Friday, 24 June 2022

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్


  

ఖమ్మం, జూన్ 24: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 77 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు, ఇట్టి చోట్ల అన్ని భద్రతా చర్యల్ని చేపట్టాలన్నారు. రోడ్డు మలుపులు, జంక్షన్లు, ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటుచేయాలని, ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. హై వే లపై ఉన్న గ్రామాల ప్రజలకు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై నియతకాల సమీక్షలు చేయాలన్నారు. జిల్లా రోడ్డు భద్రతా మ్యాప్ ను అభివృద్ధి పర్చాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే త్వరితగతిన చేరేలా అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడం, ప్రాణాలు కాపాడటం చేసిన వారిని ప్రోత్సహించేలా సన్మాన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రోడ్లపై పశువులు తిరగకుండా చూడాలని, రోడ్లపై ఉన్న పశువులను గోశాలలకు తరలించాలని ఆయన అన్నారు.  రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు కేజీ వీల్స్ సమస్య రాకుండా చూడాలని, సీజ్ చేసిన వాహనాలను పట్టి కోనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని ఆయన తెలిపారు. 
      సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్  మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 295 ప్రమాదాలు జరిగినట్లు, ఇందులో 101 మంది మరణాలు సంభవించగా, 284 మంది గాయపడ్డట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారిగా వారి వారి పరిధిలో తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నగర పరిధిలో పోలీసు అధికారులు, మునిసిపల్ కమీషనర్ తో సమావేశమై, ఏ ఏ చోట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ఏ అవసరాలు ఉన్నాయో పరిశీలన చేసి, అమలుకు కార్యాచరణ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ చేయాలన్నారు. మీడియన్స్ ప్రారంభ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మీడియన్స్ గ్యాప్ ల వద్ద అటు ఇటు కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

     ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపిలు షబరీష్, ఏఎస్ సి బోస్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిని డా. మాలతి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, ఏసిపిలు, సిఐలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment