Friday, 3 May 2024

పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి.. నిబంధనలు పాటించండి.. కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, మే 3 : భారత ఎన్నికల కమీషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించాలని, అందుకు పూర్తిగా సన్నద్ధం కావాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం రిటర్నింగ్ అధికారి, స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలల్లో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కలిగి, సమస్య ఉత్పన్నమైతే అనుసరించాల్సిన విధి, విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ ఏజెంట్లు రాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసి తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని,  పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఇవిఎం యంత్రాలపై పీవో, ఏపీవో, ఓపివో లందరికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించినట్లు, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, తహశీల్దార్లు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment