ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 16న సోమవారం వినాయక నిమజ్జన కార్యక్రమం అధికంగా జరుగుతుందని, మంగళవారం కూడా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుందని,ఇందుకోసం అధికారులు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకొని సిద్ధం కావాలని తెలిపారు. వినాయక నిమజ్జనానికి సంబంధించి ఖమ్మం నగరం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలలో అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్తి చేయాలని, ఉత్సవ కమిటీ సభ్యులతో, ఊరు పెద్దలతో ముందస్తుగానే సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ సహకారం అందించేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని అధికారులు ముందస్తుగానే పరిశీలించి అక్కడ అవసరమైన అన్ని జాగ్రత్తలు ఉన్నాయో, లేదో తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. గణేష్ విగ్రహం నిమజ్జనం అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో సీరియల్ నెంబర్ గా రూట్ మ్యాప్ కేటాయించాలని, వినాయక ఊరేగింపు రూట్లలో ఎక్కడ విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండవద్దని, విగ్రహం హైట్ ప్రకారం ఎక్కడ విద్యుత్తు తీగల వల్ల ఇబ్బంది కాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
వినాయక నిమజ్జన స్థలాల వద్ద క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, వినాయక నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం చేసే ప్రదేశాలలో అవసరం మేరకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, వైద్య శిభిరాలను, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అవసరమైన మేర క్రేన్లు అందుబాటులో పెట్టుకోవాలని, జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని, గణేష్ నిమజ్జనానికి త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మెడికల్, లైటింగ్ వంటి సౌకర్యాలు వుండేలా చూడాలని అన్నారు. గణేష్ నవరాత్రులు ముగించి నిమజ్జనం చేసే సందర్భంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అందుబాటులో వుండాలని అన్నారు.
*గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత:*
గణేష్ నిమజ్జనానికి కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని *ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్* అన్నారు. సెప్టెంబర్ 16న వెయ్యికి పైగా విగ్రహాలు, సెప్టెంబర్ 17న 800 నుండి 900 వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని, దీనికి వీలుగా ప్లాట్ ఫారం వద్ద అవసరమైన క్రేన్ లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లతో పాటు పడవలను అందుబాటులో ఉంచాలని పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ ప్రణాళిక ప్రకారం వినాయక విగ్రహాలు వచ్చే విధంగా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పోలీస్ కమీషనర్ తెలిపారు. వినాయక ఊరేగింపు లో ముఖ్యమైన ప్రాంతాలలో వాహన మెకానిక్ లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రం సింగ్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.
No comments:
Post a Comment