లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో గురువారం ఉదయం శాస్త్రోక్తంగా శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం ప్రారంభమైంది.
రుత్వికులు కలశ స్థాపన, కలశ ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజమాని సంకల్పం, భక్త సంకల్పం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. 32 మంది రుత్వికులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ హవనం చేశారు. వేద మంత్రాలతో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానం మారుమోగింది. మధ్యాహ్నం 1 గంట వరకు హవనం జరుగుతుంది.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి ఈ కార్యక్రమంలో పాల్గొని సంకల్పం చేసుకున్నారు.లోక కల్యాణార్థం చతుర్వేద హవనం : టీటీడీ ఈవో ధర్మా రెడ్డి. లోక కల్యాణార్థం వారం రోజుల పాటు తిరుపతిలో తొలిసారిగా శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం చతుర్వేద హవనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 5వ తేదీ వరకు ఏడు రోజులపాటు 32 మంది రుత్వికులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. సృష్టిలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ, ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు . భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమ మార్గదర్శకులు ఆచార్య చిర్రావూరి శ్రీరామ శర్మ మాట్లాడుతూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ, ఆయా దేవతలకు ఆహుతులను ఇవ్వడం ద్వారా సత్ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. కంచి పరమాచార్యులు చెప్పిన నియమాలను పాటిస్తూ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం లోని మంత్రాలను పఠిస్తూ హవనం నిర్వహిస్తున్నామని వివరించారు.
No comments:
Post a Comment