Saturday, 1 October 2022

మోహిని ఆవతారంలో మలయప్ప.. మోహపరవశులైన భక్త జనం... #జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని చెప్పేందుకే మోహిని ఆవతారం#

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం - 
మాయా మోహ నాశ‌నం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఎపి హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, త‌మిళ‌నాడు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ టి.రాజ‌, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్‌, క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం
       రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.

గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

No comments:

Post a Comment