యాపారి చాలా చాలా ఆశ్చర్యపోయాడు. అతను ముకుళిత హస్తాలతో ఇలా అడిగాడు, "మహాప్రభూ, నా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పుడు, నేను మీ సహాయం కోసం వచ్చాను, మీరు నాకు చాలా తక్కువైనా, నిర్ణీత మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు నిజంగానే వింతగా అనిపించింది. కానీ ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, నా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, ఇప్పుడేమో అడిగినంత ధనాన్ని ఇవ్వమని మీరు ఆదేశిస్తున్నారు. నాకు ఎక్కువ  డబ్బు అవసరమైనప్పుడు, మీరు కేవలం చిన్న మొత్తాన్ని స్థిరంగా అందించారు. ఎందుకు అలా?"

రాజు చిరునవ్వు నవ్వి, "మిత్రమా, ఆ సమయంలో నేను నీకు చాలా డబ్బు ఇచ్చి ఉంటే, నీవు సోమరివైపోయి, పని చేయనవసరం లేదనుకుని, నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసిఉండేవాడివి. పని చేయని కారణంగా మరింత అధ్వాన్నమైన పరిస్థితికి దిగజారిపోయుండేవాడివి. కానీ నీకు పరిమితమైన మొత్తంలో డబ్బు ఇవ్వబడినప్పుడు, నీ పరిస్థితిని, మీ కుటుంబ పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి దాన్ని సరిగ్గా ఉపయోగించడం గురించి నీవు ఆలోచించావు. నీ అంతర్గత ప్రతిభను గుర్తించి, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం ప్రారంభించావు. నీ కుటుంబానికి అన్ని సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఉండడం వలన, నీ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటూ, అభివృద్ధి చెందడానికి ప్రయత్నించావు."

“మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతూ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం.
 
ఇప్పుడు నువ్వు కొరడాలను తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని సాధించావు, ఇప్పుడు నీ వ్యాపారం బాగా సాగుతోంది...ఈ సమయంలో నీ వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే, నీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి నీకు సరైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా నీ కష్టానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను కూడా పొందుతావు", అన్నాడు, 
రాజు తన బాధలలో, కష్టాల్లో తనకు సహాయం చేయడమే కాకుండా... వాటిని అధిగమించడానికి అతనికి పుష్కలమైన అవకాశాలను ఇచ్చి, వాస్తవానికి ఒక నిజమైన స్నేహితుడి పాత్రను పోషించాడని, వ్యాపారి అర్థం చేసుకున్నాడు.
సంపూర్ణ విజయానికి బలమైన సంకల్పంతో పాటు సరైన మార్గాలు, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరం. 🌼

బాబూజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం

No comments:

Post a Comment