Wednesday, 11 January 2023

కంటివెలుగు విజయవంతానికి అందరికృషి అవసరం : కలెక్టర్ వి.పి.గౌతమ్.


ఖమ్మం, జనవరి 11: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా. జి. శ్రీనివాసరావు లతో కలిసి వైద్యాధికారులతో కంటి వెలుగు కార్యక్రమ అమలుపై కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా కాలం నిర్వహించినట్లు, ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 100 పని దినాలలో చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో 55 కంటి వెలుగు బృందాలు ఏర్పాటుచేసినట్లు, అన్ని బృందాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. బృందాలన్నింటికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. కంటి పరీక్షలు నాణ్యతతో చేయడం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. జిల్లా సీనియర్ వైద్య శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు. బృందం కంటి వెలుగు శిబిరాన్ని ఉ. 9.00 గంటల నుండి సా. 4.00 గంటల వరకు సోమవారం నుండి శుక్రవారం వరకు వారానికి 5 రోజులు నిర్వహించాలన్నారు. బృందాలకు రోజువారీ భోజన ఖర్చులకు రూ. 1500 లు జిల్లా వైద్య, ఆరోగ్యాధికారికి మొత్తం పంపినట్లు, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అట్టి మొత్తం పంపిణీ చేయాలన్నారు. బృందానికి రవాణా కొరకు అద్దె కారు కు అనుమతించినట్లు ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్, కంటి స్క్రీనింగ్ తదుపరి రెండుసార్లు డాటా నమోదు చేయాల్సి ఉంటుందని, నమోదులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎడిఎం, డీడీఎం, ఏఎన్ఏం బృంద సిబ్బందికి శిక్షణ ఏర్పాటుచేసి పూర్తి చేయాలన్నారు. లేటెస్ట్ వర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. శిబిరం వద్ద క్యూ లైన్ పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రోజు కార్యక్రమం పూర్తి కాగానే ఇంవెంటరీ మాడ్యూల్ లో వివరాలు నమోదు చేయాలని, ఎన్ని రకాల, ఎన్ని కళ్ళజోళ్ళు ఇచ్చినది, మిగులు, ఇంకా అవసరాలు నమోదు చేయాలని అన్నారు. ఏఆర్ మిషన్లు మంచి స్థితిలో ఉండాలని, అన్ని పరికరాలు ముందస్తుగా చూసుకొని ఎన్నికల సన్నద్ధంలా ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో శిబిరం కేంద్రాల వద్ద టెంట్, త్రాగునీరు, కుర్చీలు, టేబుళ్లు అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలన్నారు. శిబిరం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి ప్రజల సేకరణ ఎంతో ముఖ్యమని ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో ప్రతిరోజు 120 మంది పరీక్షలకు వచ్చేట్లు చూడాలన్నారు. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేసి, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయాలన్నారు.సమీక్ష లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ, డిఎంవో, డాటా ఎంట్రీ వారు ఎంతో ముఖ్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు నాయకత్వంతో ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, శిబిరం బృంద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. బఫర్ సిబ్బంది, మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యలు వస్తే, అర గంటలో రీప్లేస్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, పీఆర్, మునిసిపల్ అధికారులు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె తెలిపారు. ఇన్వెంటరీ ని నమోదు చేస్తూ, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టి కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. సూక్ష్మ ప్రణాళిక రూపొందించి అమలుచేస్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సమావేశాలు నిర్వహించి, షెడ్యూల్ ఆందజేసినట్లు ఆయన అన్నారు. అన్నిరకాల చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, వ్యక్తిగత శ్రద్దతో చేపట్టాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి జిల్లా స్థాయిలో, వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో నాయకత్వం వహించాలన్నారు. అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి చేసుకొని, సన్నద్ధంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆయన తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ తో రోజువారి ప్రజాసేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎంసిహెచ్, ఎన్సీడి, ఇమ్యునైజేషన్ తదితర సేవలు ఆగకూడదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎంఐ డిసి ఎండి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇన్వెంటరీ స్టాకును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, అవసరాలను ముందస్తుగా తెలిపితే సరఫరా కు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏఆర్ మిషన్లలో లోపం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, టెక్నీషియన్లను పంపి సరిచేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. రాంబాబు, వైద్య ఆరోగ్య ప్రాజెక్ట్ అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment