Friday, 15 September 2023

జర్నలిస్టులకు నివాస స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా సమావేశం డిమాండ్...


ఖమ్మం : ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయని తక్షణం జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ డిమాండ్ చేశారు. అనారోగ్యం బారీనపడి అనేక మంది ఇబ్బందులు పడుతున్న, ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం స్పందించకపోవడం.. శోచనీయమన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం స్థానిక డిపిఆర్సి భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల తీరు మారిందన్నారు. ఒక పక్క యాజమాన్యాలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వాలు జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమయంలో 200 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఆ తర్వాత కూడా వృత్తి పరమైన ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణం అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. అనేక దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకుని పని చేస్తున్న వారికి కనీసం ఇండ్ల స్థలాలు కూడా మంజూరు చేయలేదని ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు నివాస స్థలాలు మంజూరు చేయాలని విరహత్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 19 రాష్ట్రాలు జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల నివాస స్థలాలు, హెల్త్ కార్డుల కోసం త్వరలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తదితరులు మాట్లాడారు. పెద్ద ఎత్తున చేరికలు : ఇటీవల కాలంలో ఖమ్మంజిల్లాలో టియుడబ్ల్యూజె (ఐజెయు)లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం అనేక మంది మీడియా ప్రతినిధులు యూనియన్లో చేరగా శుక్రవారం వివిధ ఛానెళ్లు, పత్రికలకు చెందిన 100 మంది టియుడబ్ల్యూజె (ఐజేయు)లో చేరారు. వారందరిని రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ సభ్యత్వం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హెచ్జేయు అధ్యక్షులు శివశంకర్ గౌడ్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంద్రశేషు, రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్, నర్వనేని వెంకట్రావు, సామినేని కృష్ణ మురారి, ఎస్కె ఖాదర్, ఖదీర్, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సివిఆర్ శ్రీనివాస్, ఖమ్మం నియోజక వర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు దువ్వా సాగర్, నామ పురుషోత్తం, జనార్ధనాచారి, మోహినుద్దీన్, తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పరిశ పుల్లయ్యకు సన్మానం : విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిశ పుల్లయ్యను టియుడబ్ల్యూజె (జాతీయు) కార్యవర్గం ఘనంగా సన్మానించింది. పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న పుల్లయ్యను టియుడబ్ల్యూజె (ఐజేయు)H రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది.

No comments:

Post a Comment