Thursday, 24 June 2021

జగన్నాధునికి జైష్టపున్నమి ఉత్సవం..స్నాన యాత్ర..పరమాత్మునికి 14రోజుల చీకటి గది వాసం..


పరమాత్మునికే తప్పని.14 రోజుల గృహ బంధనం.. పూరిలో ప్రచారం లో వున్న జగన్నాధుని జ్వరం కధ..

 .  భూమిపై పుట్టిన వారికి జరామరణాలు అనివార్యం... 
పుట్టిన వారికి మరణం తప్పదు. సుఖదుఃఖాలు, వ్యాధులు అనివార్యం. తాను కూడా వాటికి అతీతుణ్ణి కానని చాటిచెబుతు 14 రోజులు వెలుతురు తక్కువగా వుండే మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ సర్వాంతర్యామి పూరి జగన్నాథుడు  వైధ్యం చేయించుకున్నట్లు పూరణ కధ. దీనిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓడిశాలోని  పూరిలో ఓ వేడుక రూపంలో నిర్వహిస్తారు.
జ్వరం పేరిట 14 రోజులు చీకటి మందిరంలో గోప్య చికిత్స, సేవలు నిర్వహిస్తారు. తర్వాత నవయవ్వన రూపంతో భక్తులకు కనులపండువ చేసి పెంచిన తల్లి సన్నిధి(గుండిచా మందిరం)కి రథాలపై చేరుకుంటారు. ఇందులో భాగంగా నిర్వహించే  కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గోంటారు..
దీనికి సంబంధించిన ఓ వృత్తాంతం గమనంలో వుంది
 ఇహ ఆలయంలో జరిగే వేడుక గురించి తెలుసుకుందాం.
చీకటి మందిరంలో చికిత్స వేడుకను పూరిలో జగన్నాథ ఆలయంలో
ఏటా జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన జరుగుతుంది. ఈ వేడుకలో చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో స్నానమాచరిస్తారు. దీన్నే దేవ స్నాన యాత్రగా పేర్కొంటారు. స్నాన పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పూరి మందిరంలో స్నానమండపంలో ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించారని. జల క్రీడలాడిన పురుషోత్తముడు జ్వరానికి గురై, అదేరోజు రాత్రి చీకటి మందిరానికి చేరుకోగా అక్కడ పక్షం రోజులు స్వామి వారికి గోప్య చికిత్సలు నిర్వహిస్తారు.. గోప్య సేవల నేపధ్యంలో 14 రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్థా మూర్తులకు దైతాపతి సేవాయత్‌లు సేవలు చేస్తారు. వారికి పలియా సేవాయత్‌లు సహకరిస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు.
స్వామికిక్కడ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స జరుగుతుంది. కరక్కాయ, జాజి, తాడి, గుగ్గిలం, కర్పూరం, చెట్ల బెరళ్లు, ఆకు పసర్లతో తయారు చేసిన ఔషధాలను చికిత్సలో వాడతారు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి మట్టి కుండల్లో ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలు వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని పుల్లెరి తెల్లో అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటారు. పథ్యంలో భాగంగా ఈ పద్నాలుగు రోజులూ పళ్లు, ఖర్జూరం, తేనె, జున్ను, పంచామృతం నైవేద్యంగా పెడతారు.  
ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాఢ్యమి నాడు భక్తులకు దర్శనమిస్తాడు. . పద్నాలుగు రోజులూ అస్వస్థతతో కళ్లు తెరవని స్వామి ఆరోగ్యవంతుడై, ఆసనాన్ని అధిరోహించి భక్తులను పెద్ద కళ్లతో వీక్షిస్తారు. అందుకే దీన్ని నేత్రోత్సవం అని పిలుస్తారు. మనవునిగా పుట్టినందుకు దైవం కాల ధర్మం ఆచారించారు..మనం అతీతులం కాదని గమనించాలి..

No comments:

Post a Comment