Sunday, 25 July 2021

రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా..కాకతీయుల కాలం నాటి రుద్రేశ్వర ఆలయానికి దక్కిన గౌరవం....తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం ..

వరంగల్...  
శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ను  ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించడంతో ప్రపంచ పర్యాటక జాబితాలో చోటు దక్కించుకుంది. 21 దేశాలు రామప్ప/రుద్రేశ్వార ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.రోజుల తరబడి చూసినా తనివితీరని దృశ్యకావ్యం..
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలం పేట  గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి  రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు.
(India gets its 39th World Heritage Site
Rudreswara Temple (Ramappa Temple) at Palampet, Warangal, Telangana inscribed on UNESCO's World Heritage List)
ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం..
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.

No comments:

Post a Comment