Saint Tyagaraja - also known as Tyāgayya
Birth name - Kakarla Tyagabrahmam
Born - 4 May 1767
Thiruvarur, Thanjavur Maratha kingdom
Died - 6 January 1847 (aged 79)
Thiruvayaru, Tanjore district,
Madras Presidency
త్యాగరాజు, ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వారే మన త్యాగయ్య కూడా. ప్రతి సంవత్సరం తిరువుయ్యూరు లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు లో బృందంగా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ గాయకులు త్యాగరాజ కీర్తనలు గానం చేస్తారు.
త్యాగరాజు, కాకర్ల త్యాగ బ్రహ్మం (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. అతను కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.
బాల్యం, విద్యాభ్యాసం
త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందు గల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.
జీవిత విశేషాలు
త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగ పరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. వారు జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యముగా చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ అతను 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత అతను పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ అతను ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
సంగీత ప్రతిభ
త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవము" ఇచ్చాడనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.
త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు సవరించు
త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత అతను వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము
త్యాగరాజ ఆరాధనోత్సవాలు
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఇతను జన్మదినం రోజుని భారతియ సంగీత దినొత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్లో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
అతను భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత అతను నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి అతను సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు అతను రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల అతను సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
సమాధి
త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
రచనలు
రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
కీర్తనలు
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు అతను మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు.
త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి యేవనిన:
కొవ్వూరు పంచరత్నములు
(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు). ఈయన పంచరత్న కీర్తనలు, సంగీతం మీద త్యాగయ్య పట్టును వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.
పంచరత్న కీర్తనలు
త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు...అవి.
జగదానంద కారక - నాట రాగం
దుడుకుగల - గౌళ రాగం
సాధించెనె - ఆరభి రాగం
కనకనరుచిరా - వరాళి రాగం
ఎందరో మహానుభావులు - శ్రీ రాగం
కీర్తన
పల్లవి
ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥
అనుపల్లవి
చందురు వర్ణుని అందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥
సరగుస బాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరు గురించి
బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి గుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో
గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥
హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా
పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥
ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ ॥రెందరో॥