Friday, 29 September 2023

కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష...


ఖమ్మం, సెప్టెంబర్ 29: )జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల శనివారం పర్యటించనున్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో కొనిజర్ల మండలం గుబ్బకుర్తిలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి లు ప్రసాద్ రావు, బోస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*************************
*కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన‌‌*...
ఖమ్మం, సెప్టెంబర్ 29: రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు గాను రఘునాథపాలెం వద్ద గల గిడ్డంగుల సంస్థ గోడౌన్ల ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలకు సరిపోను స్థల లభ్యత ఉన్నది చూడాలన్నారు. మౌళిక వసతుల కల్పన విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట ఉత్పత్తులపై ఆరా తీశారు. పరిశీలించి ప్లాన్ తో సహా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
     ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డీసీపీ లు ప్రసాద్ రావు, బోస్, అధికారులు తదితరులు ఉన్నారు.

Thursday, 28 September 2023

తిరుమలలో ఘనంగా అనంతపద్మనాభ వ్రతం


 
తిరుమలలో గురువారం నాడు అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం  శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించా ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామివ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మివ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదలకోసం అనంతపద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాలసముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

Monday, 25 September 2023

స్వచ్ఛంద సంస్థలు ఫామ్ 10ఏ సమర్పించాలి : ఐటి శాఖ కమీషనర్ బి.బాలకృష్ట వెల్లడి


ఖమ్మం : ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించి సరైన   సమయంలో ఐటి రిటర్న్స్‌ సమర్పించేలా చర్యలు తీసుకొని, కొత్త నిబందనలపై విసృత స్థాయిలో ప్రచారం గావించడం ద్వారా  స్వచ్ఛంద సంస్థలు ఫామ్‌ 10ఎ తప్పనిసరి సమర్పించాలని ఆదాయపు పన్ను(ఎగ్జెమ్షన్స్‌) కమిషనర్‌    బి.బాల కృష్ణ తెలిపారు.  సోమవారం ఖమ్మం నగరం సీక్వెల్‌ రీసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కమీషనర్‌లు సదస్సుకు విశిష్ట అతిథులు ఎపి, తెలంగాణ, ఒడిస్సా ఆదాయపు పన్ను(ఎగ్జెమ్షన్స్‌) కమిషనర్‌    బి బాల కృష్ణ, ఆదాయపు పన్ను (మినహాయింపులు) హైదరాబాద్‌ రేంజ్‌ జాయింట్‌ కమీషనర్‌ వి కోటేశ్వరమ్మ హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు మాట్లడుతూ  ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చిన వారందరూ పన్ను చెల్లించే విధంగా, ఐటి రిటన్స్‌పై అవగాహన సదస్సు పన్నుల చెల్పింపులో పారదర్శకత పెంచేందుకే సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు.   స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఐటి శాఖ ఆధ్వర్యంలో  ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.    స్వచ్ఛంద, ధార్మిక సంస్థల ఆదాయ పన్ను మినాహాయింపులు, చెల్లింపు చట్టంలంలో చేసిన నూతన మార్పు, ఫామ్‌ 10ఎ దాఖలు చేయడానికి గడువు పొడిగింపుపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ విధానంపై  పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా  ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసే  చట్టంలో కొత్త నిబంధనలను తెలియజేసారు. పన్ను చెల్పింపుల్లోను, రాయితీ పొందడంలో తలెత్తే చిక్కులను, ప్రత్యేకించి సంస్థల నిర్వహణపై ప్రభావంచూపే అంశాలపై అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు సమర్పించే పత్రాలలో ఫామ్‌ 10ఎ ప్రధానమైనదన్నారు. దరఖాస్తు  దాఖలు చేయడానికి గడువు పొడిగింపు వంటి ప్రధాన అంశాల మీద సుధీర్గంగా చర్చించారు.  ఈనెల 30న నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయని పక్షంలో  ఐటి చట్టం సెక్షన్‌ 115టిడి ప్రకారం 45 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అన్నారు.  ప్రధాన ట్రస్ట్‌ మెంబర్‌ పన్ను చెల్లింపుకు బాద్యులు అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛంద, ఆద్యాత్మిక సంస్థల నిర్వాహకుల సమస్యలు, అపోహలు, అనుమానాలను నివృత్తి చేశారు. సంస్థల నిర్వాహకుల సందేహాలకు స్పష్టమైన వివరణను ఇస్తూ సదస్సుకు హాజరైన వారికి విలువైన సమాచారం అందించారు. ధార్మిక రంగంలో ఇన్‌కంట్యాక్స్‌ చెల్లింపు, రాయితీలలో పారదర్శకతను ప్రోత్సహించడానికి  శాఖ నిబద్ధతను ప్రతిబింబించేలా, నిబంధనలకు అనుగునంగా ఈ సదస్సును సమర్థవంతంగా  నిర్వహించడం జరుగుతుందన్నారు.  పన్నుల ఎగ్జెమ్షన్స్‌లో పూర్తిస్థాయిలో చ్కెతన్యపరిచారు. సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సామాజిక సేవలను కొనసాగించేలా ప్రోత్సాహం అందించారు. 
ఆదాయపు పన్ను అధికారి కె సాయి శంకర్‌ నేతృత్వంలో నిర్వహించిన అవగాహన సదస్సులో  ఔట్‌రీచ్‌ కార్య క్రమానికి ఇంకమ్‌టాక్స్‌ అధికారులు సిద్ధం విజయ్‌ కుమార్‌, సూర్యనారాయణ మూర్తి,  ఇంకమ్‌ టాక్స్‌ ఇస్పెక్టర్‌  కె ప్రసాదరావు,  ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sunday, 24 September 2023

వాహనాలు వేలంతో 6కోట్ల 75లక్షలు సమకూరాయి:సి.పి.స్టీఫెన్ రవీంద్ర


హైదరాబాద్  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన Abandoned & Unclaimed వాహనాలను ఇప్పటి వరకు 13 విడతల్లో వేలం వేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అన్నారు.ఈ 13 విడతల్లో మొత్తంగా 12000 వాహనాలకు గాను  వేలం నిర్వహించామన్నారు. వాహనాలను వేలం వేయడం ద్వారా సుమారు రూ.6 కోట్ల 75 లక్షలు సమకురాయన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో సుమారు 5750 వాహనాలకు సంబంధించి మూడు నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. త్వరలో వాటిని కూడా వేలం నిర్వహిస్తామని సీపీ తెలిపారు.సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో మరో 4500 లకు పైగా Abandoned & Unclaimed వాహనాలు లా & ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయని, వాటికి సంబంధించిన నోటీసులు కూడా త్వరలో జారీ చేస్తామన్నారు.వాహనాలకు సంబంధించిన వివరాలను అన్నిwww.cyberabadpolice.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు.అభ్యంతరాలు ఉన్న వాహన యజమానులు ఆరు నెలల కాల పరిమితిలోపు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు. వివరాలకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ MTO-2, N.Veeralingam గారిని Cell No: 9490617317 కు సంప్రదించాలన్నారు.

Saturday, 23 September 2023

ప్లాస్టిక్ రహితంగా జీవించే వారెందరో....

ప్లాస్టిక్ విస్తళ్ళకూ ప్లాస్టిక్ సంచూలకూ ప్లాస్టిక్ గ్లాసులకూ ప్రత్యామ్నాయాలు లేనే లేవు. అని మనతో ఎందరో చెప్తూ వుంటారు. అవి నమ్మి మనం కూడా అది నిజమే అనుకుంటాం. నిజానికి ఎన్నో అద్భుతమైన ప్రత్యామ్నాయాలు వున్నాయ్. 
ఇలా మనమంతా ఆకుల్ని నిజంగానే వాడడం మొదలైతే చెట్లు వాటంతట అవే ఈ భూమిపై పెరుగుతాయి పచ్చదనం దానంతట అదే పరుచుకుంటుంది. 
అడుగడుగునా ఉన్న పొల్యూషన్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆక్సిజన్  శాతం పెరగడం మళ్ళీ మొదలౌతుంది. 
ఆకుల్లో ముదురాకులే వాడుకోవాలి కనక మరీ లేత ఆకులు చిరిగిపోతాయి కనక
బాదమాకులు, అరిటాకులు, టేకు ఆకులు, తామరాకులు, కొబ్బరాకులు, తాటాకులు, ఈతాకులు, అడ్డాకులు, మట్టి పిడతలు ఇవి కాక అడ్డాకుల కాఫీ కప్పులు, టీ కప్పులు, వేడి వేది బాదం పాలకు,సేమ్యా పాయసాలకు టీ కాఫీలకూ పనికొచ్చేట్టు తయారు చేసుకోవచ్చు.  మా చిన్నప్పుడు ప్రతి చోటా ఇవే వాడేవాళ్ళు చివరికి మా అడవుల్లో కూడా.. 
మా అమ్మమ్మగారు అన్నం, పొంగల్, ఉప్మా లాంటివి ఊరువెళ్ళేటప్పుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక విస్తరాకు అందులో అన్నం అందుకు తగ్గట్టు పులుసూ/ సాంబారు అన్నం వేసి పేపర్తో కట్టి ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా పులుసు సాంబారు లు వద్దు అనుకున్న వారికి ఇస్తరాకు అందులో అన్నం పెట్టి ఒకవైపు పప్పు మరొకవైపు కూర ఇంకోవైపు పచ్చడి వెసి కట్టి ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు వాటిని తయారు చేసేందుకు మిషన్లు కూడా వున్నాయ్. మరొక అద్భుతమైన పరిశ్రమ పర్యావరణ పరిరక్షణతో పాటు. ప్లాస్టిక్ కి నో చెప్పేద్దాం మనమంతా కలిసి. ఏ పెళ్ళికైనా పండగకైనా అరటాకులు లేదా అడ్డాకుల విస్తళ్ళు లేదా బాదమాకులు హాయిగా వాడుకోవచ్చు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. నిజానికి బాదమాకులలో ఉప్మా ఇడ్లీలు తింటే దాంటో రుచి ఇంకెక్కడా లేదూ..  రాదూ...  - మన ప్రకృతిని మన జీవరాశిని మనం కాక ఎవరు రక్షించుకునేది. అన్నింటికీ నోరుపెట్టుకుని జనమం మీద పడిపోయే మనం ఈ విషయంలో గొంతెత్తి చెప్పలేమా??? ఇంత చిన్న విషయం చెప్పడానికి కూడా మొహమాట పడిపోతే ఇంక మనమెందుకు మన బతుకెందుకు నొరుమూసుకుని ఓ మూల సన్నాసుల్లా పడి వుండడానికా ???!!!!- గౌతమ్ కశ్యప్

Thursday, 21 September 2023

రైల్వే కూలీగా మారిన రాహుల్... లాల్ రంగు దుస్తుల్లో సందడి..

రాహుల్ గాంధీ రైల్వే కూలీగా మారారు.కాసేపు లాల్ రంగు దుస్తులు ధరించి సందడి చేశారు.ఇఁందుకు ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ వేదికగా మారింది.
 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైల్వే కూలీలతో కాసేపు ముచ్చటించారు.ఢిల్లీ ఆనంద విహార్ టెర్మినల్ కు వెళ్లిన రాహుల్ గాంధీ కూలీలు ధరించే ఎర్ర రంగు దుస్తులు ధరించి వారి వద్దనున్న లైసెన్స్ బిళ్ళను ఒక కూలీతో కట్టించుకున్నారు. అనంతరం ఆయన ప్రయాణికుల బాక్సులను మోస్తూ సందడి చేశారు. భారత్ జోడోయాత్ర సందర్భంగా తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే టేర్నలికి వెళ్లి రైల్వే కూలీలతో మమేకమయ్యారు వారితో కాసేపు మాట్లాడారు.. పేర్లను కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. జోడోయాత్రకు కొనసాగింపుగా పేర్కొంది..

Tuesday, 19 September 2023

పారదర్శకంగా టీచర్ల బదిలీలు...తప్పుడు సమాచారం పై చర్యలు : కలెక్టర్ వి.పి.గౌతమ్.


ఖమ్మం, సెప్టెంబర్ 19: టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టీచర్ల యూనియన్ల ప్రతినిధులతో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించి, యూనియన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 5 ప్రకారం చేపట్టుతున్నట్లు తెలిపారు. జిల్లాలో బదిలీల నిమిత్తం టీచర్ల నుండి 3766 దరఖాస్తులు వచ్చినట్లు, 3679 దరఖాస్తులు జిల్లా విద్యాధికారి చే ఆమోదించగా, 87 తిరస్కరణకు అయినట్లు ఆయన అన్నారు. ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టి, ఆ స్థానంలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి, స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలు కాగానే, ఆ స్థానంలో ఎస్జీటీ లకు పదోన్నతి, ఆ తర్వాత ఎస్జీటీ ల బదిలీలు చేపట్టబడునని ఆయన తెలిపారు. బదిలీల్లో టీచర్ల గ్రీవెన్స్ లను వెంట వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 375 గ్రీవెన్స్ రాగా, 372 గ్రీవెన్స్ లకు సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సెలవులు, జీరో నమోదులు ఉన్న స్కూల్స్ మినహా, అన్ని ఖాళీలను ప్రదర్శిస్తున్నట్లు ఆయన అన్నారు. స్పూజ్ కేసులు విషయంలో ఆన్లైన్ సమస్యలు ఉంటే చర్యలు చేపడతామన్నారు. అన్ని జాబితాలు ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. మాన్యు6దరఖాస్తుల కంటే, ఆన్లైన్ దరఖాస్తులకు జవాబుదారీతనం ఉంటుందని ఆయన అన్నారు. దరఖాస్తుల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే వెంటనే సరిదిద్దుకోవాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ల ప్రతినిధులు రోస్టర్, మెరిట్ లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ లకు ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ విషయంలో తప్పులు జరుగుతున్నట్లు తెలిపారు. స్పోజ్ విషయంలో ఆప్షన్ ఇస్తే, వారి స్పోజ్ దగ్గరకే వెళ్లాలని అన్నారు. గతంలో పదోన్నతులు తిరస్కరించిన వారికి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ అన్ని పరిష్కరించాక ప్రక్రియ చేపట్టాలన్నారు. 317 జీవో క్రింద బదిలీ అయిన వారి విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 42 ప్రకారం దివ్యాoగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ పాటించాలన్నారు. అన్ని యూనియన్ల అభిప్రాయాలను విన్న కలెక్టర్, నిబంధనల మేరకు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 17 September 2023

ఖమ్మం జిల్లాలో సీతమ్మ సాగర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి : ముఖ్యమంత్రి కేసీఆర్

'తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం' సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు. 
అనంతరం ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. 
రైతాంగం కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుందని కెసిఆర్ అన్నారు. ఈ పండుగను గ్రామ గ్రామాన పెద్దఎత్తున సంబురాలతో జరుపుకుంటున్నాం.  కృష్ణా జలాలలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకుంటున్నాం.పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలివ్వడం జరిగింది. మిగిలిన పనులను చకచకా పూర్తి చేసుకోబోతున్నాం. దీంతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లా.. మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్దసంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం. ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్నసీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
దీని నుండి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది కనుక దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు అందించుకోబోతున్నాం. అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు సాగునీరు లభించనున్నది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే  85 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. రానున్న మూడు నాలుగేళ్లలో మొత్తం 1 కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ రైతన్నల లోగిళ్ళుబంగరు పంటలతోతులతూగుతాయి. “ధ్యేయమును బట్టి ప్రతీ పనీ దివ్యమగును” అన్నదానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధిస్తున్న అద్భుత ఫలితాలే ఉదాహరణ.
వైద్యవిద్యలో నూతన విప్లవం – జిల్లాకో మెడికల్ కాలేజీ దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ, వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నాం.
దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నం. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 2017లో ప్రభుత్వం 4 కాలేజీలు ఏర్పాటు చేసింది. అదే క్రమంలో 2020లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకోగా గతేడాదేవాటిని ప్రారంభించుకున్నం. మొన్న ఒకేరోజున 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్నాం. దీంతో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. 2014 నాటికున్న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎం.బీ.బీ.ఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది.
2014లో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, ఇవాళ మూడింతలు పెరిగిపోయాయి. ప్రతి ఏటా పదివేలమంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను.రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని, నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నది. వరంగల్ నగరంలో 1,116 కోట్ల రూపాయల వ్యయంతో 2,458 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. మరో రెండు వేల పడకలతో నిమ్స్ ఆస్పత్రిని విస్తరించుకుంటున్నాం. నూతన భవనాల పనులకు ఈ మధ్య నేనే స్వయంగా శంకుస్థాపన  కూడా చేశాను. వీటికి తోడు బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో రోగులకు మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దఫాలుగా నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో కోట్లాది మందికి దృష్టి లోపాలను సరిదిద్దగలిగాం. వీటికి తోడు కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ గర్భిణీలు, బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు తల్లీ, పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగాం.
క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో అవసానదశకు చేరిన రోగులకోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్లను కూడా నిర్వహిస్తున్నది. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చివరిరోజుల్లో రోగులు ప్రశాంత జీవనం గడిపేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
108, 104 వాహన సేవలకోసం ఇటీవలే అదనంగా 466 వాహనాలను ప్రారంభించాం. దీంతో ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాలలోపు ఈ వాహనాలు వస్తున్నాయి. సకాలంలో వైద్యసేవలు అందుతుండటంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం.
డబుల్ బెడ్రూంఇండ్ల పంపిణీ
గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నాం. ఇది నిరంతర కొనసాగే  ప్రక్రియ.
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నాం. పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి, మహిళల పేరిట ఆ గృహాలను అందచేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది.
సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం ‘‘గృహలక్ష్మి” పథకాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తొలి దఫాలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నాం.
పెరిగిన ఆసరా
ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాశిలోనూ, వాసిలోనూ పెన్షన్లు పెంచింది. గతంలో కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నం. దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే 3016 నుంచి 4016 రూపాయలకు పెంచుకున్నాం. 2014 నాటికి పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, ఇవాళ 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నం.
వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులతోపాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించింది. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది.
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు  సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాలలో కొంతమేరకు మేలు జరిగినా, ఆ తర్వాత ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకు సాగలేదు. దాంతో దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి.
అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం “తెలంగాణ దళితబంధు”. దళిత కుటుంబం తమకు వచ్చిన, తమకు నచ్చిన వృత్తి కానీ, వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈపథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.
ఇది ఒక నూతన చరిత్ర. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెదికినా కనపడదు. దళితులు వ్యాపార రంగంలో కూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో వారికి పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా కల్పించుకున్నం.
షెడ్యూల్డ్ కులాలు, షెల్యూల్డ్ తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని అమలు పరుచుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటున్నాం. బలహీన వర్గాలలోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి ఒక లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది.
వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి గొర్రెల పంపిణీ,మత్స్యకారుల కోసం చేపల పెంపకం, నేత కార్మికులకు సబ్సిడీపై నూలు, రంగుల సరఫరా, వారికి పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమా, మద్యం దుకాణాలలో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్, ఈత, తాటి చెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి ఎన్నోకార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కూడా విద్యుత్ రాయితీ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నది.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలవేళ రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డలకు తీపికబురు అందించింది. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, పోడు భూములకు పట్టాలందించింది. గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కొమ్రం భీమ్ పేరుతో ఏర్పాటయిన అసిఫాబాద్ జిల్లా నుంచే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఆదివాసీ, గిరిజనులకిచ్చిన పోడుభూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నది. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
ఐటి రంగం ప్రగతి
తెలంగాణలో ఐ.టి రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నది. రోజుకో కొత్త సంస్థ మనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నది.
ఇవాళ ఐ.టి. రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా, నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715 మందికి పెరిగింది. 2014లో ఐ.టి ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, నేడది 2లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాలైన  ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని, ఐ.టి టవర్లు నిర్మించుకున్నాం.
మన పల్లెలకు అత్యధిక జాతీయ అవార్డులు
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతులు మీదుగా మన స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణం.
పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు, అవసరాన్నిబట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిజిల్లా ప్రధాన కేంద్రంలో జిల్లా సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నాం. దీంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైంది.
విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలోలాగా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది.
పారదర్శక పరిపాలన నిరంతర విద్యుత్తూ వంటి కారణాలతోఅనేక అంతర్జాతీయ కంపెనీలుమనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.
హైదరాబాద్  నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నాం. ఈ ఎస్సార్డీపీ పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా 69వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నది.
సంతోషాల సాగుబడి
కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటిరంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుబీమా, 37వేల కోట్ల రూపాయల వరకూ పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయి.
వ్యవసాయం పండుగగా మారింది. సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబు రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో పూర్తిగా నిమగ్నమై ఉంది బి ఆర్ ఎస్ ప్రభుత్వం.
అన్నింటా నంబర్ వన్ తెలంగాణ
నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరుని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.
దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్నవయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు దేశంలో  ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దామని కెసిఆర్ పేర్కొన్నారు.
'అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ లోని 'అమరవీరుల స్థూపం' దగ్గర అమరులకు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.

Friday, 15 September 2023

జర్నలిస్టులకు నివాస స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా సమావేశం డిమాండ్...


ఖమ్మం : ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయని తక్షణం జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ డిమాండ్ చేశారు. అనారోగ్యం బారీనపడి అనేక మంది ఇబ్బందులు పడుతున్న, ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం స్పందించకపోవడం.. శోచనీయమన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం స్థానిక డిపిఆర్సి భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల తీరు మారిందన్నారు. ఒక పక్క యాజమాన్యాలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వాలు జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమయంలో 200 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఆ తర్వాత కూడా వృత్తి పరమైన ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణం అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. అనేక దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకుని పని చేస్తున్న వారికి కనీసం ఇండ్ల స్థలాలు కూడా మంజూరు చేయలేదని ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు నివాస స్థలాలు మంజూరు చేయాలని విరహత్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 19 రాష్ట్రాలు జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల నివాస స్థలాలు, హెల్త్ కార్డుల కోసం త్వరలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తదితరులు మాట్లాడారు. పెద్ద ఎత్తున చేరికలు : ఇటీవల కాలంలో ఖమ్మంజిల్లాలో టియుడబ్ల్యూజె (ఐజెయు)లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం అనేక మంది మీడియా ప్రతినిధులు యూనియన్లో చేరగా శుక్రవారం వివిధ ఛానెళ్లు, పత్రికలకు చెందిన 100 మంది టియుడబ్ల్యూజె (ఐజేయు)లో చేరారు. వారందరిని రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ సభ్యత్వం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హెచ్జేయు అధ్యక్షులు శివశంకర్ గౌడ్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంద్రశేషు, రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్, నర్వనేని వెంకట్రావు, సామినేని కృష్ణ మురారి, ఎస్కె ఖాదర్, ఖదీర్, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సివిఆర్ శ్రీనివాస్, ఖమ్మం నియోజక వర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు దువ్వా సాగర్, నామ పురుషోత్తం, జనార్ధనాచారి, మోహినుద్దీన్, తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పరిశ పుల్లయ్యకు సన్మానం : విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిశ పుల్లయ్యను టియుడబ్ల్యూజె (జాతీయు) కార్యవర్గం ఘనంగా సన్మానించింది. పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న పుల్లయ్యను టియుడబ్ల్యూజె (ఐజేయు)H రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది.

Cyber security regional Meeting Held at Hyderaba...

The 1st Regional Conference of Joint Cyber Crime Coordination Team (IV) is convened in Hyderabad on 15 September, 2023 at Telangana State Cyber Security Bureau Headquarters with key officials including Smt Sundari Nanda IPS, Special Secretary, Internal Security, MHA, Shri Anjani Kumar, DGP Telangana, Shri Jaspal Singh, DGP, Goa, Shri Stephen Raveendra, Director, Telangana State Cyber Security Bureau, Shri Rajesh kumar, CEO, I4C, MHA, Shri Shirish Jain, Jt CP, Intelligence, Maharashtra, Shri Yashasvi Yadav, Spl IGP Cyber, Maharashtra, Shri Shashi Kumar Meena, Addl CP (Crime), Mumbai, Shri Michaelraj, DIG, Spl Branch, Jharkhand and various other senior officers from Telangana, Maharashtra, Karnataka, Rajasthan, Goa, Haryana, I4C, MHA, ED. The power packed day long session cum workshop is to further strengthen states’ actions, coordination efforts, detection, prevention of cyber crimes among citizens and organisations. The officials are highly appreciative of proactive initiatives of Telangana and also visited the newly formed Telangana State Cyber Security Bureau.

Tuesday, 12 September 2023

నాట్లు వేసిన కృష్ణ రాథోడ్... కారేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటన


కారేపల్లి : గ్రామాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎనలేని కృషి చేస్తుందని రైతుల కోసం వ్యవసాయ కార్మికుల కోసం పలు పథకాలు తీసుకొచ్చిందని బజపా రాష్ట్ర గిరిజన మోర్చా కోశాధికారి కృష్ణ రాథోడ్ అన్నారు. మంగళవారం కారేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్లనే ప్రజల ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు
 ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ కార్మికులతో కలసి నాట్లు వేశారు. అనంతరం ఆయన రైతులని పలు గ్రామాల్లో ప్రజల్ని కలిశారు. కారేపల్లి మండలంలో చీమల వారి గూడెం మంగలి తండా గ్రామాల సందర్శించిన ఆయన భాజపా నాయకుడు ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు
ఈ పర్యటనలో కారేపల్లి మండలంలోని ఆల్య తండా కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బానోతు రాంజీ తన సహచరులతో కలిసి కృష్ణ రాథోడ్ నాయకత్వంలో భాజపాలో చేరారు. చీమల వారి గూడెం, మంగలితండ గ్రామాల సందర్భంలో కృష్ణ రాథోడ్ వెంట ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి కల్తీ రాంప్రసాద్, సీనియర్ నాయకులు జాటోత్ మధు నాయక్, శ్రీను,మాన్ సింగ్,పవన్ కుమార్, హనుమ, తదితరులు వున్నారు.

Monday, 11 September 2023

కదిలిన గిరిజన మోర్చా నేత.. పలు గ్రామాల్లో ప్రజల సమస్యలపై ఆరా...


కారేపల్లి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున.. ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కృష్ట రాధోడ్. వైరా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కదిలారు
సోమవారం కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కృష్ణ రాథోడ్ గిరిజనులతో మమేకమయ్యారు.
పలు గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వాటి పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. స్వయంగా 
గిరిజన బిడ్డనైనందున. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు తనకు తెలుసని అయినప్పటికీ స్వయంగా వారిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని తగు పరిష్కారం మార్గాలు చూపాలనుకుంటున్నాట్లు కృష్ణ రాథోడ్ పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడిందని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. తన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. కృష్ణ రాథోడ్ వెంట పలువురు భాజపా నాయకులు పర్యటనలో పాల్గొన్నారు

Tuesday, 5 September 2023

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్

తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్‌, భార్య గౌరీ ఖాన్‌, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల ఏడో తేదీన షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గతంలో అమీర్ ఖాన్ సినిమాకు వ్యతిరేకంగా హిందూ వర్గాలు నిర్ణయం తీసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో జవాన్ సినిమా విడుదల సందర్భంగా షారుక్ ఖాన్ తిరుమల సందర్శన హిందూ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది

Monday, 4 September 2023

గ్రీవెన్స్ దరఖాస్తుల పై దృష్టి పెట్టండి.. అధికారులకు కలెక్టర్ సూచన....


ఖమ్మం సెప్టెంబరు,04 : ‘‘గ్రీవెన్స్‌ డే’’లో సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అర్జిదారుల నుండి  దరఖాస్తులు స్వీకరించి సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన బండారు అనురాధ తాను రాజులదేవర పాడు అంగన్‌వాడీ సెంటర్‌`2 నందు అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా హెల్పర్‌గా సెలక్ట్‌ చేయడం జరిగినదని కాని ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్‌ ఇవ్వలేదని, తనకు ఆర్డర్‌ ఇప్పించి న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు.  తిరుమలాయపాలెం మందలం బచ్చోడ గ్రామంకు చెందిన ఎన్‌.రేణుక 20 సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడం జరిగినదని, తనకు ఇంటి స్థలం కాని, ఇళ్లుకాని లేవని తనకు ఒక కుమార్తెయని, తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కలెక్టరేట్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ విభాగం పర్యవేక్షకులను ఆదేశించారు.  చింతకాని మండలం నేరడ గ్రామంకు చెందిన షేక్‌ జరీనా   2 సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడం జరిగినదని తనకు ఎలాంటి ఆదెరువు లేదని, వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, వితంతు పింఛను ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన చాట్ల వాసుదేవరావు తాను డిగ్రి వరకు చదువుకోవడం జరిగినదని, దళితబంధు సర్వే సమయంలో తాను హైద్రాబాదులో ఉండటం జరిగినదని సమాచారం లేక పోవడంతో తాను దళితబంధు పథకంకు దరఖాస్తు చేసుకోలేక పోయినానని తనకు దళితబంధు పథకం మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం  ఎస్సీ కార్పోరేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.  వైరా మండలం రెబ్బవరం గ్రామంకు చెందిన దారా నాగమని, భర్త జానుకోటి తాము ఎపిజివిబి రెబ్బవరం బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.80, వేలు ఋణం తీసుకోవడం జరిగినదని, ప్రభుత్వం కల్పించిన రుణమాపీ పథకంలో తన పేరు లేదని, అట్టి రుణమాపీ వర్తింప చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎల్‌డిఎం, వైరా తహశీల్దారును ఆదేశించారు.  కంచికచర్లకు చెందిన కొమ్మురి లక్ష్మీ, భర్త భాస్కరరావు తమకు దెందుకూరు గ్రామం నందు సర్వే నెం.40/ఐ లో 1.9 ఎకరం తొమ్మిది కుంటల భూమి కలదని, కొత్త పాసుపుస్తకము నందు అట్టి భూమి తమ ప్రమేయం లేకుండా విభజించబడి 40/ఐ, 40/ఐ2 లుగా వేరొకరిపై నమోదు చేయడం జరిగినదని అట్టి భూమికి సంబంధించిన ప్రతులను సమర్పించు చున్నామని వాటిని పరిశీలించి తమకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం వైరా తహశీల్దారును ఆదేశించారు.  ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన వేమిరెడ్డి రంగారెడ్డి తనకు వారసత్వంగా చొప్పకట్లపాలెం గ్రామ రెవెన్యూలో సర్వేనెం.111/అలో ఒక ఎకరము భూమి కలదని , అట్టి భూమిని ధరణిలో దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, పాసు పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ధరణి విభాగం పర్యవేక్షకులను కలెక్టర్‌ ఆదేశించారు.  
‘‘గ్రీవెన్స్‌ డే’’లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 September 2023

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.... సూర్యుడిపై శోధనకు ఇస్రో తొలి అడుగు..

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1
నింగిలోకి దూసుకెళ్లింది.శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న PSLV-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది.
4నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భానుడి ఎల్1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది.అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో ప్రయోగించిన ఈ మిషన్ పై అందరి దృష్టి ఉంది. చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1 ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేయడం కుదరదు...గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి
రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.ప్రస్తుతం నాసా కు చెందిన ప్రోబ్ అనే రాకెట్క రోనాలోనికి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.

Friday, 1 September 2023

మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం..అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్


ఖమ్మం సెప్టెంబరు,01 : పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని, ప్రజలందరూ స్వచ్చంధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలని  అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ అన్నారు.   వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్‌ నవరాత్రి                  ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై శుక్రవారం నూతన కలెక్టరేట్‌  సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, స్ధంబ్రాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలకు మెరుగైన ఏర్పాట్లకై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ సూచించారు.  వినాయకచవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి, నవరాత్రి  ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేసేందుకు, మండపాల ఏర్పాటుకు గాను పోలీసు, సౌండ్‌ స్టిమ్‌, లైటింగ్‌, తదితర వసతులకై ఆయా మండపాల, ఉత్సవ కమిటీ బాధ్యులు ముందస్తు గానే అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన అన్నారు.   పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకై కేవలం మట్టి విగ్రహాలను  ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలన్నారు.    నగరంలోని మున్నేరు. ప్రకాష్‌నగర్‌ రెండు ప్రాంతాలలో గణేష్‌ నిమజ్జనం ఉంటుందని, అందుకనుగుణంగా ఆయా ప్రాంతాలకు విగ్రహాలను నిమజ్జనం కొరకు తరలించేందుకు ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని, పోలీసు అధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు.  నిమజ్జన ప్రాంతాలలో పారిశుధ్యం, త్రాగునీరు, లైటింగ్‌, బారికేడిం గ్‌, నిమజ్జన ప్లాట్‌ఫామ్స్‌ క్రేన్స్‌ తదితర ఏర్పాట్లను నగరపాలక సంస్థ ద్వారా చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్ళను సిద్దంగా ఉంచాలని, అగ్ని ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని, మత్స్య, అగ్నిమాపక శాఖ అధికారులను అదనపు కలెక్టర్‌ సూచించారు.  వినాయక విగ్రహాల మండపాల వద్ద అగ్నిప్రమాదాలు సంభవించకుండా తరచుగా తణిఖీ చేపట్టాలని అదేవిధంగా నిమజ్జన ప్రదేశాలలో సరిపడా లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు.  నిమజ్జనం రోజన 24 గంటల పాటు మధ్యం షాపులను పూర్తిగా మూసివేయాలని, ఎక్సైజ్‌ శాఖాధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు.  నిమజ్జన ప్రాంతాలలో ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖాధికారులకు సూచించారు.  ఖమ్మం నగరంతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీ పరిధిలో నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమీషనర్లను ఆయన సూచించారు.  
సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీల సహకారంతో మరింత మెరుగైన వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లను చేపడ్తామన్నారు.  ప్రజలందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించే విధంగా ప్రోత్సహిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.
విద్యుత్‌ శాఖ ఎస్‌.ఈ సురేందర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్‌ మల్లీశ్వరీ, మున్సిపల్‌ ఇ.ఇ కృష్ణలాల్‌, ఎక్స్‌జ్‌ సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి, డిప్యూటీ డిఎం.అండ్‌.హెచ్‌.ఓ డా॥సైదులు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాష్‌, ఏసిపిలు గణేష్‌, రామానుజం, డివిజనల్‌ పంచాయితీ అదికారి పుల్లారావు, ఖమ్మం, కల్లూరు ఆర్‌.డి.ఓలు గణేష్‌, అశోకచక్రవర్తి, ఖమ్మం ఆర్భన్‌, రూరల్‌ తహశీల్దార్లు స్వామి, రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు కన్నం ప్రసన్న కృష్ణ,   వినోద్‌లహోటి, దండా జ్యోతి రెడ్డి, డి.జయ్‌కిరణ్‌, దిలీప్‌ కుమార్‌, అల్లిక అంజయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.