Wednesday, 26 May 2021

ఆయన మనసే ఓ స్కానర్... నాడీ చూస్తే రోగం చప్పేస్తారంతే....

ఆయనొక నడిచే ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం. అపర ధన్వంతరి. నాడీ పరీక్షలో ఆయనను మించిన వారు లేరేమో. బసంత్ థియేటర్ వెనుక సందులో ఆయుర్వేద వైద్యులు రంగాచారి గారి ఆసుపత్రికి  మబ్బుల మూడుగంటల నుంచే పేషెంట్లు వచ్చి వరుసలో కూర్చుంటరు. ఉదయం స్నానం చెయ్యకముందయితేనే నాడి  సరిగ్గ తెలుస్తుందట. నీ జబ్బేమిటి నీ అవస్థేమిటి అని ఆయన రోగిని అస్సలు అడగడు. చెప్పబోతే కూడా వద్దని వారిస్తారు. క్షణ కాలం  నాడీ పట్టుకుంటె చాలు స్కాన్ తీసినట్టు మన దైహిక పరిస్థితి అంతా ఆయనే అలవోకగా చెప్పేస్తారు. నాకు నాడీ పరీక్ష చేసి మీకు దేహం లో ఒక చోట కణితి ఉంది అన్నారు. నిజమే .. నాకు ఎప్పటినుంచో ఛాతీలో ఒకచోట కొంచెం దుర్మాంసం పెరిగి ఉంది . డాక్టర్లు పరీక్ష చేసి దాంతో పెద్ద ప్రమాదం లేదంటే వదిలేసాను. నా వెంట వచ్చిన మరో మిత్రుడికి ప్రొస్టేట్ గ్లాండ్ వాచింది అని చెప్పారు. అతనికి అప్పటికా విషయం తెలియదు. తర్వాత హాస్పిటల్ లో పరీక్ష చేస్తే అది నిజమని తేలింది. నేను అయనిచ్చిన మందులు  సరిగ్గా వాడకుండా మళ్ళ పోతే మీరు మందులు వాడలేదని కోప్పడ్డడు. రుచిగా ఉన్నాయి కనక అసవలు తాగారు . చేదుగా ఉన్న చూర్ణాలు సరిగ్గ వాడలేదు అన్నడు.  నాడీ పరీక్షతో ఈయన కు ఈ సంగతి కూడా తెలుస్తుందా అని ఆశ్చర్య పోయాను . చాలా మంది మిత్రుల్ని ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళాను. క్రమశిక్షణగా మందులు వాడిన వాళ్ళందరికీ మంచి గుణం కనిపించింది.                                               ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ కు రంగాచారి గారి వైద్యమంటే చాలా గురి. అయన ఇక్కడ గవర్నర్ గా ఉన్ననాళ్ళూ రంగాచారి గారి దగ్గర వైద్యం చేయించుకునే వారు. రంగాచారి గారి తాతగారు నిజాం రాజ పరివారానికి వైద్యం చేసి చాలా కీర్తిప్రతిష్టలు గడించిన వారు.  వైద్య విజ్ఞానం వారికి పరంపరగా వచ్చింది. మహా భిషగ్వరుడు రంగాచారి గారు రెండురోజుల క్రితం అనాయాస మరణం పొందారు. పారంపరికమైన వైద్య విజ్ఞానం ,  88 ఏండ్ల అపార అనుభవం కలిగిన రంగాచార్యులు గారు ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఆయన గురించిన సమాచారం కూడా ఎక్కడా అందుబాటులో లేదు. రంగాచారి గారి అనుభవాల సంపుటి గనుక రికార్డు అయ్యుంటే ఆయుర్వేద విద్యార్థులకు కరదీపిక గా మారుండేది.  దేశీయ వైద్య విజ్ఞానఖని రంగాచారి గారికి  నా వినమ్ర నివాళి💐🙏

#NB : మిత్రులు Deshapathi Srinivas గారి Post యధాతతంగా...
ఈ "బసంత్ టాకీస్" అనేది హైదరాబాద్, కాచిగూడ "X" క్రాస్ రోడ్స్ లో, వైశ్య హాస్టల్ వెనుక వైపు సందులో వుంటుంది, అయితే ఇప్పుడక్కడ "బసంత్ టాకీస్" అనే దానిని కూల్చేసి "బసంత్ అపార్ట్మెంట్స్" కట్టారు.

No comments:

Post a Comment