Saturday, 25 June 2022

మట్టిగణపతే మహాగణపతి.. భవిష్యత్ తరాల హితామే మన లక్ష్యం కావాలి..



ఖమ్మం, జూన్ 25   (మణికుమార్ కొమ్మమూరు) :  మట్టి గణపతులనే పూజిద్దామని, ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం జరుపుకుందామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ, కుమ్మరి సంఘ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు 2021 ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు నిషేధించినట్లు, జిల్లా లోని చెరువులు, జల వనరుల్లో నిమజ్జనానికి అనుమతి లేనట్లు ఆయన తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల అమ్మకం చేయకూడదని, చేస్తే, షాపుల సీజ్ చేయడంతో పాటు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గత గణేష్ చతుర్థి సమావేశంలో ఉత్సవ కమిటీల సూచన మేరకు మట్టి గణపతుల నిమజ్జనం పై ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతికి విరుద్ధంగా చర్యలను ఎవరు సమర్థించరని, గణేష్ నిమజ్జనం తర్వాత దుష్ప్రభావాలు తరతరాలకు ఏర్పడడం మంచిది కాదని ఆయన అన్నారు. పర్యావరణ హిత నిమజ్జనం కలిసికట్టుగా అందరం జరుపుకుందామన్నారు. మున్నేరులో నిమజ్జనం చేస్తున్నట్లు, మున్నేరు జలాలు కలుషితం కాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. పర్యావరణ సమతుల్యతకి విఘాతం కల్గడంతో అకాలవర్షాలు, విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మట్టి గణపతులను ప్రతిష్టించే మండపాలకే అనుమతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మట్టి గణపతుల తయారీకి కార్యాచరణ చేయాలని, ప్రభుత్వ యంత్రాంగం నుండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్దదైన ఖైరతాబాద్ విగ్రహం కూడా మట్టితో తయారు చేస్తున్నారన్నారు. కాలుష్య రహిత, పర్యావరణ హిత గణేష్ చతుర్థి కి మనమందరం ప్రతినబూనాలన్నారు. 
     ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, కార్పొరేటర్ ప్రసన్న, మునిసిపల్ కమిషనర్లు, ఇర్రిగేషన్ అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ, కుమ్మరి సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment