Thursday, 9 May 2024

కీలక దశలోకి చేరాం:...కౌంట్ డౌన్ షురూ...


ఖమ్మం, మే 9: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చివరి 72గంటలు చాలా కీలకమైనవని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏసీపీలతో పోలింగ్ కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ లో చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ,  పోలింగ్ కు 48 గంటల ముందు చాలా కీలకమని అన్నారు. మైకులు, డీజేలునిషేధించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 11వ తేది సాయంత్రం 6 గంటలకు ముగించాలని తెలిపారు. అయితే ఐదుగురితో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చుని అన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ చేయరాదని తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో జిల్లా వ్యాప్తంగా సీఆర్‌పీసీ 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ప్రచార ప్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఉంచరాదని తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్లను వాడరాదని చెప్పారు. ఈ సమయం తర్వాత నియోజకవర్గానికి బయట వ్యక్తులు ఉండరాదని తెలిపారు. అన్ని లాడ్జీలు, హోటళ్ళు కళ్యాణమండపాలు, అతిధిగృహాలను తనిఖీలు చేయాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందు నుండి మద్యం షాపులను మూసివేయాలని తెలిపారు. ఫంక్షన్ హాళ్ళల్లో కులసంఘాలు, ప్రొఫెషనల్ సంఘాల సమావేశాలు జరగకుండా చూడాలన్నారు. టివిల్లో ఇంటర్వ్యూలు నిషేధం ఉంటాయన్నారు. ప్రింట్ మీడియాలో పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు ఎంసిఎంసి కమిటీ అనుమతి పొందిన యాడ్ లు మాత్రమే ప్రచురించాలన్నారు. ఎక్సైజ్ శాఖ మద్యం నియంత్రణ కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఓటింగ్ వంద శాతం జరిగేలా స్వీప్ కార్యాచరణ క్రింద కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నేడు సాయంత్రం నూతన కలెక్టరేట్ నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. మే 13 న పోలింగ్ లో పాల్గొని ఓటు వేయాలని కోరుతూ బల్క్ ఎస్ఎంఎస్ లు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ పూర్తిచేసినట్లు ఆయన అన్నారు. ఓటరు సమాచార స్లిప్పులతో పాటు, ఓటర్ గైడ్ అందజేసి, సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆటోలు, వాహనాల ద్వారా విస్తృత ప్రచారంతో ఓటర్లలో చైతన్యానికి చర్యలు చేపట్టామన్నారు. దివ్యాoగులు, వయోవృద్ధుల కొరకు పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇట్టి వాహనాలను పోలింగ్ కేంద్రం కారిడార్ వరకు అనుమతించాలన్నారు. పోటీ అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రం లోనికి అనుమతించాలన్నారు. మీడియా వారికి ఎన్నికల సంఘముచే జారీచేసిన అథారిటీ పాసులు ఉన్నవారికి పోలింగ్ కేంద్రం లోకేషన్ కి అనుమతించాలన్నారు. ఫిర్యాదులను వెంటనే స్పందించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో, రిషిప్షన్ కేంద్రం ఖమ్మం శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల లో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, ప్రలోభాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన పై దృష్టి పెట్టాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు పెంచాలన్నారు. ప్రతి వాహనం తనిఖీ చేయసలన్నారు. స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల కు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, వేణుగోపాల్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సిఐఎస్ఎఫ్ అధికారులు మల్కీత్ సింగ్, మనోజ్ కుమార్, ఎస్డీసి రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, మధు, ఏఎస్పీలు, డిఎస్పీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment