Monday, 26 June 2023

కన్నుల పండుగగా సప్తవర్ణ పుష్ష్పయాగం...

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎపి శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.ఇందులో  మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు  పత్రాలు కలిపి మొత్తం 3 టన్నులతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.
   మే 26 నుండి జూన్ 3వ తేదీ వరకు వరకు ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

No comments:

Post a Comment