Monday, 27 May 2024

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేయండి : సీఈసి రాజీవ్ కుమార్


ఖమ్మం, మే 27: లోకసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు గ్యానేష్ కుమార్, డా. సుక్ భీర్ సింగ్ సందు లతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, ఖమ్మం నూతన కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెలువడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హల్ కు ఇవిఎం యంత్రాల తరలింపుకు అవసరమైన మేర సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే ప్రతి సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులపై సంపూర్ణ శిక్షణ అందించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని, వివిప్యాట్ లెక్కింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో  అవసరమైన మేర కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి టేబుల్ వద్ద ప్రత్యేక బృందాలను నియమించాలని అన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, కౌంటింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ వీడియో సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జెడ్పి సిఇఓ వినోద్, డిఆర్డీవో సన్యాసయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment