Sunday, 20 September 2020

రైతు చేతికి అధికారం: ప్రధాని మోదీ


 వ్యవసాయ రంగ చరిత్రలో ఇదో శుభదినం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. 
ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే కోట్ల మంది రైతులకు చేతికి అధికారం వస్తుందని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కీలక బిల్లుల ఆమోదం అనంతరం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘దేశ వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం. ఈ బిల్లులు వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు కోట్లాది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. దశాబ్దాలుగా రైతు సోదరసోదరీమణులు మధ్యవర్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లులు వారికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తాయి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మా ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడతాయి. అంతేకాదు, మన వ్యవసాయ రంగానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. వీటితో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. దీంతో దిగుబడి పెరగడమే కాక.. మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇకపైనా రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కొనసాగిస్తామని, ప్రభుత్వం నుంచి పంటల సేకరణ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేయడానికే తాము ఉన్నామని, వారికి మెరుగైన జీవనం అందించడమే తమ లక్ష్యమని వివరించారు.

No comments:

Post a Comment