Thursday, 5 January 2023

రైల్వే 3వ లైన్ పనులపై కలేక్టర్ ఫోకస్... ట్రాక్ పై నడిచి భూ సేకరణ ప్రాంతాల్లో. పరిశీలన...


ఖమ్మం, జనవరి 5: కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ విద్యుద్దీకరణ తో పాటు ఏర్పాటుకు గాను ఖమ్మం జిల్లాలో అవసరమగు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం అర్బన్ మండలంలో 3వ రైల్వే లైన్ భూ సేకరణ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. స్థానిక నర్తకి థియేటర్ వద్ద, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింద ప్రాంతాన్ని కాలినడకన ట్రాక్ వెంబడి సారధి నగర్, బురహాన్ పూర్ తదితర ప్రాంతాలు, కోల్పోవుచున్న ఇండ్లు, కట్టడాలను కలెక్టర్ పరిశీలించారు. రైల్వే లైన్ ఎక్కడి వరకు వస్తుంది, ఎంత మేర భూ సేకరణ అవసరం ఉంటుంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి ఎంత మేర సేకరణలో వెళ్తుంది, తిరిగి రహదారికి భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్, ఇతర కట్టడాలు ఎంత మేర ప్రభావితం అవుతాయి అడిగి తెలుసుకున్నారు. రైల్వే గేటు వద్ద నుండి ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి ట్రాక్ ప్రక్క నున్న నీటి నిల్వలు ఎలా తొలగించాలి, డ్రయినేజికి సమస్యలు తలెత్తకుండా ఏ ఏ చర్యలు చేపట్టాలి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ శిబిర కార్యాలయం భూ సేకరణలో ఎంత మేర నష్టం వాటిల్లుతుందో అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ కట్టడాలు, ఇతరాలు ప్రభావితం అయ్యేది సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్  విద్యుద్దీకరణ తో పాటు ఏర్పాటుకుగాను జిల్లాలో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాలకు చెందిన 30 గ్రామాల నుండి 117.19 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇట్టి భూసేకరణలో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలోని ఖమ్మం రెవిన్యూ గ్రామం నందు సుమారు 1.10 ఎకరాలు, బురహాన్ పురం రెవిన్యూ గ్రామం నందు 1.16 ఎకరాల సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, రైల్వే డివిజనల్ ఇంజనీర్ టి. సూర్యనారాయణ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ఆర్ అండ్ బి ఏఇఇ విశ్వనాథ్, టౌన్ ప్లానింగ్ అధికారులు వసుంధర, వికాస్, సంతోష్, రెవిన్యూ అధికారి జి. శ్రీనివాసరావు అధికారులు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment