Wednesday, 26 June 2024

మాదకద్రవ్యాల మత్తులో పడకండి ; సి.పి.సునీల్ దత్ ఉద్భోద


ఖమ్మం, జూన్ 26: యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కారించుకొని బుధవారం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం అన్నింటికంటే భయంకరమైన వ్యాధని, అది చాప క్రింద నీరులా వ్యాప్తి చెందకుండా ముందస్తు అప్రమత్తత చాలా కీలకమని అన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని ఆయన అన్నారు. మత్తు పదార్థాల రవాణా, సరఫరా వినియోగాన్ని నిర్మూలించి తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తుందని, రాష్ట్ర యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి వినియోగంతో జరిగే అనర్థాలపై వివిధ శాఖల సమన్వయంతో 
పోలీసుశాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 8712671111 ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. గడచిన ఆరేళ్ళలో 204 కేసుల్లో 265 మందిని అరెస్ట్ చేసి రూ. 11 కోట్ల విలువ చేసే 9008 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి మత్తుకు అలవాటు పడిన 165 మందికి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని  సృష్టించేందుకు తమవంతు సహకారం అందించేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. 
ఈ సందర్భంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని వైరా, కల్లూరు, ఖమ్మం రూరల్ డివిజన్‌ ఏసీపీ అధికారులు, అన్ని మండల పోలీస్ స్టేషన్లలో ఎస్.హెచ్.ఓ. ల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువతను, విద్యార్థులను, స్ధానిక పౌరులను చైతన్య పరుస్తూ అవగాహన ర్యాలీ లు నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి , అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు భాను ప్రకాశ్ , శ్రీహరి, రమేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment