Friday, 10 November 2023

విలువైన ఓటుపై. చర్చించండి..ఎన్నికల పరిశీలకులు తుషార్ కాంత మహంతి


ఖమ్మం, నవంబర్ 10: స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం, పాలేరు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్ కాంత మహంతి అన్నారు. శుక్రవారం ఎన్నికల పరిశీలకులు,  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ఓటుహక్కుపై చైతన్యం కల్గించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. ఓటు విలువైన ఆయుధమని, విలువైన ఓటును ప్రలోభాలకు గురై అమ్ముకోవద్దని, ఈ దిశగా చర్చ జరగాలని, కుటుంబీకులు, గ్రామస్థుల్లో అవగాహన కల్పించి, చైతన్యం తెచ్చే బాధ్యత యువతపై ఉందని అన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యమని ఆయన తెలిపారు. ఓటు హక్కు విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరు సమానమని, అందరికి ఒకే ఓటు ఉంటుందని, అందరికి సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగం ప్రకారం వుంటాయని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవాలని, ఓటు ఏ పోలింగ్ కేంద్రం, ఏ ప్రాంతంలోవుందో తెలుసుకోవాలని, తమదే కాక, తమ సంబంధికుల ఓట్ల విషయమై విచారణ చేయాలన్నారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి, ఎపిక్ కార్డు రానివారు, వారి గుర్తింపు ధ్రువీకరణ చూపి ఓటు వేయవచ్చన్నారు. ఎన్నికల్లో ధన, ప్రలోభాల ప్రభావం లేకుండా, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో యువత పాలుపంచుకోవాలన్నారు. ఎన్నికల్లో ధన, ప్రలోభాలు ఏవైనా దృష్టికి వస్తే సి విజిల్ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తేవాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా చేసే ఫిర్యాదులో ఫిర్యాదుదారు ఫోన్ నెంబర్, వివరాలు లేకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుకు 20 నిమిషాల్లో అధికారులు చేరుకొని చర్యలు తీసుకుంటారని, 100 నిమిషాల్లో చర్యలు చేపట్టకపోతే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేరుకుంటుందని, సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుకు అధికారులు జవాబుదారీతనం వహిస్తారని ఆయన అన్నారు. డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా ప్రయివేటు ఆస్తులపై పోస్టర్లు, ప్రచారం, ఓటర్లకు బెదిరింపులు, రాత్రి 10 తర్వాత ప్రచారం తదితర వాటిపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. యువత ఓటు తప్పనిసరిగా వేయాలని, ఓటు వేసే సామాజిక బాధ్యతను ఎప్పటికి మరువకూడదని వారు అన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన ఓటరు ఉత్తేజిత వీడియో పాటను విద్యార్థినులు ఆసక్తిగా తిలకించారు. సి విజిల్ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేయించి, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యాప్ లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ స్వీప్ జిల్లా నోడల్ అధికారి కె. శ్రీరామ్, కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. పద్మావతి, కళాశాల లెక్చరర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment