ఖమ్మం కల్చరల్, మే 19.
స్థానిక గాంధీ చౌక్ లోనే వర ప్రదాత శిరిడి సాయి మందిరంలో గురువారం వైశాఖ మాస పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి లక్ష పూలతో ప్రత్యేకంగా అర్చన చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై లక్ష మల్లెపూల అర్చనలో పాల్గొన్నారు. స్వామివారి విగ్రహం వద్ద గులాబి పూలతో సాయి రామ్ అక్షరాలను రూపొందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తులు భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కల్లోలం వలన గత రెండు సంవత్సరాలలో లక్ష మల్లెపూలు అర్చన నిర్వహించలేక పోయామని ఈసారి వైశాఖ మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ వేడుకలలో ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావుతో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి అరవపల్లి నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వేడుకలన్నింటిని ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
No comments:
Post a Comment