Monday, 30 December 2024

*ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి.... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*


ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి చెందిన జే. కోటేశ్వర్ రావు తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, తనకు అవుట్సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కె. రమేష్ తన తాత గారు పోచారం గ్రామానికి వి.ఆర్.ఏ.  గా పనిచేసి ఆ ఉద్యోగం తన తండ్రికి ఇచ్చారని, ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగా లేనందున ఈ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన డి. మల్లిఖార్జున్ రావు గత పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్ గా పని చేస్తున్నానని, 2021 లో అనారోగ్య కారణంగా పంచాయతి కార్యదర్శికి లేఖ రాసి సెలవు తీసుకున్నానని, ప్రస్తుతం తనకు గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఖమ్మం నగరం 43వ డివిజన్ ఎన్.ఎస్.పి. రోడ్డుకు చెందిన ఎం. రమాదేవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,  ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాజీ సైనికులకు ప్రభుత్వం అందజేసే భూమిని కేటాయించాలని మాజీ సైనికుడు  చెందిన సంతోష్ వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 29 December 2024

దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం.. 179 మంది మృతి...

 సౌత్ కొరియాలో మోయిన్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రమాద సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని తెలిపింది.ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. 1997 తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన అతి పెద్ద విమానం ప్రమాదంగా తెలుస్తోంది 97 లో జరిగిన ప్రమాదంలో 200 పైబడి ప్రయాణికులు మృతి చెందగా ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది చనిపోయినట్లు తెలుస్తోంది

An aircraft with 181 on board crashed at South Korea's Muan airport on Sunday, after it suffered a bird strike during landing, reported the national fire agency. One flight attendant and one passenger have been rescued so far.
According to news reports, 179 people have been presumed dead. Authorities confirmed the number of dead, and casualties are expected to rise sharply. A total of 181, including six crew members, were aboard the plane that was returning from Bangkok.


Saturday, 28 December 2024

ఏడుకొండలు చేరాలంటే..! ఏడు మార్గాలు ఉన్నాయి మీకు తెలుసా..!!



 *అందరికీ తెలుసు. మరి ఆ 7కొండలు ఎక్కేందుకు 7 మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు.ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*                                               *(1) మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. కొంత నడకమార్గం కాగా… 3650 మెట్లు ఉంటాయి. ఈ మార్గం నుంచి వెళ్తే.. ఎన్నో ఉపాలయాలు, మోకాళ్ల పర్వతాన్ని దర్శించుకోవచ్చు.* 
 *(2) రెండో మార్గం.. శ్రీవారి మెట్టు మార్గం. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి… మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు… తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్లారట. అందుకే దీనికి శ్రీవారి మెట్టుఅందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరొచ్చింది. శ్రీవారి మెట్టు నుంచి మూడుకిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మార్గంలో వెళ్తే… గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు.* 

 *(3) మూడో మార్గం.. మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంటుంది. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి… శ్రీవారి ఆలయం చేరుకుంటారు. ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటుచేశారు.* 

 *(4)నాలుగో మార్గం… కళ్యాణి డ్యామ్‌. తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉంటుంది. డ్యామ్‌ నుండి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం 15 కిలోమీటర్లు. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటారు.* 

( *5) ఐదో మార్గం… తుంబురుతీర్థం. కడప సరిహద్దు-చిత్తూరు ఎంట్రెన్స్‌ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి తుంబురుతీర్థం, పాపవినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం నుంచి పాపవినాశనం మధ్య 12 కిలోమీటర్లూ దూరం ఉంటుంది. పాపవినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు.* 

 *(6)ఆరో మార్గం.. అవ్వాచారి కోన. ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు. దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు. అవ్వాచారికొండ…. మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది. రేణిగుంట సమీపంలోని కడప-తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమరవైపుకి వెళ్తే… మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.* 

( *7) ఏడో మార్గం… తలకోన. ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకే.. దీనికి తలకోన అని పేరువచ్చింది. తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది. ఈ మార్గం 20 కిలోమీటర్లు ఉంటుంది.* 

 *సేకరణ.. సోషల్ మీడియా ద్వారా

కొత్త సంవత్సరం వేళ వినూత్నంగా సైబర్ నేరగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త..: వి.సి.సజ్జానార్


*నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.*
*హైదరాబాద్: నూతన సంవత్సర శుభాకాంక్షల' పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.*
*పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతి*
*న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందు కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుంది. *బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.*

Thursday, 26 December 2024

ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి

*దక్షిణా మూర్తి........!!*

*అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్షసాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి, జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి.ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు.*
*దక్షిణామూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ అని వివరిస్తోంది.దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం, గురువు. ఈ రూపం శివుడిని యోగా, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. శాస్త్రాలపై వివరణ ఇస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే, స్వీయ-సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు.*
*ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాదులు సదా శివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరి సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తు న్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది. శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. మహా విష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం.*

Wednesday, 25 December 2024

"రియల్" స్టార్ రోజు సంపాదన 20 కోట్ల పై మాటే..

**

అదృష్టం ఎవరిని ఏ తీరం వైపు తీసుకు వెళుతుందో చెప్పలేము ఒక ఫుట్పాత్ వ్యాపారి రోజు 20 కోట్ల అర్జించే స్థితికి వెళ్ళాడు అంటే దాని వెనక అతని నిబద్ధత పట్టుదల కృషి తో పాటు అదృష్టం కూడా కనికరించాల్సిందే.    ఇహ అసలు విషయంలోకి వద్దాం   సేల్స్‌మెన్‌గా ఉన్న అలాంటి భారతీయ వ్యాపారవేత్త గురించి మీకు తెలుసా, కానీ నేడు రూ.20,830 కోట్ల ఆస్తికి యజమాని. విశేషమేమిటంటే..
ఈ వ్యక్తి ఒకప్పుడు ఫుట్‌పాత్‌పై పాల నుండి పుస్తకాల వరకు అన్నీ అమ్మేవాడు, కానీ నేడు ఖరీదైన ఆస్తులను అమ్ముతున్నాడు.

రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారవేత్త రిజ్వాన్ సజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ముంబై వీధుల నుండి బయటపడి సౌదీ అరేబియాలోని ప్రాపర్టీ మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రిజ్వాన్ సజన్ మాట్లాడుతూ ధనవంతుడు కావాలంటే డబ్బు కాదు నైపుణ్యం కావాలి. 

ఒకప్పుడు ముంబయి వీధుల్లో, రోడ్లపై కష్టపడ్డ రిజ్వాన్ సజన్ ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎన్నారై వ్యాపారవేత్త. రిజ్వాన్ సజన్ తన కెరీర్‌ను సేల్స్‌మెన్‌గా ప్రారంభించాడు. తన నైపుణ్యంతో, అతను అటువంటి విజయాన్ని సాధించాడు, ఈ రోజు అతను దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకడు.

 *నైపుణ్యాల ద్వారా డబ్బు సంపాదించారు* 

రిజ్వాన్ సజన్ యొక్క రియల్ ఎస్టేట్ 'డాన్యూబ్ గ్రూప్' బిలియన్ డాలర్ల వ్యాపార వెంచర్. ఈ కంపెనీ సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ మరియు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద నిర్మాణ సామగ్రి కంపెనీలలో ఒకటి.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన రీల్‌లో, నేను చాలా మంచి సేల్స్‌మెన్‌ని, ఇది నా అతిపెద్ద క్వాలిటీ అని చెప్పాడు. ఈరోజు తాము ఏటా 10 బిలియన్ దిర్హామ్‌ల వరకు సంపాదించే స్థాయికి చేరుకున్నామని రిజ్వాన్ సజన్ అన్నారు. ఈ మొత్తం నుంచి రోజువారీ సంపాదన లెక్కిస్తే దాదాపు రూ.32 కోట్లు అవుతుంది. నేటి ప్రపంచంలో విజయవంతమైన ప్రతి వ్యాపారి దగ్గర డబ్బు ఉండదని, తన కష్టార్జితంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని, వారిలో నేను కూడా ఒకడినని అన్నారు.

 *ముంబై నుంచి దుబాయ్‌కి ప్రయాణం* 

విశేషమేమిటంటే రిజ్వాన్ సజన్ తనపై తనకు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే.. 'నా డబ్బు అంతా పోతే మళ్లీ నా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. నేను ఆఫ్రికాలోని అరణ్యాలలో కూడా డబ్బు సంపాదించగల వ్యక్తిని అని అతను పేర్కొన్నాడు.

రిజ్వాన్ సజన్ ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు  తొలినాళ్లలో ఫుట్‌పాత్‌పై కూడా సరుకులు అమ్మేవాడు. తన తండ్రి మరణం తర్వాత, రిజ్వాన్ సజన్ 1981లో కువైట్‌కు వెళ్లాడు. ఇక్కడ ట్రైనీ సేల్స్‌మెన్‌గా పనిచేశాడు.

1993లో, అతను డాన్యూబ్ గ్రూప్‌ను ప్రారంభించాడు, ఇది ఇప్పుడు నిర్మాణ వస్తువులు, గృహాలంకరణ మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో వ్యాపార సమ్మేళనం. DNA నివేదిక ప్రకారం, UAE ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో రిజ్వాన్ సజన్ నికర విలువ 2.5 బిలియన్ US డాలర్లు (రూ. 20,830 కోట్లు).

అంగట్లో అనుబంధం @ప్రస్తుతానికి ఇది కథే..


future!
అమ్మ 
పొద్దున్న 8 గంటలకి కాలింగ్ బెల్ మ్రోగింది. పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయిట అమ్మ  నిలుచుని ఉంది.
"అమ్మా " అని సంతోషంగా ఆమెని లోనికి తీసుకుని వచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటి సారి అతడింటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళి పోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. 
తల నిమిరి "ఎలా ఉన్నావు బాబూ 
అని పలకరించింది. అప్పుడే వంటింట్లోంచి వచ్చిన కోడలు విమల " రండి అత్తయ్యా బాగున్నారా " అని పలకరించింది. ఆమెని కౌగిలించుకుని " మా మనవడూ మనవరాలూ ఏరీ? " అని అడుగుతుండగానే లోపలినించి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. రమ్యకి అయిదేళ్ళు   రవికి మూడేళ్లు . మొదటి సారి బామ్మను చూస్తున్నారు కదా. సిగ్గు. 
విమల పిల్లల్ని పిలిచింది. " ఇలా రండి. బామ్మ వచ్చింది. చూడండి "
ఇద్దరూ భయంతో,  సిగ్గుతో బయిటకి వచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడుగుతే పెద్దది " తెలుసు. డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా " అంది.
అమ్మ తను తెచ్చిన బొమ్మ లు , తినుబంఢారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరినీ ఒడిలో కూచో పెట్టుకుంది.
కాసేపట్లో లేచి " సమయం లేదు. నీకు నచ్చిన కూరలూ పప్పు అన్నీ వండాలి.  ఏమైనా special కావాలంటే చెప్పు" అని వరుణ్ ని అడిగింది. " మీరు కూచోండత్తయ్యా నేను వంట చేస్తాను " అంది కోడలు.  "భలేదానివే.  వాడికి నచ్చినవి ఉన్న  ఒక్క రోజైనా నన్ను  చేయనీ. కావాలంటే వచ్చి కొంచెం సాయం చేయి" అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేసాడు వరుణ్. విమలకీ పిల్లలకీ కూడా ఆ వంట బాగా నచ్చింది. 
పిల్లలిద్దరూ బామ్మ తో కలిసి పోయినందున కధలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచే సరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడి వేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి.
అందరూ ఇష్టంగా తినగా పిల్లలు " సూపర్ బామ్మా" అని పొగిడారు
7.45 కి అమ్మ మౌబైల్ లో message వచ్చింది. చూసి " మీ అన్నయ్య.  కారు పంపించాడట. "
" సరేనమ్మా మీరు బయిలు దేరండి" అన్నాడు వరుణ్. "ఇక్కడే ఉండి పో బామ్మా" అన్నారు పిల్లలు. " మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా. ఇప్పుడు వెళతాను. OKనా " అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. 
"ఎంతైందమ్మా "అడిగాడు వరుణ్. 
ఆమె చిరునవ్వుతో తన సంచీలలోనించి I padలాటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం 12 గంటలయింది. గంటకి 1500 చొప్పున 18000అయింది.  GST estra నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ పేకేజీలో వచ్చేసాయి. మా app moneyఉంటే 10%  cashback offer ఉంది. G pay , Card payment మి ఇష్టం.

" మీకు తలిదండ్రులు పోయారా?
మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివలాలు మా website కు పంపండి. మా దగ్గర ప్రశిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటీకి పంపుతాం. వారు మీ ఇంటీకి వచ్చి  మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు. 
మా " భంధుత్వం.com ని గాని మా app download చేసిగాని...

ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన,    9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా Gpay లో డబ్బులు పంపాడు వరుణ్. 

చేయి ఊపుతూ తన next appointment కి బయిలుదేరింది ఆ "అద్దె" అమ్మ....!

ఈ రోజు ఇది కధ. 
రేపు ఇది వాస్తవం కావచ్చు  
మనం ఎటు వెళుతున్నామో తెలియడం లేదు.
____________________________
ఒక తమిళ కధకి అనువాదం.
#everyone
Courtesy: Murali Krishna@Face Book

Tuesday, 24 December 2024

ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం : గరిక ఉపేందర్ రావ్

ఖమ్మం : రెవెన్యూ చరిత్రలో భూ భారతి ఓ మైలురాయిగా కితాబు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల , టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి , తదితరుల అండతోనే తాము విజయం సాధించామన్న గరికె ఖమ్మంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన వీఆర్వోల రాష్ట్ర అధ్యక్షులు గరికె . గత ప్రభుత్వ పాలనలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు కావడంతో రెండున్నర సంవత్సరాలుగా మానసిక వేదనతో ఆందోళనలో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా 5,139 మంది వీఆర్వోల కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం విఆర్ఓ లను రెవిన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికి ఉపేంద్ర రావు అన్నారు . మంగళవారం ఖమ్మం లోని టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు , పలువురు రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి యావత్ వీఆర్వోల కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు . గత ప్రభుత్వం వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి విడదీయడమే కాకుండా గ్రామస్థాయి రెవిన్యూ రద్దుచేసి వీఆర్వోల భవిష్యత్తును అంధకారంలో నెట్టింది అన్నారు . నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు అనేక దఫాలుగా ఆందోళనలు నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అవినీతిపరులుగా గ్రామ రెవెన్యూ అధికారులను చిత్రీకరించి అవమానులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్న వీఆర్వోలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు మిగతా మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , రాష్ట్ర సీసీఎల్ఏ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ , తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ , తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల చైర్మన్, రెవెన్యూ ఎక్స్ పర్ట్ , డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చి రెడ్డి , కృషి ఫలితంగా మరియు డిప్యూటీ కలెక్టర్ సంఘం తెలంగాణ తాసిల్దారుల సంఘం కృషి ఫలితంగా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో సమస్త విఆర్ఓ లకు ఆప్షన్ పద్ధతిలో తీసుకోవడానికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరఫున గరిక ఉపేంద్రరావు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు .రెవెన్యూ చరిత్రలో  భారతి చట్టం 2024 ఒక వరం . గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల భూ సమస్యలు స్థానికంగా వేగవంతంగా న్యాయమైన సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా చట్టంలో రూపకల్పన చేయటం అట్లాగే ఆప్షన్ విధానం మండల డివిజన్ జిల్లా స్థాయిలలో అవకాశం కల్పించడంతోటే దళిత , గిరిజన , సన్న కారు , చిన్న కారు మధ్యతరగతి , రైతులకు ఎంతో వెసులుబాటును కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గరికె ఉపేంద్ర రావు అన్నారు . రీ డిప్లయ్మేంట్ ద్వారా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బలవంతపు సర్దుబాటు ద్వారా అర్ధరాత్రి వేళ లాటరీ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగుల సిసిఏ రూల్స్ , ఫండమెంటల్ రూల్స్ కు విరుద్ధంగా తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయం వలన వీఆర్ఓ లందరూ పూర్వపు సర్వీసులు పూర్తిగా కోల్పోయారు . పే ప్రొటెక్షన్ కోల్పోయారు , పదోన్నతులు కోల్పోయారు , డి గ్రేట్ చేయబడి అటెండర్లుగా , కామాటిగా , వంట కుక్కు , స్వీపర్లుగా , మహిళా జీపు డ్రైవర్‌గా , వార్డు అధికారిగా ఇలా అవమానింపబడి సమాజంలో మానవ హక్కులు కోల్పోయామని అన్నారు .  ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఆందోళనలకు గురికావడమే కాకుండా జిసిసి లో పనిచేస్తున్న వారికి నేటికీ నెల వారి వేతనాలు రాక మనోవేదనతో ఆర్థిక భారం తట్టుకోలేక ఇద్దరు విఆర్వోలు అకాల మరణం చెందటం చింతించదగిన అంశంగా భావిస్తున్నామని వారు తెలిపారు . గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన మాకు జరిగిన నష్టాన్ని నేటి ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా సంఘం ఆధ్వర్యంలో మెమొరాండాలు సమర్పించి మా సమస్యల పరిష్కారానికి నివేదించుట మూలంగా మా సమస్యలను సానుకూలంగా తీసుకొని మాకు నేడు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలోకి రావడానికి ఆప్షన్ పద్ధతి ద్వారా మమ్మల్ని తీసుకోవడం హర్షించదగిన పరిణామం అన్నారు . నేటి ఆప్షన్ లో గత సర్వీస్ యొక్క పరిస్థితిని ప్రమోషన్ విధానాన్ని ఆప్షన్ ఫామ్ లో పొందుపరచలేదనే అంశం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నది . తప్పకుండా నేటి ప్రభుత్వం వీఆర్వోల న్యాయమైన గత సర్వీసును పరిగణలోకి తీసుకొని కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ని గౌరవ రెవిన్యూ శాఖ మాతృ గారిని కోరారు . విలేకరుల సమావేశంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చీమల నాగేంద్రబాబు , బంక కృష్ణ  , షేక్ జానీ మియా , వజ్జ రామారావు , చర్ల శ్రీనివాస్ , ధరావత్ భాస్కర్ , కిషోర్ , నెల్లూరు లవన్ కుమార్ , బంక భాస్కర్ ,  శ్రీ వాణి , మల్లీశ్వరి , వాంకుడోత్ వెంకన్న , వస్త్రం ధన్నూరి బాలరాజు , చిట్టి మల్ల నాగేశ్వరరావు , షేక్ నాగుల మీరా మరియు వందమంది పూర్వ విఆర్వోలు పాల్గొన్నారు .

వెంటనే ఇల్లు కట్టి ఇవ్వండి..దిక్కారం పై కోర్టు కన్నేర్ర.... ధనవంతులవైతే ఇదే వేగం చూపిస్తారా అంటూ ప్రశ్న

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట గ్రామంలో స్టే ఉత్తర్వులున్నప్పటికీ అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసిన పేదల ఇంటిని పునరుద్ధరించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పేదలు ఇల్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీసింది. దోమలపెంటలో కటకం మహేశ్‌, నాగలక్ష్మి ఓ ఇల్లు కట్టుకొని చాలా ఏండ్ల నుంచి నివాసముంటున్నారు. అది అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వారి ఇంటిని కూల్చరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిం ది. ఉత్తర్వులు అమలులో ఉండగా నే ఇంటిని కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధికరణ పిటిషన్‌ దాఖలు చేశా రు. దీనిపై జస్టిస్‌ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి వల్ల ఇది జరిగిందని, ఇది జి ల్లా పంచాయతీ అధికారికి తెలియదని చెప్పారు. కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

Friday, 20 December 2024

బడుగు బలహీన వర్గాల వైపు ఓ లుక్కేస్తున్న ఖమ్మం కలెక్టర్... ఆదుకునేందుకు వెంటనే చర్యలు..


*ఖమ్మం కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ తాను ప్రయాణించే దారిలో పేదల జీవితాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు గతంలో ఆటో కార్మికుల అడ్డాలో ఆయన కలెక్టర్ వారి బాగోగులను స్వయంగా విచారించారు అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ల వద్దకు వెళ్లి వ్యాపార నడుస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు అక్కడే ఆయన స్వయంగా టీ తాగారు అయితే తాజాగా త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ ఆమెకు మెప్మా ద్వారా వెంటనే సహాయం అంది ఎలా చర్యలు చేపట్టారు 
దివ్యాంగురాలు కమల చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో... ఓ చిరునవ్వు నవ్వారు.  దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. స్పందించిన కలెక్టర్.. నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేశారు.

Thursday, 19 December 2024

తెలంగాణ పంచాయతీలో ప్రజాశాంతి... పార్టీ బలోపేతానికి క్యాంపెయిన్లు నిర్వహిస్తాం : కె.ఎ.పాల్


ఖమ్మం డిసెంబర్ 19: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలను ఓడించాలని, ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్ లకు భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ అన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. , ప్రజలకు ఇచ్చిన  వాగ్దానాలను అమలు చేయలేక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధికి దూరంగా కొనసాగుతు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవినీతి పాలన చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి సాగనంపారని ఆరోపించారు.ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా భద్రాచలం నుంచి ఖమ్మం దాకా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎక్కడ చూసినా  అభివృద్ధి ఆనవాళ్లు కనిపించలేదని, దోచుకోవటం దాచుకోవటమే వారికి పనిగా మారిందని దుయ్యబట్టారు. ప్రజలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిగులు బడ్జెట్ గా ఉన్నా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచే గ్రామ సర్పంచ్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాశాంతి పార్టీ బలోపేతం కోసం క్యాంప్యాన్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి డబ్బును సేకరించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, తాగునీరు విద్యా ,వైద్యం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
  రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ప్రజాశాంతి పార్టీని ఆదరించి పెద్ద ఎత్తున చేరికలు చేపట్టాలని డాక్టర్ కె ఏ పాల్ పిలుపునిచ్చారు.

Monday, 16 December 2024

*ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి ..... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ఖమ్మం : ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఖమ్మం మదీన మసీదు అధ్యక్షుడు ఎం.డి. హకీం ముస్తఫా నగర్ ఏరియాలోని మైనారిటీలకు ఖబరస్తాన్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన చింతలపాటి చెన్నారావ్ మన ఊరు మన బడి పథకం క్రింద తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 45 లక్షల విలువ గల పనులు చేశానని, అందులో 10 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరగా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,  జిల్లా విద్యా శాఖ అధికారికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 
ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన కృష్ణవేణి వల్లభి గ్రామం నందు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీ అయినందున ఎస్టి కులస్తురాలైన తనకు అవకాశం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.తల్లాడ గ్రామానికి చెందిన ఈలప్రోలు అంజలి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రజావాణిలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 14 December 2024

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కామన్ డైట్ మెనూ కార్యక్రమం... పేదల పిల్లలు కార్పొరేట్ విద్యార్థుల్లా చదవాలి : మంత్రి పొంగులేటి


