Thursday, 4 January 2024

*ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి లబ్ది : మంత్రి తుమ్మల*


ఖమ్మం, జనవరి 4: అభయ హస్తం క్రింద ఆరు గ్యారెంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం నగరంలోని 49వ డివిజన్ రామాలయం వద్ద నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం క్రింద ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించేందుకు జిల్లా, మండల యంత్రాంగం మొత్తం ప్రజల మధ్యకే వచ్చిందని అన్నారు. 28 డిసెంబర్ నుండి జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి, దరఖాస్తుల స్వీకరణ చేస్తామని, ప్రజాపాలన సభ రోజున వీలుకాని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ దరఖాస్తును జనవరి 6 లోపు తమ తమ గ్రామపంచాయితి కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో అధికారులకు అందజేయాలని మంత్రి అన్నారు.  ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే అందించి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో, గుర్తించబడిన కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్య చికిత్స కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 5 లక్షల పరిమితిని, పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. మిగతా పథకాలు అమలు చేయడానికి మీరు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటింటికి వస్తాయని, ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ సంపద అట్టడుగు వర్గాలకు అందించేందుకు ప్రజాపాలన చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ ఫలాలు అందరికి అందుతాయని అన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు సమర్పణకు వచ్చిన ప్రజలతో, ఏ ఏ పథకాల కొరకు దరఖాస్తు చేసింది అడిగి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలు చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, పట్టణ ఏసీపీ హరికృష్ణ, స్థానిక కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment