ఖమ్మం, నవంబర్ 24: గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లాలో పర్యటించి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం క్రింద క్రొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితా లో తొలగింపు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తల్లంపాడు, జలగం నగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్ లను సందర్శించి అక్కడ చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ క్రొత్త ఓటర్లు పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఉన్నది, మరణించిన వారి ఓట్ల తొలగింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి క్రొత్త ఓటర్ నమోదు ఫారాలు ఇచ్చింది, ఇప్పటివరకు ఎంతమందిని నమోదు చేసుకుంది అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రం పరిధిలో క్రొత్తగా వచ్చిన వారిని ఎలా నమోదు చేసుకుంటుంది, ఎన్ని దరఖాస్తులు వచ్చింది, విచారణ ఎలా చేస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఆధార్ సేకరణ పురోగతిని అడిగారు. సంబంధిత తహశీల్దార్లు ప్రతివారం బూత్ లెవల్ అధికారులను పిలిచి ప్రక్రియ పై సమీక్షించాలన్నారు. మండల పరిధిలో ఎన్ని కళాశాలలు ఉన్నావో, వాటి నుండి దరఖాస్తులు స్వీకరించి, అడ్రసుల ప్రకారం సంబంధిత మండలాలకు పంపాలన్నారు. సూపర్వైజర్లు వారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన చేయాలని, ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థినులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మంచి, చెడులు జరుగుతుంటాయని, అన్నిటికీ మనం సాక్ష్యంగా ఉంటామని, వీటితోనే మన సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనే అవగాహన ఉంటే చాలని ఆయన తెలిపారు.
కళాశాలలో 680 మంది క్రొత్త ఓటర్లు గా నమోదు అవుతున్నట్లు, ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, మంచి సమాజ నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలని అన్నారు. ఓటరుగా అర్హులైన వారందరు నమోదవ్వాలని,ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, ఓటుతో మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ముందస్తు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ఓటు చాలా విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.
కార్యక్రమంలో కళాశాల ఓటరు నమోదుకు నియమించబడ్డ అంబాసిడర్లచే ఓటరు నమోదుకు చేపడుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఓటు ప్రాముఖ్యత వారు తెలిపారు. ఓటు అమ్ముకోకూడదని విద్యార్థినులు చేసిన స్క్రిప్ట్ ఆలోచింపచేసింది.
ఈ సందర్భంగా ఓటరు నమోదుపై రూపొందించిన పోస్టర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. పద్మావతి, ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎస్డీసి దశరథం, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, తహశీల్దార్లు సుమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment