Monday, 30 September 2024

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి ,: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ఖమ్మం :ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వోఓ ఎం. రాజేశ్వరి లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశిస్తూ, సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేశారు.తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన ముదిరెడ్డి నర్సిరెడ్డి ఎస్సారెస్పీ ఓల్డ్ కెనాల్ డిబిఎం 60.25 ఆర్ క్రింద 32 కుంటల భూమి కోల్పోయానని దానికి నష్టపరిహారం అందలేదని, ఆ భూమి రైతు బంధు డబ్బులు కూడా రాలేదని, నష్టపరిహారం, రైతుబంధు డబ్బులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, భూ సేకరణ విభాగానికి రాస్తూ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పి. నాగరాజు మార్చి 4న పంచాయతీ కార్యదర్శిగా పోస్ట్ ఇస్తామని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ చేశారని, ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రస్తుతం కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, వి.ఎం. బంజర మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ పరిశీలించి, ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్ల రెవెన్యూ సాతానిగూడెం గ్రామానికి చెందిన డి. మంగతాయమ్మ సర్వే నెంబర్ 520లో  తన 9 గుంటల భూమిని వై. వెంకట నారాయణ ఆక్రమించారని,  రెవెన్యూ రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన కోట సుమ తాను బిఎస్సీ,  పిజిడిసిఏ, ఇంగ్లీష్, తెలుగు లోయర్, హయ్యర్ టైపింగ్ విద్యార్హత కలిగి ఉన్నానని, తనకు చెవిటి, మూగ బ్యాక్ లాగ్ పోస్టులలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***********************************************
*చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం చేయాలి....జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
***********************************************
*చిన్నారి పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*
***********************************************
ఖమ్మం : చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్  కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన *చిన్నారి* పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్* మాట్లాడుతూ, పిల్లల అక్రమరవాణా, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్ లైన్ వేధింపులు, మాదకద్రవ్యాలు మొదలగు అంశాల నివారణ, పిల్లలలో వచ్చే శరీర మార్పులు, గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన సంబంధిత అంశాలను వివరిస్తూ *చిన్నారి* గోడ ప్రతులను రూపొందించి అందరిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, పిల్లల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్ లైన్ వేధింపులు , మాదకద్రవ్యాలు మొదలగు అంశాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించాలని అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్డీవో రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డిసిపివో విష్ణువందన, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
 డిటిడిసిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం... జిల్లా సంక్షేమ అధికారి కే. రాంగోపాల్ రెడ్డి*
------------------------------------------------------------------------
*వయోవృద్ధులు, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించు నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొనాలి*
------------------------------------------------------------------------
సంచాలకులు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్  ఆదేశాలనుసారం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలను స్థానిక టీ.టీ.డీ.సీ. నందు ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా నందు గల వయోవృద్ధులు, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించుచున్న నిర్వాహకులు అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కే. రామ్ గోపాల్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sunday, 29 September 2024

*తెలంగాణలో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు*


తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది,
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
రాష్ట్రంలో అన్ని దేవాల యాల్లో విజయ డెయిరీ నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కరీంగనర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యిని చేరవేసింది. 
విజయ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేసి భక్తులకు ప్రసాదంగా అందించే పనిలో అధికార యంత్రంగం నిమగ్నమై ఉంది.ఉమ్మడి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తుంటారు. 
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో తప్పిదం జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ అలర్ట్ అయ్యింది. ప్రధాన ఆల యాల్లో తాజా ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం వాడిన కరీంనగర్ డెయిరీ నెయ్యిని బంద్ చేసి విజయ డెయిరీ నెయ్యి కంటే కిలో 12రూపాయలు విజయ డెయిరీ నెయ్యి తక్కువకు లభిస్తుండటంతో ప్రభుత్వం నిర్ణయం ఆలయాలకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు...

Wednesday, 25 September 2024

వరద బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి కట్టుదిట్టమైన చర్యలు - అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ


ఖమ్మం : వరద బాధితులు కోల్పోయిన వివిధ రకాల సర్టిఫికెట్ల జారీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు.
బుధవారం ముంపు బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ, పాఠశాల విద్యలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్* మాట్లాడుతూ,  వరదల కారణంగా దెబ్బతిన ఇండ్లలో వరద బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వరదల కారణంగా కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ కోసం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇండ్ల వద్ద నిర్వహించిన సర్వే ఆధారంగా ఇప్పటి వరకు దాదాపు పదవ తరగతి సర్టిఫికెట్ల కోసం 680, ఇంటర్ 454, డిగ్రీ/బీటెక్ సంబంధించి 94, పీజి 47,  పాస్ పోర్ట్ కొరకు 29 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.అదే విధంగా రెవెన్యూ కి సంబంధించి ఆదాయ సర్టిఫికెట్లు 269, కుల ధ్రువీకరణ పత్రాలు 376, నివాస ధ్రువీకరణ పత్రాలు 189, ఓబిసి సర్టిఫికెట్లు 77, పాస్ పుస్తకాలు 88, ఆధార్ కార్డు 388, రేషన్ కార్డు 182 కోల్పోయినట్లు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. విద్యా సర్టిఫికెట్లకు సంబంధించి విద్యార్థి పేరు, చిరునామా, పాసైన సంవత్సర వివరాలు విద్యా శాఖకు జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిపాదనలు పంపి సర్టిఫికెట్ల జారీ చేయిస్తామని అన్నారు. పాస్ పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడి వాటిని జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ సంబంధిత సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రాబోయే రెండు, మూడు వారాలలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వారికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని 237 ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ అందించేందుకు వారానికి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనికోసం 120 మంది మాస్టర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నామని  అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రతి బుధవారం జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందిస్తున్నారని అదనపు కలెక్టర్ అన్నారు.ప్రతి నెలా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థుల హాజరు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణను కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. జిల్లాలోని 50 పాఠశాలల్లో ముందస్తుగా ఇంగ్లీష్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో దశల వారీగా జిల్లా వ్యాప్తంగా ఈ ల్యాబ్ లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పాత్రికేయులు అడిగిన వివిధ సందేహాలకు, ప్రశ్నలకు అదనపు కలెక్టర్ సమాధానాలు చెప్పారు.ఈ మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 24 September 2024

తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయండి : మంత్రి పొంగులేటి


కూసుమంచి : తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపు నిచ్చారు.మంగళవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు లతో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి రూ. 23.50 లక్షల అంచనా విలువతో చేపట్టిన జిల్లా పరిషత్ హైస్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల పట్ల ప్రజలకు ఉన్న చులకన భావం  మరిపించే విధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు విశ్వసించి కూసుమంచి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 936 మంది విద్యార్థులు  చదువుతున్నారని, ఇది చాలా సంతోషమని, దీనికి కారణమైన ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలిపారు. పాఠశాలకు అవసరమైన 3 ఫేజ్ కరెంట్ రెండు మూడు రోజులలో అందించడం జరుగుతుందని అన్నారు. 
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, వారి సూచనలు తీసుకుని 8 నుంచి 10వ తరగతి చదివే బాలికలు 604 మందికి సైకిళ్ళు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు.పాలేరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రిల్లో మినరల్ వాటర్ ప్లాంట్  లను దసరా సెలవులు లోపు పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేస్తామని అన్నారు.  విద్య, వైద్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు.పాఠశాల శుభ్రం చేసేందుకు కార్మికులు లేక, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు గురవుతున్నామని హెడ్ మాస్టర్ లు తెలియజేసిన సమస్యను క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించామని, అదేవిధంగా పాఠశాలను శుభ్రం చేసేందుకు ప్రతినెల విద్యార్థుల సంఖ్య అనుగుణంగా నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు.కంప్యూటర్ విద్య కోసం టెక్నికల్ బృందం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని, క్రీడలను సైతం తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, త్వరలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షతో పాఠశాలలకు తల్లిదండ్రులు పంపుతున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత పిల్లలకు ఉంటుందని, మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కష్టపడి చదువుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు.  చెడు అలవాట్లకు విద్యార్థులు బానిస కాకుండా దూరంగా ఉండాలని మంత్రి తెలిపారు.*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,*  జిల్లాలో 5 రకాలుగా విద్య పై దృష్టి పెడుతున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థమయ్యేలా విద్యా బోధన, ఉపాధ్యాయుల హాజరుపై ప్రతి రోజూ పర్యవేక్షణ, జవాబుదారీతనంతో పేరెంట్, టీచర్స్ మీటింగ్, స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అనుభవం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ఇక్కడ ప్రైవేట్ కంటే మెరుగ్గా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని అన్నారు. వంద శాతం 10వ తరగతి పరీక్ష ఫలితాలు సాధన దిశగా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం 8 నుండి 10వ తరగతి చదువుతున్న కూసుమంచి మండలానికి చెందిన 102 మంది విద్యార్థినిలకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, పాఠశాల హెచ్ఎం వీరస్వామి, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, 23 September 2024

JNTUHలో వ్యక్తిగత అవగాహన సదస్సు...


పాలేరు JNTUH ఇంజనీరింగ్ కళాశాల నందు వ్యక్తిగత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే వెంకటేశ్వరరావు,  రిజిస్ట్రార్ JNTUH ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల జీవన ప్రగతికి  అవసరమైన, ప్రయోజకరమైన విషయాలను ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో డాక్టర్ వి వెంకటేశ్వర రెడ్డి BICS డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ జెఎన్టియు  డాక్టర్ బి రవీంద్రారెడ్డి, ప్రొఫెసర్ డైరెక్టర్, AUTONOMOUS COLLEGES, JNTUH నోడల్ ఆఫీసర్, డాక్టర్  డి.రమేష్, ప్రొఫెసర్ CSE మరియు ప్రిన్సిపల్ JNTUH UCE, పాలేరు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది  విద్యార్థులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

80 సంవత్సరాలుగా చుక్క నీరు ఆహారం ముట్టని యోగి ఇక లేరు..

#80ఏండ్ల పాటు నీరూ,ఆహారం తీసుకోకుండా జీవించిన #మహానుభావుడు ప్రపంచాన్ని విడిచిపెట్టాడు!!!
ఆధునిక శాస్త్రానికి పజిల్‌గా మారిన #బాబా గారు ఎట్టకేలకు ప్రపంచాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.#80సంవత్సరాల పాటు #ఆహారం_లేకుండా మరియు #చుక్క_నీరు_తాగకుండా జీవించిన సన్యాసి ప్రహ్లాద్  బ్రహ్మస్థానం పొందాడు.మహారాజ్ గారు ఆరావల్లిలో ఉన్న శక్తిపీఠం, (అంబాజీకి సమీపంలో) గబ్బర్ పర్వత పాదాల వద్ద నివసించేవారు.10 సంవత్సరాల వయస్సులో,ఆయన తన ఇంటిని విడిచిపెట్టి ఇక్కడ వచ్చాడు. భగవతి అంబాజీని గ్రహించిన తర్వాత ఆహారం మరియు నీటిని విడిచిపెట్టాడు.దేశంలోని శాస్త్రవేత్తల బృందం బాబాకు కూడా అనేక వైద్య పరీక్షలు చేశారు. 15 రోజుల పాటు CCTV కెమెరా పర్యవేక్షణ లో 24/7  ఉంచబడ్డాడు.బాబా గారిని డిస్కవరీ ఛానెల్‌లో కూడా చూపించారు, ఎందుకంటే వైద్యులు మరియు శాస్త్రవేత్తలు నమ్మడానికి సిద్ధంగా లేరు, బాబా తన యోగ శక్తితో  భోజనం,నీరు లేకుండా ఏండ్ల పాటు జీవించడం జరిగింది.ఇది సాధారణ మానవులకు అసాధ్యం కనుక ఆయనను శాస్త్రవేత్తలు,టీవీ వారు ఎన్నో పరీక్షలు చేశారు....🙏🙏

Sunday, 22 September 2024

కల్తీ చేసిన వారి ఆస్తులు జప్తుచేయండి : లడ్డు వివాదంపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్




ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ తిరుపతి వెంకటేశ్వర ఆలయంలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇప్పుడు ఈ విషయంపై ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రకటన వెలుగులోకి వచ్చింది.ఆయన మాట్లాడుతూ.. 1857లో సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగిందో చరిత్ర పుస్తకాల్లో చదివామని చెప్పారు. మరి ఈ లడ్డూ హిందువుల మనోభావాలను ఎంతగా దెబ్బతీస్తుందో ఇప్పుడు మనం చూస్తున్నామన్నారు. ఇది క్షమించరాని నేరమని మండిపడ్డారు.
మార్కెట్‌లో లభించే నెయ్యి గురించి ఏమిటి?'
ఇది దురుద్దేశంతో కూడుకున్నదని, ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారి అత్యాశకు పరాకాష్ట కాబట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. వారి ఆస్తులన్నీ జప్తు చేసి జైల్లో పెట్టాలని, ఇలా ఎవరు చేసినా జోక్యం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో కేవలం లడ్డూలనే కాదు.. బజారులో లభించే నెయ్యిని కల్తీ చేసి, శాకాహారం అని ముద్రవేసి, దానికి మాంసాహారం కలిపితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 *ఆయన ఇంకా మాట్లాడుతూ..* 
ఆలయ నిర్వహణకు సాధువులు, స్వాములు, ఆధ్యాత్మిక గురువుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని.. ఉత్తర, దక్షిణ ఆధ్యాత్మిక గురువులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని.. వాటిని ప్రభుత్వం పర్యవేక్షించాలన్నారు. కానీ ప్రధాన నిర్ణయాలు, పర్యవేక్షణ, ప్రతిదీ ఎస్‌జీపీసీ వంటి మతపరమైన బోర్డులు, ముస్లిం శరీరం వలె, క్రిస్టియన్ బాడీ వంటివి చేయాలన్నారు.

Saturday, 21 September 2024

బిపిసిఎల్ నుండి టిటిడి ఛైర్మన్ వరకు సక్సెస్ఫుల్ జర్నీ ఆయనే శ్యామలరావు ...

ఎంసెట్ లో 29 th ర్యాంక్..తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్...క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు.
చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా  34 th ర్యాంక్ ..
అసోం లో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా  పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు MD గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్  గా చేసారు. సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటివరకూ ఈ ట్రాక్ రికార్డు చేరుకున్నవాళ్ళు లేరు..
వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల  ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే  తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది.
ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం..
ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు గారు.టీటీడీ ఈవో.
మీరంతా  తిరుపతి లడ్డు మీద వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తున్నారు కదా. .మరి అంతటి కలియుగ వైకుంఠం తిరుమల ఈవో డైనమిక్ వ్యక్తి, శ్యామలరావు గారి వివరాలు తెలుసుకుని 
మీ అందరితో అభిమానం గా పంచుకుందాం అనుకున్నా..
నోట్: ఇది పాలిటిక్స్ కి సంబంధం లేదు.ఒకవ్యక్తి శక్తి గా మారిన విధానం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది.


దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు : సజ్జానార్

హైదరాబాద్ : త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే తీవ్ర‌మైన క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రించారు. నిందితుల‌పై  పోలీస్ శాఖ స‌హ‌కారంతో రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కుషాయిగూడ డిపో డ్రైవ‌ర్ దార‌వ‌త్ గ‌ణేష్‌ను వీసీ స‌జ్జ‌న‌ర్  శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. డ్రైవ‌ర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
అప్జ‌ల్ గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌కు వెళ్తున్న రూట్ నంబ‌ర్ 231/1  మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సులో విధులు నిర్వ‌ర్తిస్తోన్న డ్రైవ‌ర్ గ‌ణేష్‌పై దుండ‌గులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు.  ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ ఆరుగురు  తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గ‌ణేష్ కు తీవ్ర గాయ‌ల‌వ‌డంతో అప‌స్మార‌క స్థిత‌లోకి వెళ్లిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీ వై జంక్ష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిందీ ఘ‌ట‌న‌. 
ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, బైక్‌ల‌పై వ‌చ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ ఉస్మానియా యూనివ‌ర్శిటీ పోలీసులు వెంట‌నే స్పందించార‌ని చెప్పారు. దుండ‌గుల‌పై బీఎన్ఎస్‌లోని 109, 132, 352, 351(2), r/w 3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. ఐదుగురు దుండ‌గుల‌ను శ‌నివారం అరెస్ట్ చేశారని తెలిపారు. 
ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 
డ్రైవ‌ర్‌ను ప‌రామర్శించిన వారిలో జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ రావు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎం ఖుష్రోషా ఖాన్, తదితరులు ఉన్నారు.

Thursday, 19 September 2024

యూడైస్ పోర్టల్ లో సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ




ఖమ్మం : యూడైస్ పోర్టల్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)లో విద్యా సంస్థల సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లో యూడైస్ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించిన సమాచారం ఆన్ లైన్ లో యుడైస్ లో నమోదు చేసే ప్రక్రియ , తదితర వివరాలను అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ,*  ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఉన్నత పాఠశాలలు, కళాశాలల సంపూర్ణ సమాచారాన్ని యుడైస్ పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తప్పనిసరిగా అందజేయాలని, సరైన సమాచారం సేకరించాలని అదనపు కలెక్టర్ అన్నారు. యుడైస్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అధికారులకు అందజేసి సంపూర్ణంగా సహకరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలోని స్కూల్ బస్సుల డ్రైవర్లందరికీ ట్రాఫిక్ నియమ నిబంధనలు, చిన్నపిల్లలు వాహనంలో ఉన్నప్పుడు పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ప్రైవేటు పాఠశాలల డ్రైవర్లకు హెల్త్ చెకప్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే డ్రైవర్లందరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో గుడ్, బ్యాడ్ టచ్ లపై టీచర్లు పిల్లలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని,  ప్రతి నెల మూడవ శనివారం పాఠశాలలో పేరెంట్, టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, తరగతి గదులలో టీఎల్ఎం ప్రకారం విద్యాబోధన జరగాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. 
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్, ఇతర శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖరశర్మ, డి.డి. సోషల్ వెల్ఫేర్ కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఆర్.సి.ఓ.లు, ఆర్ఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవి, ప్రోగ్రామ్ అధికారి రామకృష్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సమయపాలనతోనే సివిల్స్ తీరం చేరుతారు: డాక్టర్ శ్రీజ


 *ఖమ్మం: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జవాబులు వేగంగా రాయటంతోపాటు సమయపాలన అత్యంత ప్రధానమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీజ అన్నారు.
వరంగల్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగిన ఆమె.. 2021 బ్యాచ్‌లో జాతీయ స్థాయిలో 20వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 
 *మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు..* 
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో పాఠశాల, ఇంటర్‌ విద్యాభ్యాసం పూర్తయ్యింది. 2013లో సమైక్య రాష్ట్రంలో ఎంసెట్‌లో 72వ ర్యాంక్‌ సాధించి ఉస్మానియా వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాను. ఎంబీబీఎస్‌ అనంతరం పీజీ చేయాలనుకున్నాను. మా నాన్న శ్రీనివాస్‌ (ప్రైవేట్‌ ఉద్యోగి), తల్లి లత (స్టాఫ్‌ నర్స్‌) ప్రోత్సాహంతో సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధమయ్యాను. నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మానాన్న కోరిక. హైదరాబాద్‌లో ఆర్నెల్లు శిక్షణ తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న విద్యావిషయక సామగ్రిపై ఎక్కువగా ఆధారపడి సివిల్స్‌ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాను.
 *సాంస్కృతిక కార్యక్రమాలపై అమితాసక్తి..* 
ఆదిలాబాద్‌ జిల్లాలో శిక్షణ కలెక్టర్‌గా పనిచేశాను. ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అక్కడి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాను. చిన్నతనం నుంచే మానాన్న నన్ను డైనమిక్‌గా పెంచారు. కరాటే సైతం నేర్పించారు. కర్నాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించాను. పాటలు పాడుతాను. సాంస్కృతిక కార్యక్రమాలపై అమితాసక్తి ప్రదర్శిస్తాను. ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు భిన్నమైన పరిస్థితులు ఖమ్మం జిల్లాలో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తన భవిష్యత్తు కెరీర్‌కు ఖమ్మం జిల్లా మంచి బాటలు వేస్తుందని ఆశిస్తున్నా.
 *విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి* 
విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నాను. ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనువైన మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నాను. పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలి. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడితే ప్రజారోగ్యం కుదుటపడుతుంది. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి. పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి.
 *పరీక్షలు రాసేవారు ఒత్తిడికి గురికావొద్దు* 
సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమవుతాయి. పోటీ పరీక్షలు రాసేవారు ఒత్తిడికి గురికాకుండా నిబ్బరంగా ఉండాలి. పరీక్షలు ముగిసే వరకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. జవాబు తెలియని ప్రశ్నల గురించి పదేపదే ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆన్‌లైన్‌లో చాలా మెటీరియల్‌ అందుబాటులో ఉంది. అందులోనుంచి ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ రాసుకోవాలి.

Monday, 16 September 2024

ప్రధాని నివాసంలో పుంగనూరు లేగ దూడ జననం.. వీడియో షేర్ చేసిన నరేంద్ర మోడీ...

న్యూఢిల్లీ ;  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడ సందడి చేస్తోంది 
*మోదీ ఈ దూడకు  దీపజ్యోతి అని అని నామకరణం చేశారు. ఈ లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని చెప్పారు.*దీపజ్యోతిపై మోదీ పెట్టిన వీడియో సందేశం నేటిజన్స్ ఫిదా అవుతున్నారు  ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన కోడె దూడ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
*దూడ నుదుటిపై దీపం ఆకారం:* కాగా ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్​లో ఓ గోవు లేగ దూడకు జన్మినిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు. దీపజ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అనే పేరు పెట్టినట్లు మోదీ వివరించారు.

Friday, 13 September 2024

విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ఏచూరి : సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు



ఖమ్మం, సెప్టెంబర్‌ 13 (శుక్రవారం):`  దేశానికి దిశానిర్దేశం చేసే అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారు.. వాటిలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మార్క్సిజం విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత సీపీఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు ప్రసంగించారు. భారతదేశ వామపక్ష ఉద్యమంలో ఓ అరుణతార రాలిందని, ఓ సిద్దాంతకర్త, ఓ దార్శనికుణ్ణి దేశం కోల్పోయిందని అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకు కమ్యూనిస్టు నేతగా సీతారాం ఏచూరి చేసిన కృషి ఎనలేనిదన్నారు. లౌకిక, వామపక్ష పార్టీలను సమన్వయం చేస్తూ విచ్ఛిన్నకరవాదులను, ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తున్న తరుణంలో సీతారాం ఏచూరి మృతి చెందడం విషాదకరమని పేర్కొన్నారు. దేశంలో మతతత్వం ఎంత ప్రమాదకరమో..తన రచనల ద్వారా వివరించారని చెప్పారు. దేశంలో కొద్దిమంది చేతుల్లోకి సంపద పోగవుతుందని.. పేదలు, సంపన్నుల దేశంగా భారతదేశం విడిపోయిందని స్పష్టం చేసినట్లు వివరించారు. యూపీఏ`1, ఎన్‌డీఏలు ఏకపక్షంగా పాలన సాగిస్తున్న క్రమంలో పార్లమెంట్‌లో ప్రజా వ్యతిరేక బిల్లులను రద్దు చేయించడంతో పాటు.. వాయిదా వేయించడంలో ఏచూరి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కమ్యూనిస్టు సిద్దాంతమంటే బీజేపీ సైతం ఏచూరిని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిరదంటే ఆయన వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమో అర్థం అవుతుందన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగినా.. యూపీఎస్సీ ఆలిండియా ర్యాంకర్‌గా.. జేఎన్‌యూ అధ్యక్షుడుగా.. ఆయన చూపించిన పోరాట పటిమ కీర్తించదగినదని అన్నారు. ఎమర్జెన్సీ విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం కమ్యూనిస్టుల నేతృత్వంలో ఏచూరి పోరాటపటిమకు తలొగ్గక తప్పలేదని తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను మలుస్తూ.. ఇండియా కూటమి ఆవిర్భావానికి రూపకల్పన చేసిన వారిలో ముఖ్యులు ఏచూరి అన్నారు. ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం వంటి ఎన్నో ప్రజోపయోగ చట్టాల రూపకల్పనలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని విశ్లేషించారు. అంతర్జాతీయ కమ్యూనిస్టులను సమన్వయం చేసుకోవడంతో పాటు సాధారణ సంబంధాలను నెరపడంలోనూ ఏచూరి ముందుండేవారని చెప్పారు. మార్క్సిజం విలువల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. ఏచూరి సిద్ధాంతం కమ్యూనిస్టులకు ప్రేరణ: బాగం హేమంతరావు సీతారాం ఏచూరి సిద్ధాంతం కమ్యూనిస్టులకు ఓ ప్రేరణ, స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు పేర్కొన్నారు. 90వ దశకంలో నూతన ఆర్థిక విధానాలు, సోవియట్‌ యూనియన్‌ పతనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏచూరి కమ్యూనిస్టులకు ఓ ధైర్యంగా ఉన్నారని తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటని అన్నారు. మార్క్సిజం`లెనినిజం శాస్త్రీయమైనది అదే శాశ్వతమని తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు. భారతం, రామాయణ ఇతివృత్తాల ఆధారంగా సమకాలీన అంశాలను విశ్లేషిస్తూ దేశ ప్రజానీకానికి ఉపయోగపడే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి కృషి చేశారని వివరించారు. ఏచూరి అమరుడు ` అజరామరుడు అని పేర్కొన్నారు.
G భారత రాజ్యాంగ పీఠికలో అంశాల ఆధారంగా రచనలు: కొల్లి సత్యనారాయణ
భారత రాజ్యాంగ పీఠికలో అంశాల ఆధారంగా సీతారాం ఏచూరి రచనలు చేశారని ఐలూ రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ తెలిపారు. స్టడీ అండ్‌ స్ట్రగుల్‌ సిద్ధాంతాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కి ఆపాదించిన ఘనత ఏచూరిదే అన్నారు. న్యాయ వ్యవస్థపైన తన అభిప్రాయాలను వెల్లడిరచడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకే భారత న్యాయవ్యవస్థలో మార్పులు చేశారని, నూతన చట్టాలు తీసుకువచ్చారని విశ్లేషణలను ఏచూరి తన రచనలు, ఉపన్యాసాల ద్వారా వెల్లడిరచారని తెలిపారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐలో తాను పనిచేస్తున్నప్పుడు తొలిసారి ఏచూరిని కలిసినప్పుడు ఆయనలో ఆవేశం, ఉద్రేకం చూశానని, కానీ ఆ తరువాతి కాలంలో ఆయన పరిణతి పొందిన తీరు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిందని అన్నారు.
G ప్రజా ఉద్యమాలు, పార్లమెంట్‌లో దిట్ట: పి.సోమయ్య
ప్రజా ఉద్యమాల నిర్వహణ, పార్లమెంట్‌లో వివిధ అంశాలను విశ్లేషించడంలో సీతారాం ఏచూరి దిట్ట అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య చెప్పారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బీజేపీ చట్ట విరుద్ధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఏచూరి కేసు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాతే ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా వివిధ పార్టీలు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నాయో వెల్లడిరచాల్సి వచ్చిందన్నారు. వ్యవస్థపై ఆధారపడి చట్టాలు ఉంటాయి తప్ప.. చట్టాలపై ఆధారపడి వ్యవస్థలు ఉండవని చెప్పిన నాయకుడు ఏచూరి అని తెలిపారు. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్‌ ఉందా? అని నిరూపించిన నేత సైతం ఆయనేనని పేర్కొన్నారు.
ఈ సంతాప సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌, మహిళా సంఘం నాయకురాలు ఏపూరి లత, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు గుండాల కృష్ణ, కాంగ్రెస్‌ రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థి సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, సీపీఐ(ఎం.ఎల్‌.) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏచూరి మృతి పార్టీకి తీరని లోటు : ఎర్ర శ్రీకాంత్*


*ఖమ్మం త్రీ టౌన్*/ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించడం చాలా దురదృష్టకరమని ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ తెలిపారుస్థానిక ఖమ్మం త్రీ టౌన్ లో బుడిగం కృష్ణమూర్తి భవనంలో సీతారాం ఏచూరి సంతాప సభ సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా  శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థి గా తన ఉద్యమ ప్రయాణం ప్రారంభించి 1974లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి అధ్యయనం .పోరాటం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే మహోత్తరమైన లక్ష్యాలతో అలుపెరగకుండా పోరాటం చేస్తూ J N U ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికలలో మూడుసార్లు అధ్యక్షులుగా గెలిచి చదువులో కూడా గోల్డ్ మెడలు సాధించినటువంటి గొప్ప మేధావి 1984లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా 1986లో ఆలిండియా కార్యదర్శివర్గ సభ్యులుగా తర్వాత కాలంలో పోలిట్ బ్యూరోనుండి  సభ్యుడిగా ప్రస్తుతం సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందటం సిపిఎం పార్టీకి వారి కుటుంబానికి తీరనిలోటు భారతదేశం గొప్ప భరతమాత బిడ్డను కోల్పోయింది జాతీయ సమైక్యత సమగ్రతల కోసం నిరంతరం కృషి చేశారు మతోన్మాదానికి వ్యతిరేకంగా. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. అవినీతి కరమైన ఎన్నిక బాండ్లకు వ్యతిరేకంగా చట్ట పరంగా కూడా పోరాడారు ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంటు రంగంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై అనే అంశాలను పార్లమెంట్లో మాట్లాడారు అనారోగ్యంతో 72 సంవత్సరాలు వయసులో మరణించడం దేశానికి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు కమ్యూనిస్టు శ్రేణులు ఎంతో దుఃఖ సముద్రంలో ఉన్న ఈ తరుణంలో మార్క్సిజం  లెనినిజం అజేయంగా కామ్రేడ్ సీతారామ్ ఏచూరి గారి ఆశయ సాధన కోసం  ముందుకు సాగుదాం 
        సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజినేపల్లి  శ్రీనివాసరావు సీనియర్ నాయకులు బండారు యాకయ్య కార్యదర్శి వర్గ సభ్యులు బండారు వీరబాబు, శీలం వీరబాబు త్రీ టౌన్ కమిటీ సభ్యులు ఎస్ కే బాబు తదితరులు పాల్గొన్నారు

16 న మద్యం దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు తెరవరాదు : పోలీస్ కమిషనర్

ఖమ్మం : ఈ నెల 16 న గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్‌ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి 17వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు (మద్యం దుకాణాలు)  మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు  సెప్టెంబర్‌ 16 న మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా  గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించడానికి  సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ  ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 16న సోమవారం వినాయక నిమజ్జన కార్యక్రమం అధికంగా జరుగుతుందని,  మంగళవారం కూడా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుందని,ఇందుకోసం అధికారులు  ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకొని సిద్ధం కావాలని తెలిపారు. వినాయక నిమజ్జనానికి సంబంధించి ఖమ్మం నగరం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలలో అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్తి చేయాలని,  ఉత్సవ కమిటీ సభ్యులతో, ఊరు పెద్దలతో ముందస్తుగానే సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ సహకారం అందించేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని అధికారులు ముందస్తుగానే పరిశీలించి అక్కడ అవసరమైన అన్ని జాగ్రత్తలు ఉన్నాయో, లేదో తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. గణేష్ విగ్రహం నిమజ్జనం  అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని,  నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో సీరియల్ నెంబర్ గా రూట్ మ్యాప్ కేటాయించాలని, వినాయక ఊరేగింపు రూట్లలో ఎక్కడ విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండవద్దని, విగ్రహం హైట్ ప్రకారం ఎక్కడ విద్యుత్తు తీగల వల్ల ఇబ్బంది కాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 
వినాయక నిమజ్జన స్థలాల వద్ద క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.  వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, వినాయక నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్  విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం చేసే ప్రదేశాలలో అవసరం మేరకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, వైద్య శిభిరాలను, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా  జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అవసరమైన మేర క్రేన్లు అందుబాటులో పెట్టుకోవాలని, జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని, గణేష్ నిమజ్జనానికి  త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మెడికల్, లైటింగ్ వంటి సౌకర్యాలు వుండేలా చూడాలని అన్నారు. గణేష్ నవరాత్రులు ముగించి నిమజ్జనం చేసే సందర్భంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అందుబాటులో వుండాలని  అన్నారు.  
*గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత:*
గణేష్ నిమజ్జనానికి కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని *ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్* అన్నారు. సెప్టెంబర్ 16న వెయ్యికి పైగా విగ్రహాలు, సెప్టెంబర్ 17న 800 నుండి 900 వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని, దీనికి వీలుగా ప్లాట్ ఫారం వద్ద అవసరమైన క్రేన్ లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.  నిమజ్జన ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లతో పాటు పడవలను అందుబాటులో ఉంచాలని పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు. 
ట్రాఫిక్ ప్రణాళిక ప్రకారం వినాయక విగ్రహాలు వచ్చే విధంగా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పోలీస్ కమీషనర్ తెలిపారు. వినాయక ఊరేగింపు లో ముఖ్యమైన ప్రాంతాలలో వాహన మెకానిక్ లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పోలీస్ కమీషనర్ తెలిపారు.
       
     ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రం సింగ్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు,  మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Wednesday, 11 September 2024

తెలంగాణ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన* నష్టం పై అంచనాలు...


ఖమ్మం:సెప్టెంబర్ 11: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయిన ప్రాంతాల్లో  బుధవారం కేంద్ర బృందాలు పర్యటించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలను ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.*ఖమ్మం జిల్లా..ఖమ్మం రూరల్ మండలం కస్నా తాండ వద్ద వరద ముంపు ప్రాంతాన్ని దెబ్బతిన్న ఇండ్లను కేంద్ర బృందం పరిశీలించింది.
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వరద భీభత్సం గురించి వివరించారు.*
మున్నేరు, ఆకేరు వరదల తో నష్టపోయిన ప్రాంతా లను సందర్శించిన   ఈ టీమ్ లోని అధికారులు రెండుగా విడిపోయి వరద నష్టాన్ని పరిశీలించారు
ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నేస్పీ కాల్వలు, వంతెనలను పరిశీలించగా జిల్లా అధికారులు వారికి ఇష్టం వివరాలను తెలియజేశారు.
ఈరోజు మధ్యాహ్నం కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు తండాలో నష్టం జరిగిన 100 ఎకరాలకు పైగా పంటలను పరిశీ లించి రైతులతో అధికారులతో కేంద్ర బృందం  మాట్లాడారు. అనంతరం  ఖమ్మం రూరల్‌ మండలంలోని గూడురుపాడు, తనగం పాడు, కస్నాతండాలో ఇళ్లు, పంటలను సెంట్రల్ టీమ్ పరిశీలించింది. 3: 30 ప్రాంతంలో తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా, ఖమ్మం రూరల్‌ మండలంలోని ఎంవీ.పాలెం లో ఇళ్లు, పంటలకు జరిగిన  పరిశీలించి వివరాలు సేకరించారు..అనంతరం మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు మహా బూబాబాద్ చేరుకుని అక్కడ పంటలను.. ఒక ప్రాంతంలో పరిశీలించారు.. బుధవారం రాత్రికి ఖమ్మంలో బస్సు చేయనున్న  కేంద్ర బృందం రేపు గురువారం ఉదయం 7:30 నుంచి ఖమ్మం రూరల్‌ మండలంలోని పోలేపల్లి పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కాలనీలో పర్యటించి..., 
8:15 నుంచి 10: 30 గంటల వరకు బొక్కలగడ్డ, మోతీనగర్‌, 35వ డివిజన్‌ వెనుకభాగం గ్యాస్‌ గోదాం సమీపాన, ప్రకాశ్‌నగర్‌, వైకుంఠధామం, ధంసలా పురం, కొత్తూరులో పర్యటించనుంది. 
అలాగే, ఉదయం 10:40 నుంచి 11గంటల వరకు జలగంనగర్‌ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించనుంది. ఆ తర్వాత ఈ టీమ్ సూర్యాపేట జిల్లాలోని కోదాడకు వెళ్లనుంది.జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపి. సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కె. కుష్వాహ, టి. నియాల్ కన్సన్, డా. శ్రీ శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం కూసుమంచి మండలం భగత్ వీడు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, తనకంపాడు, కస్నా తాండ, తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామాల్లో, రెండో బృందం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, భద్రు తాండ, పాలేరు, ఎర్రగడ్డ తాండ గ్రామాల్లో పర్యటించి, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. గ్రామాల్లో ఇసుక మేటలు, మట్టి తో నిండిన పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో జరిగిన నష్టం, తిరిగి సేద్య యోగ్యంగా పొలాన్ని తయారుచేయుటకు అగు ఖర్చును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ (విపత్తు నిర్వహణ) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ లు పర్యటించారు.  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందం పర్యటన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూపిస్తూ, భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విలయాన్ని బృందానికి వివరించారు.
    ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 8 September 2024

మా గౌరవం ప్రజాహిత జర్నలిజానికే : సి.ఎం.రేవంత్ రెడ్డి

జర్నలిస్టులకు ప్రజలే ఎజెండాగా ఉండాలి.
సమాజహితమే జర్నలిజం అభిమతం కావాలి.
అటువంటి జర్నలిస్టులకు,నిజమైన జర్నలిజానికి 
ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుంది. వారి క్షేమానికి, సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది.
రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన పత్రాలు అందజేసే 
కార్యక్రమంలో పాల్గోన్నారు సి.ఎం.రేవంత్ రెడ్డి .
పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని జర్నలిస్టు హౌసింగ సొసైటీకి అందజేయడం ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

Thursday, 5 September 2024

ఆ నలుగురిని బ్రతికించాడు..తాను జ్ఞాపిక అయినాడు..


విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.
చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.
తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది.ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణం అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం వుంది.

Wednesday, 4 September 2024

మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ*- *అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*


*కూసుమంచి :* భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి బుధవారం అందజేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల  కుటుంబాన్ని  పరామర్శించి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుమారులు ఎస్. కె. యూసుబ్, ఎస్. కె. షరీఫ్ లకు అందజేశారు. మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచిలో ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, కూసుమంచి మండల తహసీల్దార్ సురేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Monday, 2 September 2024

బాధితులను వెంటనే ఆదుకోండి.. సీఎంకు సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి...


సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు  మాట్లాడుతూ ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరంతో సహా జిల్లాలో సుమారు పదివేల కుటుంబాలు నష్టపోయాయి నగరంలో వేలాదిమంది గృహాలు పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలతో మిగిలినారు.మున్నేరు పరివాహక ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తిగా మునిగి దెబ్బతిన్న గృహాలకు మూడు లక్షల పరిహారం ఇవ్వాలని. పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని.వరదల్లో కొట్టుకుపోయి మరణించిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని.
దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ,  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


వరద కాలంలో బురద రాజకీయాలు వద్ధు.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

మున్నేరు వరదతో అతలాకుతలమైన ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం నగరంలో పలు ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు వరద వరద అనంతర సహాయ చర్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు అధికారుల పనితీరును ప్రశంసిస్తూ ప్రతిపక్షాలు ఈ సమయంలో బురద చల్లడ సరికాదని పేర్కొన్నారు. హైదరాబాదు నుండి సాయంత్రం ఐదు గంటల కు ఖమ్మం రూరల్ మండలం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పల ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం ఖమ్మం మున్నేరు  వరద ముంపు ప్రాంతాలను ఆయన సందర్శించారు అనంతరం ఆయన ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ పౌర సంబంధాల రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,  జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తదితరులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వరదలు అనంతర సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
ఖమ్మం  సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ....
భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయింది...
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనిభారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చాను..
ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నాం..
వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది... వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం...
భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరాం...తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం..
నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి జరిగినట్లు పేర్కొన్నారువర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగింది...
తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి  చేశానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
ఇది కష్ట సమయం....
పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారు...
తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారు...
కేటీఆర్ అమెరికా లో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారు
జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు...
రాజకీయ ప్రయోజనాల కోసం మేము పనిచేయం...
వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారు...
ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదు...
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో 
రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా?
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తాం...
పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తాం..
వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నాం
తక్షణ అవసరాల కోసం  జిల్లా ల కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశాం
వరదలపైన గత ప్రభుత్వం ఒక పాలసీ ని కూడా రూపొందించలేదు...
రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం..
వరదసాయ చర్యల్లో పాల్గొనాలని  కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చాం...
ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం...
రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి...
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలి...
 వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలి. ..
ప్రజలకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు..వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలి...ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు   మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు...