Saturday, 25 November 2023

ప్రవర్తన మీరితే కఠిన చర్యలు : కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, నవంబర్ 25: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ హెచ్చరించారు. కలెక్టర్ శుక్రవారం అర్ధరాత్రి స్వయంగా నగరంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నయాబజార్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, సారధినగర్, గొల్లబజార్, గాంధీచౌక్, చర్చి కాంపౌండ్, తుమ్మలగడ్డ, నిజాంపేట, జడ్పిసెంటర్ లలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. శుక్రవారం నగరంలో 3 ఎఫ్ఐఆర్ లు నమోదుచేసినట్లు ఆయన అన్నారు. నగరంలోని కొత్తగూడెం ప్రాంతం ఆర్య కలర్ జిరాక్స్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ కార్యకర్త ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని, ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన అన్నారు. కస్బా బజార్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త రూ. 27,900 లు, ఓటర్ స్లిప్పులతో పంపిణీకి ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎదురుగా పోలీస్ తనిఖీల్లో మహబూబాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరకు ఓటర్లకు పంపిణీకి తరలిస్తున్న రూ. 8 లక్షల 70 వేలను సీజ్ చేసి 1 టౌన్ లో, కాంగ్రెస్ కార్యకర్తలపై ఖమ్మం 1 టౌన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ఎంసిసి టీములు, 17 ఎస్ఎస్టీ టీములు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటుచేసి 24/7 నిరంతర నిఘా పెట్టినట్లు, 12 ఇంట్రాస్టేట్, 6 ఇంట్రాడిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అక్రమ నగదు, మద్యం తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు. సి విజిల్ యాప్ పై ఓటర్లలో, యువతలో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. ఎన్నికల అక్రమాలు దృష్టికి వస్తే, సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, సి విజిల్ ఎస్పీ ద్వారా ఫిర్యాదుచేస్తే, నిఘా టీమ్ 20 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటుందని, ఫిర్యాదుదారు వివరాలు బహిర్గతం కావని, 100 నిమిషాల లోపు ఫిర్యాదుపై చర్యలు పూర్తవుతాయని కలెక్టర్ అన్నారు. ఓటర్లు డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, దీనిని నోటుకు అమ్ముకోవద్దని, నైతికతతో ఓటువేసి, సామాజిక బాధ్యత గుర్తెరుగాలని కలెక్టర్ తెలిపారు.

*#నూతన వివిప్యాట్ గోడౌన్ ప్రారంభం#...*
ఖమ్మం, నవంబర్ 25: నూతన కలెక్టరేట్ ఆవరణలో రూ. 278 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ శనివారం ప్రారంభించారు. ఇవిఎం ల భద్రతా అవసరాలు, ఇవిఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ తదితర ఆవసరాలకు నూతన గోడౌన్ ను ఉపయోగించనున్నటు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనంతరం 5  నియోజకవర్గాల ఇవిఎం లు భద్రపర్చనున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా గోడౌన్ అంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, జెఇ విశ్వనాథ్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment