*ఖమ్మం: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జవాబులు వేగంగా రాయటంతోపాటు సమయపాలన అత్యంత ప్రధానమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అన్నారు.
వరంగల్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగిన ఆమె.. 2021 బ్యాచ్‌లో జాతీయ స్థాయిలో 20వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
*మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు..*
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో పాఠశాల, ఇంటర్ విద్యాభ్యాసం పూర్తయ్యింది. 2013లో సమైక్య రాష్ట్రంలో ఎంసెట్‌లో 72వ ర్యాంక్ సాధించి ఉస్మానియా వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో చేరాను. ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకున్నాను. మా నాన్న శ్రీనివాస్ (ప్రైవేట్ ఉద్యోగి), తల్లి లత (స్టాఫ్ నర్స్) ప్రోత్సాహంతో సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యాను. నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మానాన్న కోరిక. హైదరాబాద్‌లో ఆర్నెల్లు శిక్షణ తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న విద్యావిషయక సామగ్రిపై ఎక్కువగా ఆధారపడి సివిల్స్ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 20వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాను.
*సాంస్కృతిక కార్యక్రమాలపై అమితాసక్తి..*
ఆదిలాబాద్ జిల్లాలో శిక్షణ కలెక్టర్‌గా పనిచేశాను. ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అక్కడి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాను. చిన్నతనం నుంచే మానాన్న నన్ను డైనమిక్‌గా పెంచారు. కరాటే సైతం నేర్పించారు. కర్నాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించాను. పాటలు పాడుతాను. సాంస్కృతిక కార్యక్రమాలపై అమితాసక్తి ప్రదర్శిస్తాను. ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు భిన్నమైన పరిస్థితులు ఖమ్మం జిల్లాలో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తన భవిష్యత్తు కెరీర్‌కు ఖమ్మం జిల్లా మంచి బాటలు వేస్తుందని ఆశిస్తున్నా.
*విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి*
విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నాను. ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనువైన మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నాను. పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలి. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడితే ప్రజారోగ్యం కుదుటపడుతుంది. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి. పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి.
*పరీక్షలు రాసేవారు ఒత్తిడికి గురికావొద్దు*
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమవుతాయి. పోటీ పరీక్షలు రాసేవారు ఒత్తిడికి గురికాకుండా నిబ్బరంగా ఉండాలి. పరీక్షలు ముగిసే వరకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. జవాబు తెలియని ప్రశ్నల గురించి పదేపదే ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆన్‌లైన్‌లో చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది. అందులోనుంచి ముఖ్యమైన అంశాలతో నోట్స్ రాసుకోవాలి.
No comments:
Post a Comment