ఖమ్మం, డిసెంబర్ 14:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ప్రభుత్వం డైట్ మెనూ కార్యక్రమం ప్రారంభోత్సవాలు నిర్వహించింది శనివారం ఖమ్మం జిల్లా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శనివారం మంత్రి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం, మహ్మదాపురం లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యానికి పెద్దపీట వేసిందని..ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, అధికారులు బ్యాండ్ వాయిస్తూ, పూలతో ఘనంగా స్వాగతం పలికారు.ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. కామన్ డైట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదోని పిల్లలు కూడా ధనికుల పిల్లల్లా చదవాలని, పేదోని పిల్లల కోరికలు తీరేలా ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. ప్రభుత్వానికి అదనంగా సుమారు 500 కోట్ల భారం పడుతున్నప్పటికి, దీనిని భారంగా కాక, బాధ్యతగా చేశామని తెలిపారుఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు.గడిచిన పది సంవత్సరాల్లో గత  ప్రభుత్వం పేదవారి పిల్లలను పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు నలబై శాతం కాస్మొటిక్ చార్జీలు 250 శాతానికి పెంచామని అన్నారు.డైట్  చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్  నుంచి  పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని, అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలను బాలికలకు  7వ తరగతి వరకు 55 నుంచి 175  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి  275 రూపాయలకు, బాలురు 7వ తరగతి  వరకు 62 నుంచి 150  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి  200 రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల తో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తున్నట్లు, అన్ని సదుపాయాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.52 నుంచి 54 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు ఈ సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించుకున్నామని, త్వరలోనే నిర్మాణాలు చేపడతామని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని చేసాం, ఇంకా కొన్ని చేయాల్సి ఉందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందులు కలిగాయని, అన్ని చక్కదిద్దుకొని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళల ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యం కి పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి 10 లక్షల ఉచిత వైద్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న గత ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టు లను పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఖర్చు పెట్టె ప్రతి రూపాయి పేదవారికి చెందే విధంగా అధికారులు సహకరించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలు సద్వినియోగం చేయాలని మంత్రి అన్నారు.
విద్యార్థుల పట్ల ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్వంత పిల్లలా చూసుకోవాలని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపుతో పాటు, కిచెన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిందన్నారు. దశల వారిగా 3 నెలలు సిబ్బందికి కిచెన్, స్టోరేజ్ నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు సంతృప్తి గా వుండేలా, పిల్లలు బాగుగా వుండేలా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా మంత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు.
అంతకుముందు మంత్రి, పాఠశాలలో సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. స్టోర్ రూమ్ పరిశీలించారు. సామాగ్రి ఎన్ని రోజులకు వస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రుడ్లను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల భవన పనులను పరిశీలించారు. రూ. 5 కోట్లతో జి ప్లస్ 3 గా నిర్మిస్తున్న పాఠశాల కాంప్లెక్, ప్రిన్సిపాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ రూమ్ ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా, అగ్రిమెంట్ సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పాఠశాల కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేయాలని, సుందరీకరణ, జనరేటర్, ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, సిఇ శంకర్, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇఇ తానాజీ, తహసీల్దార్ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Friday, 6 December 2024

*ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం, డిశంబర్ -6 : ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై క్షేత్ర స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ అందిందని, లాగిన్ ఐడీలు ఇచ్చారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపిడివో లు, ఎంపిఓ లు, ఏపీవో లు, మునిసిపల్ కమిషనర్ల కు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు.జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం క్రింద స్వీకరించిన దరఖాస్తుల్లో 357869 దరఖాస్తులు ఇండ్ల నిమిత్తం వచ్చినట్లు, ఇందులో అత్యధికంగా ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 53990 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ అన్నారు. రోజుకు ఒక అధికారిచే కనీసం 40 దరఖాస్తుల పరిశీలన లక్ష్యంగా చేపట్టి, ఈ నెల 20 లోగా దరఖాస్తుల విచారణ పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు.ఈ సమీక్షలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఆర్వో రాజేశ్వరి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, హౌజింగ్ ఇఇ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*ఖర్గే, మోడీ నవ్వులు! పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం వైరల్*

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో  మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోడి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరస్పరం పలకరించుకొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మొదట ఖర్గే ప్రధాని మోడీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు ముచ్చటించారు. ఖర్గే చెప్పిన ముచ్చట విని ప్రధాని మోడీతో పాటు అందరూ సరదాగా నవ్వారు.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే నాయకులు ఇలా సంతోషంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష నేతలు ఉన్నారు.