Sunday, 4 December 2022

ఓటు నమోదు చేసుకున్నారా అంటూ నగర వాసులతో కలేక్టర్ మాటామంతి.. ముందస్తు ఓటరు నమోదు పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం..


ఖమ్మం, డిసెంబర్ 4: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలును జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. కలెక్టర్ నగరంలోని జిల్లా విద్యాధికారి, జిల్లా అటవీ అధికారి కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి, బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అక్కడి ప్రజలను సైతం ఓటు నమోదు చేసుకున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  18 సం.లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకొనేలా, 17 సంవత్సరాలు నిండినవారు ముందస్తు నమోదులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ప్రతి పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను, దివ్యాంగులను ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే, ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివేవారిని ముందస్తుగా దరఖాస్తును ఇవ్వడం కానీ, ఆన్లైన్ లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఫామ్ - 6 ద్వారా నూతన ఓటర్లను నమోదు, ఫామ్ 6(బి), ఫామ్ - 7, ఫామ్ - 8 ద్వారా ఓటర్ల జాబితా వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, సర్వే ద్వారా ఓటర్ నమోదు చేయాలని, అర్హులైన కొత్త ఓటర్ల పేరు వివరాలతో జాబితా తయారుచేసి, వారందరు నమోదయ్యేలా చూడాలని అన్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరించి జాబితా నుండి తొలంగింపుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో వారి వారి పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది క్రొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది, ఎంతమంది మరణించినవారు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయినవారు ఉన్నది, గరుడ యాప్ ఉపయోగిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఇతర పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా ఇవ్వాలన్నారు. ఓటరుగా నమోదు చేయాల్సిన వారి జాబితాను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ గొల్లబజార్ లో ఇంటింటికి వెళ్లి, ఇంట్లో ఎందరు ఉన్నది, 17 సంవత్సరాలు నిండినవారు, కొత్తగా వివాహం అయి వచ్చిన వారు, ఓటు హక్కు ఎందరికి ఉన్నది, లేనివారు నమోదు చేసుకున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. 17 సంవత్సరాలు నిండిన వారి నుండీ ముందస్తు దరఖాస్తులు తీసుకోవాలని ఆయన అన్నారు. అర్హులైన ఒక్కరూ ఓటుహక్కుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, బూత్ స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment