Tuesday, 27 December 2022

“సింగ‌రేణి ద‌ర్శ‌న్”**ప్ర‌త్యేక ప్యాకేజీతో టి.ఎస్‌.ఆర్టీసీ... బ‌స్సును లాంఛ‌నంగా ప్రారంభించిన సంస్థ ఛైర్మ‌న్‌, ఎం.డి**ఇక న‌ల్ల బంగారం గ‌నుల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించే అవ‌కాశం

హైదరాబాద్ : నల్లబంగారం గనుల గురించి ఆసక్తి వున్నవారు ఇహ  టి.ఎస్‌.ఆర్‌.టి.సి బస్లో  సింగ‌రేణి గనులను చుట్టేయ్యవచ్ఛు. సింగరేణి బొగ్గు గనుల సంద‌ర్శ‌న‌కై  స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
ద‌శాబ్ధ‌ కాలానికి పైగా సిరులు కురిపిస్తున్న బొగ్గు గ‌నుల్లోంచి బొగ్గును ఎలా తీస్తారో ప్ర‌త్య‌క్షంగా తెల‌సుకోవాల‌ని కుతూహలంగా ఉండే వారికి ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌నుంది. 
ప్ర‌తి శ‌నివారం  అందుబాటులో ఉండ‌నున్న “సింగ‌రేణి ద‌ర్శ‌న్” బ‌స్సును సంస్థ ఛైర్మ‌న్ శ్రీ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎం.ఎల్‌.ఎ గారు,  మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. 
మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో ఛైర్మ‌న్ మాట్లాడుతూ,  ఈ సేవ‌ల్ని చారిత్రాత్మ‌క నిర్ణయంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న అభివ‌ర్ణించారు. 
న‌గ‌ర అందాల‌ను తిల‌కించేందుకు వ‌చ్చే ప‌ర్యాట‌కుల కోసం  టి.ఎస్‌.ఆర్టీసీ గ‌త కొన్ని నెలల ముందు హైద‌రాబాద్ ద‌ర్శ‌న్  సేవ‌ల్ని ప్రారంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు. 
అలాగే, భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీవారి శీఘ్ర ద‌ర్శ‌న భాగ్యాన్ని కూడా క‌ల్పించిన‌ట్లు చెబుతూ, ఈ మేర‌కు టి.ఎస్‌.ఆర్టీసీ బ‌స్సుల్లో 7 రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌ల్సి ఉంటుంద‌న్నారు. 
ఈ క్ర‌మంలోనే తాజాగా సింగ‌రేణి ద‌ర్శ‌న్ పేరిట స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. 
రానున్న రోజుల్లో కాళేశ్వ‌రం దేవాల‌యంతో పాటు బ్యారేజీని తిల‌కించేందుకు మ‌రో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 
సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ కింద ఒక‌రికి రూ.1600గా నిర్ణ‌యించిన‌ట్లు తెలుపుతూ బొగ్గు గ‌నుల తవ్వే విధానాన్ని ప్ర‌త్య‌క్ష్యంగా ప‌రిశీలించ‌వ‌చ్చ‌న్నారు. 
ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను బ‌ట్టీ సింగ‌రేణి ద‌ర్శ‌న్ స‌ర్వీసుల‌ను పెంచ‌డం జ‌రుగుతుంద‌ని, ఆదాయాన్ని పెంచుకునే  దిశ‌గా టి.ఎస్‌.ఆర్టీసీ అడుగులు వేస్తోంద‌ని స్ఫ‌ష్టం చేశారు. 
సింగ‌రేణి ద‌ర్శ‌న్, హైద‌రాబాద్ ద‌ర్శ‌న్‌ సేవ‌ల్ని వినియోగించుకుని సంస్థ‌ను ఆద‌రించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. 
సింగ‌రేణి డైరెక్ట‌ర్ శ్రీ బాల్‌రాం గారు మాట్లాడుతూ, ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు గ‌నుల త‌వ్వ‌కాల‌ను నేరుగా చూసి ఆనందించే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. 
భూగ‌ర్భ గ‌ని, ధ‌ర్మ‌ల్ ప్లాంట్ ల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించ‌వ‌చ్చ‌ని, ప్ర‌యాణంతో పాటు శాఖాహార భోజనాన్ని కూడా క‌ల్పించ‌డంతో ప్ర‌యాణీకుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు. 
టి.ఎస్‌.ఆర్టీసీ ప్ర‌యాణీకుల సౌక‌ర్యాల వైపు ఆలోచిస్తూ కొత్త కొత్త పంథాలో కార్యాచ‌ర‌ణ దిశగా అడుగులు వేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.
ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హన్సా ఈక్విటీ పాట్న‌ర్స్‌, ఎల్‌.ఎల్‌.పి శ్రీ త్రినాథ్ బాబు గారు, సునీల్ రేగుల గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ శ్రీ మునిశేఖ‌ర్ గారు, శ్రీ వినోద్ గారు, శ్రీ పురుషోత్తం గారు, శ్రీ యాద‌గిరి గారు, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు గారు, సి.పి.ఎం శ్రీ కృష్ణ‌కాంత్ గారు, సి.టి.ఎం శ్రీ జీవ‌న్ ప్ర‌సాద్ గారు, సి.టి.ఎం (ఎం అండ్ సి) శ్రీ విజ‌య‌కుమార్ గారు, క‌రీంన‌గ‌ర్ ఆర్‌.ఎం శ్రీ ఖుష్రో షా ఖాన్ గారు, సి.ఎస్‌.ఒ శ్రీ విప్ల‌వ్ గారు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ప్ర‌జా సంబంధాల అధికారి*

No comments:

Post a Comment